తాజా కథలు @ CCK

తుంటరి బాతు పిల్ల - ఎండ్రకాయ

2015-02-01 07:21:40 చిన్నారుల కథలు
అనగనగా ఒక ఊరిలో చెరువు వుంది . ఆ ఊరి చివరి ఇంట్లో వ్యక్తి బాతులను పెంచుతుంటాడు . అతని దగ్గర చాలా బాతులున్నాయి . అందులో ఒక బాతు పది పిల్లలను పెట్టింది . ఒకరోజు అది తన పిల్లలను తీసుకొని చెరువుకి వెల్లాలనుకుంది , వాటికి ఈత కొట్టడం నేర్పించడానికి .

ఒక రోజు తెల్లవారుజామున ఆ బాతు తన పిల్లలను తీసుకొని చెరువు వైపు నడిచింది . ఆ పిల్లలన్నిటిలో ఒక తుంటరి బాతు పిల్ల ఒకటి ఉంది . దాని పేరు " బక్ బక్ " .అది చాలా అల్లరి చేస్తుంటుంది . ఒక్కచోట ఉండదు . కొంటె చేష్టలు ఎక్కువ .

అన్ని బాతు పిల్లలు తల్లి బాతు దగ్గర చేరి ఈత కొడుతుంటే ఈ " బక్ బక్ " మాత్రం తల్లిని కాదని మెల్లిగా అక్కడి నుండి పక్కకి జారుకుంది . చెరువు మధ్యకు పోయింది .

చెరువులో అక్కడక్కడ చిన్న చిన్న గడ్డి పొదలున్నాయి . తుంగ పెరిగి వుంది . " బక్ బక్ " ఉషారు ఎక్కువైంది . అది నీళ్ళల్లో ఈదుకుంటూ .... ఎగురుకుంటూ .... ఆడుకుంటూ .... గడ్డిపొదల వైపు వెళ్ళింది . అనుకోకుండా ఆ బాతు పిల్ల గడ్డి పొదల మధ్యన చిక్కుకుంది . దాన్ని మొత్తం గడ్డి చుట్టేసింది . దాని నుండి బయటపడటం కష్టమైంది . ఏం చేయాలో తెలియక ఏడవసాగింది .

దాని ఏడుపు చప్పుడు అక్కడికి కాస్త దూరంలో వున్న చెరువు గట్టుకు వినపడింది . ఆ చెరువు గట్టు అంచున తొర్రలోని ఎండ్రకాయ దాని అరుపు విని బయటికి వచ్చింది . ఆ బాతు పిల్ల బాధ దానికి అర్థమైంది . మెల్లగా ఈదుకుంటూ ఎండ్రుకాయ బక్ బక్ దగ్గరికి వెళ్ళింది . తన కత్తెర చేతులతో బాతు పిల్ల చుట్టూ వున్న గడ్డిని కత్తిరించింది . బక్ బక్ బయటకు వచ్చింది . నవ్వుతూ ఎండ్రుకాయకు కృతజ్ఞతలు చెప్పింది .

ఇక్కడ ఇలా వుంటే , అక్కడేమో తల్లి బాతు మరియు మిగతా బాతు పిల్లలు బక్ బక్ కొరకు వెతకడం మొదలుపెట్టినాయి . తల్లి బాతు తన పిల్లల్ని ఒక దగ్గరే ఉండమని చెప్పి , బక్ బక్ ను వెతుక్కుంటూ గడ్డిపొదల వైపు వస్తుంది . అప్పుడే బక్ బక్ అటుగా వస్తున్న తల్లి బాతుని చూసి ఎంతో సంతోషించింది .

తల్లి కోపంచేస్తున్దేమోనని ముందే దాని తప్పుని అంగీకరించింది . క్షమించమని అడిగింది . ఎండ్రుకాయ చేసిన సహాయము గురించి చెప్పినది . ప్రమాదం లేదు అని చెప్పినది . అప్పటి నుండీ సరిగా ఉంటాననీ , అల్లరి చేయననీ , చిలిపితనం మానుకుంటాననీ తల్లి బాతుతో బక్ బక్ చెప్పింది .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం