తాజా కథలు @ CCK

ముందు చూపు

2015-05-05 07:05:01 చిన్నారుల కథలు
పూర్వకాలంలో శ్రవనానందుడనే గురువుగారు వుండేవారు . ఒకసారి ఆ గురువుగారు తీర్థయాత్రలకు వెలదామనుకున్నాడు .అందుకోసం అతడు తన ఇద్దరు శిష్యులతో కలిసి కాలినడకన అరణ్య మార్గాన ప్రయాణం ప్రారంభించాడు . అరణ్యంలో చాలా దూరం ప్రయాణం చేసాక వారు ముగ్గురూ అలసట తీర్చుకోవడానికి ఆ రోజు రాత్రి ఒక పాడుబడిన గుడిలో పడుకున్నారు .
అర్థరాత్రి ఆ గుడిలోకి బందిపోటు దొంగలు వచ్చారు . వీరి ముగ్గురినీ నిద్రలేపి ఇలా బెదిరించారు , మీ దగ్గర ఉన్నదంతా మర్యాదగా ఇచ్చేయండి , లేకపోతె మిమ్మల్ని ప్రాణాలతో వదలం అని . ఇక చేసేదేమీ లేక వారు ముగ్గురూ తమతోపాటు తెచ్చుకున్న డబ్బు , ఆహారపదార్థాలు అన్నీ బందిపోటులకు ఇచ్చేసారు . బందిపోటు దొంగలు వారి పాదరక్షలతో సహా ఉన్నదంతా దోచుకెళ్ళారు .

శిష్యులిద్దరూ భయంతో గురువుతో ఇలా అన్నారు , " గురువుగారూ ! మనం తీర్థయాత్రలు ఇంతటితో ముగించి ఇంటికి వెళ్ళిపోదాం అని . కానీ ! గురువుగారు మాత్రం ససేమిరా ఒప్పుకోలేదు . తాము అనుకున్నట్లుగా తీర్థయాత్రలు పూర్తిచేసే వరకు వెనుదిరిగేదిలేదు అన్నారు . అయినా ! ఇలాంటి కష్టాలు వస్తేనే మనకు జీవితంలో వచ్చే అడ్డంకుల్ని ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంది ,అని అంటూ తిరిగి పాదయాత్ర ప్రారంభించారు . కొంత దూరం వెళ్ళాక వారికి ఒక పాత చెప్పుల జత కనిపించింది . నాయనా ! ఆ పాత చెప్పులు తీసుకో , అని శిష్యులతో చెప్పాడు గురువు .
వీటిని మనం వేసుకోలేము కదా గురువుగారూ ! ఇవి దేనికి పనికొస్తాయి ? అని ప్రశ్నించాడు శిష్యుడు . అప్పుడు గురువు మనకు " ముందు చూపు వుండాలి " అన్నాడు .

మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టారు . అలా , కొంత దూరం వెళ్ళాక వారికి ఒక గ్రామం వద్ద ఒక ఇనుప తీగ కనిపించింది . దాన్ని కూడా తీసుకోండి నాయనలారా , అని గురువు శిష్య్లతో చెప్పాడు మళ్ళీ . శిస్యులిద్దరూ గురువుగారు చెప్పినట్టు చేశారు . అలా ఇంకా కొంత దూరం ప్రయాణించాక వారికి ఒక తాడు మరియు పాత సీసా కనిపించాయి . వాటిని కూడా తీసుకొని తమ దగ్గర పెట్టుకోమన్నాడు గురువు .

ఇలా , పాత వస్తువులను గురువుగారు ఎందుకు తీసుకోమంటున్నాడో వారికి అర్థం కావటం లేదు . ఎండ తీవ్రత ఎక్కువైంది . ఎండ తీవ్రతకు తట్టుకోలేక శిష్యులలో ఒకడు స్పృహతప్పి పడిపోయాడు .

రెండవ శిష్యుడికి ఏమి చేయాలో పాలుపోలేదు . కొంత దూరంలో అతనికి ముళ్ళ చెట్ల ఆవల ఒక బావి కనిపించింది . కానీ ! ఆ బావి నుండి నీరు ఎలా తీసుకురావాలో అతనికి అర్థం కాలేదు .

అప్పుడు గురువుగారు తమ వద్ద వున్న సీసాకి తాడు కట్టాడు . తర్వాత తెగిపోయిన పాత చెప్పులను తీగతో కట్టాడు . ఆ చెప్పులను వేసుకొని ముల్లదారిలో నడిచి సీసాతో నీరు తీసుకురా అని , రెండవ శిష్యుడితో చెప్పాడు గురువు . అలాగే చేశాడు శిష్యుడు . స్పృహ కోల్పోయిన శిష్యుడిపై ఆ నీటిని చల్లాడు గురువు . కళ్ళు తెరిచి నీరు తాగగానే అతని ప్రాణం కుదుటపడింది .

" ఈ సృష్టిలో పనికిరాని వస్తువు అంటూ ఏదీ ఉండదు . దేన్నయినా ఉపయోగించుకోవడాన్ని బట్టి ఉంటుంది ." ఈ విషయం మీకు తెలియచెప్పాలనే ఈ విధంగా చేశాను , అని చెప్పారు గురువు తన ఇద్దరి శిష్యులతో .

తర్వాత ముగ్గురూ వారి తీర్థయాత్రలు విజయవంతంగా ముగించుకొని తిరిగి ఆశ్రమానికి చేరుకున్నారు .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం