తాజా కథలు @ CCK

ఒకరిపై ఆధారపడేవాడు కలలో కూడా సంతోషాన్ని పొందలేడు

2015-06-02 11:05:01 చిన్నారుల కథలు
ఒక రామచిలుక పచ్చటి లోయలో హాయిగా జీవించేది. గలగల పారే సెలయేళ్ళు, గుబురైన చెట్లు, అందమైన పువ్వులు, కమ్మని పండ్లు ఆ చిలుకను కట్టిపడేసేవి. రామచిలుకకు ఆహ్లాదకరమైన జీవితం అలవాటయింది.

కాని అన్ని రోజులూ ఒకలా ఉండవు కదా! ఒక రోజు ఒక వేటగాడు పక్షుల కోసం వెతుకుతూ లోయలో ప్రవేశించాడు. అతని కళ్లు అందమైన చిలుకపై పడ్డాయి. అతను చిలుకను చంపకుండా తన ఇంటికి తీసుకెళ్లి ఒక బంగారు పంజరంలో ఉంచాడు. రోజూ దానికి కమ్మని ఆహరం, చల్లని నీళ్లు ఇచ్చేవాడు. కాని అవేవి దానికి ఆనందంగా ఉంచలేకపోయాయి. ఎప్పుడూ అదోలా కనిపించేది. తన అందమైన, స్వతంత్ర మైన గత జీవితం గురించి ఆలోచిస్తూ, బాధపడుతూ ఉండేది.

ఒక రోజు వేటగాడు పంజరం వద్దకెళ్లి చిలుకతో " చిలుకా! నేను నిన్ను బంగారు పంజరంలో ఉంచాను, కమ్మని ఆహారం పెట్టాను,తాగడానికి చల్లని నీరు ఇచ్చాను కాని నీవు ఆనందంగా లేవు. ఎందుకు? అని అడిగాడు.

బదులుగా చిలుక, "అయ్యా నాకు ఈ బంగారు పంజరంకంటే చిన్న చిన్న పుల్లలతో నేను కట్టుకున్న గూడే బాగా అనిపిస్తుంది. నీవు ఇచ్చే ఆహారం తినే కంటే ఆకలితో నా గూటిలో ఉండటమే నాకు ఇష్టం.

నీవు దానంగా ఇచ్చే చల్లని నీటి కంటే దాహంతో చనిపోయినా నాకు బాగుంటుంది. నాకు ఆ వాతావరణంలోనే ఉండాలని ఉంది.నామిత్రులను కలుసుకోవాలనుంది. దయచేసి నన్నువదిలేయి. నేను స్వతంత్రంగా బతకాలనుకుంటున్నాను" అని అన్నది.

"లేదు చిలకా! నీ రెక్కలు ఎగరటం మరచిపోయాయి. నీవు నీ గూటి వరకు ఎగరలేవు. వద్దు నేను నిన్ను వదలను" అని సూటిగా చెప్పేశాడు వేటగాడు.

దాంతో బాధపడిన చిలుక, ఒకరోజు ఉదయం వేటగాడు పంజరానికి తాళం వేయడం మరువడంతో, చిలుక తుర్రుమని ఎగిరి, రెక్కలు వాలిపోయినా, ఎగరడం చేతకాకపోయినా తన గూటిని చేరుకుంది. హాయిగా, సంతోషంగా జీవంచసాగింది.

నీతి :

ఒకరిపై ఆధారపడేవాడు కలలో కూడా సంతోషాన్ని పొందలేడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం