తాజా కథలు @ CCK

చిట్టెలుక చిలిపితనం

2015-03-29 21:05:01 చిన్నారుల కథలు
ఒకానొక పల్లెటూరిలో ఒక చిన్న కలుగు వుండేది. అందులో ఒక చిట్టెలుక నివసిస్తూ ఉండేది . దానికి చాలా చిలిపి కోరికలు ఉండేవి. చిట్టెలుకకి చిలిపితనం కొంచెం ఎక్కువే . దాని పేరు చుంచు  . అది ఆహారం కోసం వెళ్ళినప్పుడల్లా దానికి   ఆoబోతు  ఒకటి కనిపించేది .  ఆ ఆoబోతుని చూసి గ్రామంలోని చిన్న చిన్న పెంపుడు జంతువులే కాక , మనుషులు కూడా భయంతో పరుగులు తీసేవారు.

ఎందువలన అంటే  , అది చాలా పొగరుబోతు , భారీ శరీరంతో, చాలా బలంగా , నల్లని రంగుతో   చూడడానికి భయంగా ఉండేది. అది అరిస్తే భయంకరంగా ఉండేది . అది కాలి గిట్టలతో నేలను బలంగా తన్నుతూ,  రంకె వేసిందంటే , ఎంతటి ధైర్యవంతులైనా భయపడాల్సిందే !

అయితే ! చిట్టెలుకకి ఒక్కసారైనా, ఆ  ఆoబోతు మీద ఎక్కి ,   స్వారీ చేయాలనే చిలిపి కోరిక కలిగినది . అది కష్టం ,  అని తల్లి ఎంత  చెప్పినా అది వినలేదు .  ఒక్కసారి ఆ పొగరుబోతు ఆoబోతు మీద ఎక్కి స్వారీ చేయాలని తెగ ఆరాటపడిపోతూ ఉండేది.

కానీ !  ఆ ఆoబోతు ఎదురుపడితే  దానికి కాళ్ళూ, చేతులూ  వణికిపోతూoడేవి. మరి , తన కోరిక ఎలా తీరడం ? చాలా రోజులు ఆలోచించాక దానికి ఒక ఉపాయం వచ్చింది . ఓ రోజు ఆ ఆoబోతు ఆ దారిన వస్తూ ఉంటే , కొంచెo ధైర్యం చేసి దానికి ఎదురుగా నిలుచుంది. ఆ ఆoబోతు కోపంతో రంకె వేసింది.

కొమ్ములు విదిల్చి చిట్టెలుకను మరుక్షణంలో నల్లిని నలిపినట్టు నలిపివేయాలనుకుంది . కానీ ! చిట్టెలుక   గొంతు పెగుల్చుకుని దాoతో  అంది ఇలా.... ‘‘ మహానుభావా ! నీ అంత ధైర్యశాలి, బుద్ధిమంతుడూ మరియు అందగాడూ , ఈ ప్రపంచంలో మరెక్కడా లేడు అని నా అభిప్రాయం . అయితే ! నీలాంటి గొప్ప వాడికి, ఇది ఉండడానికి సరియైనప్రదేశం కాదు అని అనిపిస్తోంది.

ఈ ఇరుకైన గ్రామంలో బలహీనులూ మరియు వారి బలహీనమైన పెంపుడు జంతువుల మధ్య , మేరుపర్వతం లాంటి వాడివైన నువ్వు తిరగడం నాకెందుకో   చిన్నతనంగా అన్పిస్తుంది . ఇక్కడికి కొంత దూరంలో ఓ విశాలమయిన   మైదానం ఒకటి ఉంది. అది నూరుయోజనాల దూరం  వ్యాపించి ఉంది .

ఆ మైదానంలోని   జంతువులు   తామే  బలశాలురమని గర్విస్తూoటాయి.  వాటి పొగరు నువ్వు అణచాలి.  అదే నీకు తగిన చోటు   ’’ అంది. దాని మాటలకు సంతోషించిన ఆoబోతు, తనకు ఆ మైదానానికి వెళ్ళే దారి చూపించమని చిట్టెలుకను కోరింది.

అప్పుడు , చిట్టెలుక ‘‘ నేను దారి చూపిస్తాను . కానీ !  అది కొండలు ,   గుట్టలు   ఎక్కితే కానీ కనిపించదు. నీకంటే ఎత్తైన కొండలేవీ  లేవు. అదే ఆలోచిస్తున్నాను, ’’ అని చెప్పింది . దానికి ,  ఆ ఆoబోతు ‘‘ సరే ఐతే ! నా వీపు పైన నువ్వు ఎక్కి అక్కడికెళ్ళే దారి చూపించు   ’’ అంటూ, చిట్టెలుకను తన  పైకి ఎక్కించుకుంది.

ఆ మైదానానికి దారి చూపించే వంకతో చిట్టెలుక ఆoబోతు పైకి ఎక్కి గ్రామంలోనే కాక, చుట్టుప్రక్కల కూడా చాలా సమయం ఊరేగింది. ఆ ఆoబోతు మీద స్వారీ చేస్తున్న చిట్టెలుక ధైర్యానికీ మరియు అదృష్టానికీ , తల్లి ఎలుకతో పాటు మిగిలిన జంతువులన్నీ ఆశ్చర్యంగా చూస్తూ భయంతో ప్రక్కకి తప్పుకున్నాయి.

ఆoబోతు , చిట్టెలుకను మోసుకుంటూ చాలా  సమయం   తిరిగి అలసిపోయింది. దానికి , కోపం   వచ్చింది. అక్కడంటే ఇక్కడనీ , ఇక్కడంటే   అక్కడనీ.. అదిగో , ఇదిగో , అంటూ చిట్టెలుక ఆoబోతుని చాలా దూరం తిప్పింది.

తన సరదా తీర్చుకుంది . దాని ముచ్చట తీరిపోయింది . ఆoబోతు ఇక నడవలేక కోపంతో   చిట్టెలుకను చంపుతానంటూ రంకెలు వేసిoది.

తన చిరకాల కోరిక తీరిందని చిట్టెలుక తృప్తిగా ఆoబోతు వీపు పైనుండి ఒక్క ఒదుటున కిందకి   దుమికి , అంతే వేగంగా   పారిపోయింది .

పొగరుమోతు ఆoబోతుకి   చిట్టెలుక ఎక్కడా కనిపించలేదు !

 

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం