తాజా కథలు @ CCK

ఎలుగుబంట్లు

2015-06-09 13:05:01 చిన్నారుల కథలు
ఒక వేటగాడు వేటకోసం ఒక అడవికి వెళ్ళాడు. జంతువుల కోసం అతను వెతుకుతూ చాలా దూరం అడవిలోకి వెళ్ళాడు. అడవిలో ఒకచోట ఎండిపోయిన ఒక వాగు, దాని మీద కర్ర వంతెన కనిపించాయి. ఆ వంతెన ఎంత సన్నదంటే, ఒకేసారి ఆ దారి గుండా ఇద్దరు మనుషులు ఒకేసారి ప్రయాణించలేరు.

వంతెనకు ఒకపక్క నేరేడు చెట్లు ఉన్నాయి. రెండో పక్క దట్టమైన అడవి ఉంది. నేరేడు పళ్ళంటే ఎలుగుబంట్లకు ఇష్టమని వేటగాడికి తెలుసు. వేటగాడు అటుగా వచ్చే ఎలుగుబంటిని చంపడానికి కాచుకుని కూర్చున్నాడు.

కాస్సేపు గడిచాక నేరేడు చెట్ల వైపు నుండి ఒక పెద్ద ఎలుగు, మరో వైపు నుండి మరొక చిన్న ఎలుగుబంటి రావడం వేటగాడి కంటపడింది. ఎలుగుబంట్లు ఒకదానినొకటి దాటుకుంటూ వెళ్ళలేవని అతడికి తెలుసు. అక్కడ ఏదో పోట్లాట జరుగుతుందని ఊహించాడు.

వేటగాడు ఆ దృశ్యం చూస్తూ కూర్చున్నాడు. ఎలుగుబంట్లు దగ్గరగా వచ్చాయి. కొన్ని క్షణాలు ఎదురెదుగా నిలబడి ఒక దానివైపు ఒకటి చూస్తూ కాస్సేపు నిలబడ్డాయి. ఆ తరువాత పెద్ద ఎలుగుబంటి కింద కూర్చుని చిన్న ఎలుగును తన వీపుపై ఎక్కించుకుంది. చిన్న ఎలుగుబంటి పెద్దదాని వీపుపై ఎక్కి అవతలికి దాటింది. ఆ తరువాత వాటి దారిలో అవి వెళ్ళిపోయాయి.

వేటగాడు ఆశ్చర్యపోయాడు. జంతువులు , మనుషులకన్నా మంచి ప్రవర్తన గలవని గ్రహించాడు.

నీతి :

మనిషి జంతువుల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం