తాజా కథలు @ CCK

తుంటరితనం అనర్థాలకు హేతువు

2015-04-16 03:05:01 చిన్నారుల కథలు
ఊహ తెలియని వయసులోనే తల్లిని కోల్పోయిన గోపిని తండ్రి గారాబంగా పెంచడంతో తుంటరివాడయ్యాడు. పరిసరాల్లోని జంతువులను హింసించడం, అవి బాధపడుతుంటే ఆనందించడం అలవాటుగా మారిపోయింది. ఇష్టమైనప్పుడు బడికి వెళ్లడం, లేనప్పుడు ఆటలు ఆడుకోవడం చేస్తుండేవాడు.

ఒకరోజు బడికి వెళ్తున్న గోపికి ఒక చెట్టు కింద హాయిగా నిద్రపోతున్న కుక్కపిల్ల కనపడింది. అమాంతంగా దాన్ని తీసుకెళ్లి దగ్గర్లోని చిన్న మురికి గుంటలో పడేసి ఇంటికి పరిగెత్తుకుపోయాడు. పగలంతా ఆటలాడుకుని ఉండటం వల్ల త్వరగా గాడనిద్రలోకి జారుకున్నాడు గోపి. తెల్లవారుతుండగానే లేస్తూ 'నేను ఈ రోజు, గుంటలో పడేసిన కుక్కపిల్లను బాగా ఏడిపించాలి, అనుకుంటూ కుక్కపిల్లను పడేసిన గుంట దగ్గరకు బయలుదేరాడు.

ఆ గుంట దగ్గరకు వెళుతుండగానే అక్కడి దృశ్యాన్ని గమనించిన గోపి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. తల్లి కుక్క పెద్దగా రోదిస్తూ గుంట చుట్టూ తిరుగుతూ, తన బిడ్డను గుంట నుండి లాగడానికి ప్రయత్నిస్తూ విఫలమవడం గమనించాడు. గోపి మనసు కరిగిపోయింది. పరుగెత్తుకెళ్లి గుంటలోదిగి కుక్కపిల్లను తల్లి దగ్గరకు చేర్చాడు.

ఆత్రుతతో పాలు తాగుతున్న తన బిడ్డను తనివితీరా నాకుతూ, గోపీ వంక కృతజ్ఞతాపూర్వకంగా చూసింది తల్లి కుక్క. మాతృత్వపు ప్రేమ విలువను ప్రత్యక్షంగా గ్రహించిన గోపీకి నాటి సంఘటనతో పరివర్తన కలిగింది.ఆనాటి నుండి తుంటరి పనులను పూర్తిగా మానేసి, బడికి వెళ్లి బుద్ధిగా చదువుకుంటూ మంచి బాలునిగా పేరు తెచ్చుకున్నాడు.

నీతి :

తుంటరితనం అనర్థాలకు హేతువు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం