తాజా కథలు @ CCK

ఒకరిని ఎప్పుడూ చిన్నచూపు చూడకూడదు. తర్వాత మనమే సిగ్గుపడవలసి వస్తుంది

2015-05-13 09:05:01 చిన్నారుల కథలు
అనగనగా ఒక చిలుక, నెమలి, కోడిపుంజు ఉండేవి. ఆ మూడూ ఒక చోట అనుకోకుండా కలుసుకున్నాయి. మాటల సందర్భంలో అవి తమకు భగవంతుడు ప్రసాదించిన శక్తుల గురించి ముచ్చటించుకుంటూ గర్వపడుతున్నాయి. వాటి మాటలన్నింటినీ చెట్టుమీదున్న కాకి విన్నది. అదే సమయంలో కాకికి వాటి దగ్గరలో ఒక పురుగు కనపడి రివ్వున కింద వాలి నోటితో చంపి తిన్నది. అది చూసి ఆ మూడూ, కాకిని అసహ్యించుకున్నాయి. దాని రూపాన్ని, ఆహారపు అలవాట్లను ఏవగించుకున్నాయి. వాటి మాటలకు, తన పట్ల అవి ప్రవర్తిస్తున్న తీరుకు, కాకి ఎంతో బాధపడింది. అంతలో, ఎక్కడినుంచి వచ్చిపడిందో వాటి మీద ఒక వల వచ్చిపడింది. కాకితో పాటు ఆమూడూ అందులో చిక్కుకున్నాయి. లబోదిబోమని కేకలు వేశాయి. ఈలోగా వేటగాడు వల బిగించి ఇల్లు చేరాడు.

వేటగాడి భార్య వలలో చిక్కుకున్న కాకిని చూసి "అయ్యయ్యో! అపచారం. కాకిని బంధించి తేవడం ఇంటికి అరిష్టం. మన పిల్లా పాపా చల్లగా ఉండాలంటే వెంటనే వీటన్నింటినీ విడిచిపెట్టు" అంటూ కేకలు వేసింది. భార్య మాటలు కాదనలేక వేటగాడు వలవిప్పి వాటిని వదిలేశాడు.

కాకి పుణ్యాన తమకు కూడా ప్రాణాలు దక్కినందుకు అవి ఎంతో సంతోషించాయి. అంతలోనే, అంతకు ముందు తాము ప్రవర్తించిన తీరు గుర్తొచ్చి తమను క్షమించమంటూ కాకిని వేడుకున్నాయి.

నీతి :

ఒకరిని ఎప్పుడూ చిన్నచూపు చూడకూడదు. తర్వాత మనమే సిగ్గుపడవలసి వస్తుంది.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం