తాజా కథలు @ CCK

మనం చేసే మంచి పనిని ఎన్నడూ వాయిదా వేయకూడదు

2015-05-22 03:05:02 చిన్నారుల కథలు
కరుణకి ఐదు సంవత్సరాలు .తనకి తాతయ్య అంటే చాలా ఇష్టం. కరుణ ప్రతి ఆదివారం తాతయ్యతో కలిసి వాళ్ళ వీధి చివరన వున్న వృద్ధాశ్రమానికి వెల్తూవుండేది . కరుణని తన తాతయ్య ఆశ్రమంలోని అందరికీ పరిచయం చేసాడు .

ఆదివారం రోజు ఆ వృద్ధాశ్రమం ఎంతో సందడిగా వుండేది . రాధమ్మ మామ్మ ఏదో ఒక ప్రత్యేక వంట చేసి పెడుతూవుండేది .రాజయ్య తాత జోకులు వేస్తూ అందరిని నవ్విస్తూ ఉండేవాడు . రాఘవయ్య తాత కమ్మని పాటలు పాడి వినిపించేవాడు . భారతమ్మ మామ్మ కాగితం పడవలు చేసి కరుణకి ఇచ్చేది . శరభయ్య తాత మాత్రం నవ్వుతూ మౌనంగా అందరినీ చూస్తుండేవాడు .
కరుణను మరియు తాతయ్యను చూడగానే వృద్ధాశ్రమంలోని అందరి ముఖాలూ ఆనందంతో వెలిగిపోయేవి . కరుణ కూడా ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ వుండేది .

" వయసు పెరిగి ఆరోగ్యం తరిగిన వారిని కలిసి ఆప్యాయంగా పలకరిస్తే వారికి చాలా ఆనందం కలుగుతుంది . ఆయుష్షు పెరుగుతుంది . జబ్బులు తగ్గిపోతాయి . అదే మనసు చేసే వైద్యం " అని , తాతయ్య ఒకసారి కరుణతో చెప్పాడు .

ఓ రోజు తాతయ్యకు జబ్బు చేసింది . ఆసుపత్రిలో చేర్పించారు . అందరూ ఆందోళన చెందారు . రెండు రోజుల తర్వాత కళ్ళు తెరిచాడు తాతయ్య . కరుణని దగ్గరికి పిలిచి " ఈరోజు ఆదివారం కదా ! మరి ఆశ్రమం పోవటం లేదా? అని , అడిగాడు . లేదు ! వెళ్ళటం లేదు , మీరు రాలేరు కదా .. అందుకే వెళ్ళను అంది కరుణ .

" మనము చేసే మంచి పనిని ఎన్నడూ వాయిదా వేయకూడదు . నేను రాలేనని మానేయకు . నీవు వెళ్ళు ఆశ్రమానికి " , అంటూ ధైర్యం చెప్పాడు

తాతయ్య , కరుణకి . సరేనని చెప్పింది కరుణ .

తాతయ్యకి జబ్బు చేసిందని ఆశ్రమంలో తెలిసి అందరూ ఆందోళన చెందారు . దిగులుగా వున్న కరుణకు ధైర్యం చెప్పారు .

మరుసటి రోజు ఆశ్రమంలోని అందరూ తాతయ్యని చూడడానికి ఆశ్రమానికి వచ్చారు . అప్పుడు తాతయ్య ముఖం ఆనందంతో మెరిసిపోయింది . తాతయ్య త్వరగా కోలుకోవాలని భారతమ్మ ఒక గ్రీటింగ్ కార్డుని స్వయంగా తయారుచేసి తీసుకొని వచ్చి తాతయ్యకి ఇచ్చింది . రాజయ్య మాటలతో నవ్వించాడు . రాఘవయ్య మంచి పాటలు పాడి వినిపించాడు . శరభయ్య మౌనంగా తాతయ్య చేసిని తన హృదయానికి ఆప్యాయంగా హత్తుకున్నాడు . ఒక గులాబీ పుష్పం ఇచ్చాడు .

రాధమ్మ పాయసం వండి తెచ్చింది .

" మీ కోసం మేము అంతా వున్నాం . మీరు లేచి హాయిగా తిరుగుతారు . ధైర్యంగా వుండండి , అని చెప్పాడు , శరభయ్య . ఎన్నడూ మాట్లాడని శరభయ్య మాటలు తాతయ్యకి మంత్రాలలా పనిచేశాయి .

తాతయ్య కోలుకొని ఇంటికి వచ్చారు .

వైద్యుడు చేసిన చికిత్స వలన తాతయ్య కోలుకున్నాడని ఇంట్లో వారు అందరూ చెప్పుకున్నారు .

" అనారోగ్యంతో వున్న వారి దగ్గరికి వెళ్లి పలకరిస్తే జబ్బు నయమవుతుంది . అదే మనసు చేసే వైద్యం , అని తాతయ్య చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి కరుణకి . మనసులోనే ఆశ్రమంలోని వారందరినీ అభినందింది కరుణ .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం