తాజా కథలు @ CCK

శిల్పి అహంకార గుణం

2015-04-26 13:05:02 చిన్నారుల కథలు
సీతాపురంలో రాముడు గొప్ప శిల్పి . అతడు రాతిలో సజీవమైన శిల్పాలు చెక్కడంలో నేర్పరి . అతనికి తానే గొప్ప శిల్పినని అహంకారం వుండేది . అతని వయసు డెబ్బై సంవత్సరాలు దాటడంతో రాముడికి మరణ భయం పట్టుకుంది .

రాముడు తన మరణాన్ని వాయిదా వేయాలనుకున్నాడు . ప్రాణాలను తీసుకెళ్ళే యమదూతలకు తన ఆచూకీ తెలియకుండా రాముడు తన పోలికలతో ఉండేలా రాతితో పది శిల్పాలు చెక్కినాడు . వాటిని వరుసలో నిలబెట్టి తను కూడా వరుసలో నిల్చున్నాడు . కొంతకాలం గడిచింది .

రాముడి ప్రాణాలను తీసుకెళ్ళడానికి యమదూతలు వచ్చారు . ఇంట్లో మరియు బయటా అంతా వెతికారు . రాముడి ఆచూకీ తెలియలేదు . వట్టి చేతులతో వెళితే సృష్టి ధర్మానికి భంగం కలుగుతుంది .

అప్పుడు యమదూతలు రాముడి ఇంటి ముంగిట నిలబెట్టిన శిల్పాల తయారీలో చూపిన నైపుణ్యాన్ని కొనియాడారు . యమదూతలకు మానవ స్వభావంలోని అహంకార గుణం గుర్తొచ్చింది .

మరి ఇంత చక్కటి శిల్పాలు చెక్కిన శిల్పి , శిల్పాల చెవులు రెండింటినీ సమంగా ఉండేటట్లు చెక్కలేకపోయాడు , అని అన్నాడొక యమదూత .

ఆ మాటలు రాముడికి వినిపించగానే అతనిలోని అహంకారం మేల్కొంది . వెంటనే రాముడు ఇలా అన్నాడు , " మీరు సరిగా చూడక నా నైపుణ్యాన్ని వెక్కిరిస్తున్నారు . శిల్పాల చెవుల తయారీలో ఉన్న తప్పేదో వివరంగా చెప్పండి , అంటూ రాముడు శిల్పాల వరుసలో నుండి బయటికి వచ్చాడు . వెంటనే యమదూతలు రాముడి ప్రాణాలు తీసుకొని యమధర్మరాజు దగ్గరకు వెళ్ళిపోయారు .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం