తాజా కథలు @ CCK

పొగడ్తలకు పొంగిపోతే మోసపోతారు

2015-03-10 01:05:02 చిన్నారుల కథలు
అనగనగా ఒక ఊరి చివర చాలా పంట పొలాలు ఉండేవి . ఆ పొలాల వద్ద ఒక పెద్ద మర్రిచెట్టు ఉండేది . ఆ చెట్టు తొర్రలో ఒక అందమైన కోడిపుంజు నివసిస్తూ ఉండేది . ఆ కోడిపుంజు రంగురంగుల ఈకలతో చాలా అందంగా కనిపిస్తుంది . దానికి అందంతోపాటు గర్వం కూడా ఉండేది .

ఒకరోజు ఆ కోడిపుంజు చెట్టు తొర్ర బయట పడివున్న గింజలను తింటూ వుంది .అప్పుడు ఆకాశంలో ఎగురుతున్న ఒక గద్ద ఆ పుంజుని చూసింది . ఆ గద్దకి పుంజుని తినాలన్న కోరిక కలిగింది . గద్ద ఆ కోడిపుంజుని పట్టుకోవాలని కిందికి వస్తూవుంది . అయితే ! అప్పుడు ఆ కోడిపుంజు గద్దను గమనించింది . వెంటనే వేగంగా అది చెట్టుతొర్రలోకి దూరింది .

గద్ద చెట్టు దగ్గరలో వున్నా ఒక పెద్ద రాయిపై వాలింది . గద్ద , కోడిపుంజుతో ఇలా అన్నది ...నేను ఆకాశం నుండి నీయొక్క రంగురంగుల అందమైన ఈకలను గమనించాను . వాటిని దగ్గర నుండి చూడాలనే కోరికతో నీ దగ్గరకు వచ్చాను .భయపడకు నేను నిన్ను ఏమీ చెయ్యను , బయటకు రా అని .

గద్ద పొగడ్తలకు కోడిపుంజు పొంగిపోయింది . ఇంకా , ఆ గద్ద కోడిపుంజుతో " నీ అందాన్ని చూసి , నేను తిర్గి వెళ్ళాక పక్షిరాజుకి చెప్పాలి . పక్షి రాజు అన్నింటికన్నా అందమైన పక్షికి గొప్ప బహుమతిని ఇచ్చి సన్మానించాలనే ఉద్దేశ్యంతో నన్ను చుట్టుప్రక్కల ప్రాంతాలలో గమనించమని పంపించాడు . మరి నువ్వు బయటికి వచ్చి నీయొక్క అందాన్ని చూపించకపోతే నేను నీ అందం గురించి పక్షిరాజుకి ఎలా వివరించగలను " అని , అంది . ఆ మాటలు విన్న కోడిపుంజు నిజమేననుకొని నమ్మింది గద్దను . వెంటనే , అది చెట్టు తొర్ర నుండి బయటికి వచ్చింది .

వెంటనే , గద్ద ఆ కోడిని పట్టుకొని ఎగిరిపోయింది . పొగడ్తలకు పొంగిపోయిన కోడిపుంజు మోసపోయింది . గద్దకు ఆహారమయింది .

నీతి :

పొగడ్తలకు పొంగిపోకూడదు . అలా పొంగిపోతే మోసపోతారు .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం