తాజా కథలు @ CCK

శ్రధ్ధ లోపించిన కార్యము

2015-06-02 09:05:01 చిన్నారుల కథలు
ఒక ఊరిలో ఒక ధనికుడు నివసించుచుండెను. అతనికి ఆస్తిపాస్తులు కొల్లలుగా గలవు. వ్యాపారము, వ్యవసాయము రెండింటి యందును అతడు ధనమును బాగుగా గడించి శ్రీమంతుడయ్యను.

రెండు మూడు పెద్ద భవనములు కూడ అతనికి కలవు. అతని ఇంటిలో ఎందరో పరిచారికులు, సేద్యగాళ్ళు, గుమస్తాలు పని చేయుచుందురు. ఒకనాడా ధనికునకు సత్యనారాయణ వ్రతము చేయవలెనని సంకల్పము కలిగినది. తదనుసారము పురోహితునతో సంప్రదించి పూజకై ఒక రోజును నిర్ణయించి, ఆ పూజకు కావలసిన పదార్ధములన్నియూ రాసుకొని గుమస్తా చేత వాటిని తెప్పించెను. సరిగా ముహూర్తము వేళకు సత్యనారాయణ పటము పూజా మందిరములో ప్రతిష్ఠించబడెను. పూజాద్రవ్యములన్నియూ సమకూర్చబడెను. సమయానుకూలముగా పురోహితుడు పూజ ప్రారంభించెను. ధనికుడు, అతని భార్య పీటల మీద ఆసీనులైరి.

భగవంతునకు చేయ వలసిన షోడశోపచారములతో ధూపము, దీపము పూర్తి అయినవి. తదుపరి నైవేద్యము తెప్పించబడెను. దానిని దేవుని పటము ముందు పళ్ళెరములో నుంచి నీటతో మంత్రోచ్చారణపూర్వకంగా సంప్రోక్షించి  'ఓం ప్రాణాయ స్వాహా' అను మంత్రము చెప్పుచూ నైవేద్యమును దేవునకు అర్పించుటకై చేతిని పటము వైపు చూపుమని ధనికునితో చెప్పెను. కానీ ధనికుడు చేతిని తన పొట్ట వైపు చూపించుచుండెను. "అట్లు చేయవద్దు అది అపచారము" అని పురోహితుడు చెప్పగా అంతట శ్రీమంతుడు "నైవేద్యము తినునది నేనే కదా, పటము తినదు కదా! అట్లు చూపినచో తప్పేమి?" అని అడిగెను.

"అప్పుడు పురోహితుడు తినువారు మీరే అయినను దేవునకు సమర్పించుచున్నట్లు భావన చేసి ఆ ప్రకారము దేవునకు చేయవలెను. భావన ప్రధానము" అని చెప్పగా ధనికుడు అట్లే చేసెను.

నీతి :

ఏ కార్యమందైననూ శ్రధ, భావన ప్రధానము. పటము ఎదురుగా పెట్టినను సాక్షాత్ భగవంతుడే అచట ఉన్నాడని భావించి వారికి అన్ని ఉపచారములు భక్తి పూర్వకముగా చేయవలెను. శ్రధ్ధ లోపించిన కార్యము చేయని దానితో సమానము.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం