తాజా కథలు @ CCK

నోరు మూయించడం

2014-05-06 13:54:53 చిన్నారుల కథలు
వారణాసిని బ్రహ్మదత్తుడు పరిపాలిస్తున్నాడు. బోధిసత్వుడతనికి మంత్రిగా ఉండేవాడు. రాజపురోహితుడు వట్టి వాగుడుకాయ. అతను ఇంకొకరికి మాట్లాడే అవకాశమే యివ్వకుండా వాగుతూ డబ్బా కొట్టేవాడు. అది రాజుకీ , ఇతరులకీ కూడా దుర్భరంగా ఉండేది. అతని నోరు ఎవరు మూయించగలరా అని ఎదురుచూస్తున్నాడు రాజు.

ఆ కాలంలోనే వారణాసిలో ఒక కుంటి వాడుండేవాడు. కాళ్ళు వంకరయినా రాళ్ళు విసరడంలో బహు నేర్పరి. పిల్లలతనిని బండిలో కూర్చోబెట్టి ఊరి చివర నగర ద్వారం వద్దకు తీసుకుపోయేవారు. అక్కడొక పెద్ద మర్రి చెట్టుండేది. పిల్లలు వాడికి డబ్బులిచ్చి మర్రి ఆకులను మట్టి వుండలతో కొట్టి ఆ ఆకులలో ఏనుగు బొమ్మో, గుర్రం బొమ్మో తెప్పించమనేవారు. కుంటి వాడు గులక రాళ్ళు విసిరి మర్రి ఆకు చెట్టు మీదుండగానే ఆకారం తెప్పించి అప్పుడు దానిని రాలగొట్టేవాడు. అది పిల్లలకు ఆట. అలా రాల్చిన ఆకులు నేల మీద గుట్టగా పడి వుండేవి.

ఒక రోజు రాజు ఉద్యాన వనానికి పోతూ ఆ ఆకుల గుట్టని చూసి 'వీటినిలా కోసిన వారెవరు?' అని అడిగారు. పిల్లలు కుంటి వాడినొంటరిని చేసి పారిపోగా కుంటి వాడు 'నేను మహారాజా ! అంటూ విషయమంతా వివరించాడు. రాజు పరివారాన్ని దూరంగా పంపి ఆ కుంటి వాడిని 'ఏమయ్యా ! మా వద్ద ఒక వదరబోతున్నాడు. నీ విద్యతో అతని నోరుకట్టించగలవా?' అని అడిగాడు. తప్పకుండా అన్నాడు కుంటివాడు.

రాజతనిని తన భవనానికి తీసుకొనిపోయి గది మధ్యగా తెర అడ్డం కట్టించి తెరకు చిన్న రంధ్రం చేయించి చిల్లు కెదురుగా పురోహితుడి ఆసనం వేయుంచి ఆయన వచ్చి కూర్చోగానే మాటలు మొదలు పెట్టాడు. అలవాటు ప్రకారం పురోహితుడు తెరచిన నోరు మూయకుండా మాట్లాడెయ్యడం మొదలు పెట్టాడు. తెర యివతల కుంటివాడు మేకపెంటికలను గొట్టం లోంచి తెర లోని చిల్లు ద్వారా పురోహితుడు తెరచిన నోటి లోకి గురి చూసి కొట్టసాగాడు తన గొట్టంతో. పురోహితుడు మాటలాడడంలో మునిగిపోయి వాటిని మింగేయసాగాడు. అలా చాలా మేకపెంటికలని తెరలోని కన్నం ద్వారా తన గొట్టంతో అతని నోటి లోనికి గురి చూసి పంపాడు కుంటివాడు. పురోహితుడి కడుపులోకి పోయిన మేకపెంటికలు ఉబ్బిపోయి అతనికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. అప్పుడు రాజు , అయ్యా! మీరు వాక్‌ప్రవాహంలో మునిగిపోయి నోటి లోకి మేక పెంటికలు పోవడం గమనించలేదు. ఇప్పుడవి కడుపులో ఉబ్బి బాధిస్తున్నాయి. ఇంటికి వెళ్ళి వాంతికి సాధనం చెయ్యండి, సర్దుకోండి. అని పంపేశాడు. అప్పటి నుంచి పురోహితుడు నోరు తెరిస్తే ఒట్టు. రాజుకీ యితరులకీ సుఖంగా ఉంది. రాజు కుంటివాడికి సంవత్సరానికి లక్ష రూపాయల ఆదాయం ఇచ్చాడు. ఎదుటివారి పరిస్థితిని యిబ్బందిని కూడా అర్థం చేసుకుంటూ ఉండాలి.

నీతి :

అతి ఎప్పుడూ అనర్థదాయకమే. బుద్దిమంతులు ఎదుటి వారి పరిస్థితిని, యిబ్బందినీ కూడా అర్థం చేసుకుంటూ ఉండాలి.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం