తాజా కథలు @ CCK

మనం జీవితంలో ఒకరికి చేసిన సహాయం వృధాపోదు

2015-05-30 21:05:01 చిన్నారుల కథలు
రాజయ్య ప్రతిరోజూ అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకొని తీసుకువచ్చేవాడు . వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో అతని జీవితం గడిచిపోయేది . ప్రతిరోజూ ఉదయాన్నే రాజయ్య అడవికి వెళ్ళేవాడు . అతని భార్య రాధ చీకటితోనే లేచి భోజనం వండి ఇచ్చేది .

మధ్యాహ్నం వరకు కట్టెలు కొట్టి రాజయ్య నీటి కాలువ ఒడ్డున ఉన్న ఒక చెట్టు నీడలో కూర్చుని భోజనం చేసేవాడు . సరిగ్గా అదే సమయానికి ఒక చిలుక అక్కడికి వచ్చేది . అది రాజయ్యకి కొద్ది దూరంలో నేల మీద వాలేది . రాజయ్య తన భోజనంలోనుండి కొంత తీసి చిలుకకు పెట్టేవాడు . అలా కొద్ది రోజులు గడిచింది .

ఆరోజు రాజయ్య అడవిలో కొద్దిసేపు కట్టెలు కొట్టాడు . దాహం వేయడంతో దగ్గరలోని నీటి కాలువలో మర్రి ఆకులతో చేసిన దోనేతో నీరు ముంచుకున్నాడు . అతను ఆ నీళ్ళు తాగబోయేలోపు చిలుక వచ్చి దోనెను నెట్టివేసింది . దోనె చిరిగిపోయింది . రాజయ్య దోసిలితో నీరు తాగబోయాడు . చిలుక మళ్ళీ వచ్చి రాజయ్య చేతిని నెట్టివేసింది . ఇలా రెండు మూడుసార్లు చేసేసరికి , రాజయ్యకు చిలుకపై కోపం వచ్చింది . ఒక మట్టిబెడ్డని తీసుకొని దాని మీదకు విసిరాడు . చిలుకకి గాయమైంది .

రాజయ్య మళ్ళీ నీరు తాగాలనుకున్నాడు . కానీ , ఎందుకో అతడికి తాగాలనిపించక వెనుకకి మరిలాడు . అతనికి కొద్ది దూరంలో కొన్ని జంతువులు చనిపోయి కనిపించాయి . కాలువలోని నీరు తాగి చనిపోయి ఉంటాయని గ్రహించాడు . నీటి కాలువలో ఏదో విషం కలిసి వుంటుంది . ఆ విషయం గ్రహించిన చిలుక తనని నీరు త్రాగకుండా అడ్డుపడిందని అర్థం అయ్యింది రాజయ్యకు . వెనుకకి తిరిగి వెళ్ళాడు . గాయంతో నేలమీద పడివున్న చిలుకను చేతుల్లోకి తీసుకొని ప్రేమగా నిమిరాడు .

నీతి :

మనం జీవితంలో ఒకరికి చేసిన సహాయం వృధాపోదు .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం