తాజా కథలు @ CCK

లోభికి ఖర్చు ఎక్కువ

2015-04-17 08:55:29 చిన్నారుల కథలు
అనగనగా ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు . అతడు పరమ పిసినారి . అది ఎండాకాలం . అందులో మధ్యాహ్నం . అతనికి దాహం వేస్తుంది . వెంటనే కొబ్బరిబొండం తాగాలనుకున్నాడు తన దాహం తీర్చుకోవడానికి .
వెంటనే , బజారుకి బయలుదేరాడు .

కొంత దూరం లో అతనికి కొబ్బరిబొండాల బండి కనిపించింది . ఒక బొండం ఎంత ? అని బండివాణ్ణి అడిగాడు .
పది రూపాయలు ఒకటి అన్నాడు బండివాడు .
పది రూపాయలకు రెండు ఇవ్వరాదూ ? అడిగాడు వ్యాపారి .
అప్పుడు అతడు కొంచం ముందుకు వెళ్ళండి అక్కడ ఇస్తారు అన్నాడు వ్యాపారితో .

అలానే కొంచం ముందుకు వెళ్ళాడు . అక్కడ పది రూపాయలకు రెండు ఇస్తున్నారు .
పది రూపాయలకు నాలుగు ఇవ్వరాదూ ? అడిగాడు వ్యాపారి .
అప్పుడు అతడు కొంచం ముందుకు వెళ్ళండి అక్కడ ఇస్తారు అన్నాడు వ్యాపారితో .

అలానే కొంచం ముందుకు వెళ్ళాడు . అక్కడ పది రూపాయలకు నాలుగు ఇస్తున్నారు .
పది రూపాయలకు ఎనిమిది ఇవ్వరాదూ ? అడిగాడు వ్యాపారి .

అప్పుడు అతడు కొంచం ముందుకు వెళ్ళండి . అక్కడ కొబ్బరి చెట్లు వున్నాయి . మీ ఇష్టం వచ్చినన్ని తెంపుకొండి . డబ్బులు ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు , అని అన్నాడు బండివాడు .

వెంటనే , వ్యాపారి కొబ్బరిచెట్ల దగ్గరికి వెళ్ళాడు . ఆయన ఇంతకుముందు ఎప్పుడూ కొబ్బరిచెట్టు ఎక్కి కొబ్బరిబొండాలు కోయలేదు . అయినా ! కష్టపడి ఒక చెట్టు ఎక్కాడు . చాలా కొబ్బరిబొండాలు కోసి కింద పడేసాడు .కానీ ! అంత ఎత్తయిన చెట్టు పైనుండి కిందికి ఎలా దిగాలో తెలియలేదు . భయపడినాడు .

చెట్టు దిగబోతూ కంగారులో ఒక కొబ్బరిమట్టను పట్టుకొని వ్రేలాడాడు . అక్కడి నుండి కిందికి దిగలేక , చెట్టు మీదికి చేరలేక , " నన్ను రక్షించండి ...... వంద రూపాయలు ఇస్తాను " , అని గట్టిగా అరిచాడు .

అటుగా వెళ్తున్న ఇద్దరు రైతులు అతన్ని కాపాడారు .

అందుకే పెద్దలు అంటారు , " లోభికి ఖర్చు ఎక్కువ " అని .

నీతి  :

దురాశ దు:ఖానికి చేటు .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం