తాజా కథలు @ CCK

గొప్పతనం డబ్బులో ఉండదు !!

0000-00-00 00:00:00 చిన్నారుల కథలు


గొప్పతనం డబ్బులో ఉండదు !!గురవాయపాలెంలో గురవయ్య అనే ఒక రైతు ఉండేవాడు . అతనికి చిన్న పొలం వుండేది . కానీ అతనికి ఊరంతా తనని గొప్పవాడిలా చూడాలని ఆశపడేవాడు . అందుకోసం తనకి వీలైనంత ధనం పొదుపు చేసేవాడు .

అతడు తన పొలంలో పంటనే కాకుండా ,తన పెరట్లో పండ్లు , కూరలు , పూలు పండించి తగిన ధరకి అమ్మేవాడు .

ఒకరోజు గురవయ్య పెరట్లోని గుమ్మడిపాదుకి ఒక పెద్ద గుమ్మడికాయ కాసింది . చిన్నకొండలా ఉన్న ఆ గుమ్మడికాయని చూడడానికి చుట్టుప్రక్కల ఉన్న జనమంతా రాసాగారు . ఆ గుమ్మడికాయ అలా వుంది ఇలా వుంది అంటూ అందరూ మాట్లాడసాగారు .

అయితే ! గురవయ్య మాత్రం  ఆ గుమ్మడికాయని అమ్మే బదులు రాజు గారికి ఇస్తే మంచి బహుమానం వస్తుందని భావించాడు . వెంటనే ఆ గుమ్మడికాయని తీసుకొని రాజధానికి బయలుదేరాడు .

గురవయ్య నిండుసభలో ఆ గుమ్మడికాయని రాజుగారికి అందజేశాడు . అది చూసి అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు .

ఆ మరుసటిరోజే రాకుమారుడి జన్మదినం కావటంతో రాజుగారు ప్రజలందరికీ విందుభోజనం ఏర్పాటుచేశాడు .

ఆ సమయంలో ఇటువంటి అరుదైన  గుమ్మడికాయ లభించటంతో రాజుగారు ఎంతగానో సంతోషించారు . వెంటనే , రాజు గురవయ్యకి తన వజ్రపు ఉంగరాన్ని బహుమానంగా ఇచ్చాడు . మరియు ఆ రాత్రికి గురవయ్యని అక్కడే ఉండి తెల్లవారి భోజనం చేసి వెళ్లవలసినదిగా కోరాడు .

గురవయ్యకి ఆనందమేసింది .

మరునాడు భోజనాల సమయంలో గుమ్మడికాయ దప్పళం వంటకాలన్నిటిలో బాగుందంటూ జనమంతా మెచ్చుకోసాగారు . దాంతో గురవయ్య మనసు తృప్తితో నిండిపోయింది .

రాజు గారు కుడా సంతోషించారు . గురవయ్యా ! ఏమైనా కోరుకో అన్నారు రాజుగారు .

దానికి   గురవయ్య , ప్రభూ ! నేను ఇంతకాలం గొప్పతనం డబ్బులో వుందని భ్రమించాను . కానీ , నా కష్టం ఆకలితో వున్న వ్యక్తి కడుపు  నిండినపుడు అతని చల్లని దీవెన కలిగించే తృప్తితో నేనెంత గొప్పవాడినయ్యానో అర్థమయింది . నాకింకేం వద్దు . ఈ సంతోషం చాలు అన్నాడు .

శభాష్ ! " నీకు కాయకష్టం విలువతోపాటు అన్నదాన విలువ కుడా తెలిసింది . నీకు అరవై ఎకరాల పొలం రాసిస్తున్నాను . ఉత్తమంగా పంటలు పండించు . అందులో కొంతభాగాన్ని సక్రమంగా దానధర్మాలకు వినియోగించు . ఇక వెళ్లిరా " అని , అన్నారు రాజుగారు .
సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం