తాజా కథలు @ CCK

నేరం చేయడం ఎంత తప్పో , నేరానికి ఏదో విధంగా ప్రేరేపించడమూ అంతే నేరం

2015-03-13 23:05:02 చిన్నారుల కథలు
ఒక ఊళ్ళో ఓ జమీందారు ఉండేవాడు. అతని పేరు కిష్టప్ప . ఆ ఊళ్ళో ఎవరికి ఏ గొడవ వచ్చినా, ఇరు పక్షాల వారి వాదనలనూ విని,   తీర్పు చెప్పేవాడు. అతని తీర్పుకు ఎదురు ఉండేది కాదు . కిష్టప్ప చెప్పే తీర్పులు వినడానికి గ్రామంలోని వారే కాకుండా, చుట్టు ప్రక్కల ఊళ్ళ నుండి జనం   వచ్చేవారు .

అతను చెప్పిన తీర్పుల   గురించి రోజుల తరబడి   మాట్లాడుకునేవారు.

ఓ రోజు కిష్టప్ప వద్దకు ఊళ్ళో ఉండే ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిలో ఒకతని పేరు రాజయ్య . రెండోవాడి పేరు సోము . మొదట  రాజయ్య తన మొదట  చెప్పుకున్నాడు ఇలా : ‘‘ అయ్యా ! నా పేరు రాజయ్య . పెద్ద వీధిలో ఉంటాను. ఇతను నా దగ్గర పనివాడు . పేరు సోము . ఇతనికి జీతం బాగానే ఇస్తున్నాను . తిండీ మరియు బట్టలు ఇస్తున్నాను . బాగా చూసుకుంటున్నాను.

కానీ ! ఇతని బుద్ధి మంచిది కాదు. మొదట్లో బాగానే ఉండేవాడు . కానీ ! ఇటీవలే మారిపోయాడు. నాకు అనుమానం కలిగి, ఇతని బుద్ధి తెలుసుకోవాలనుకున్నాను. నిన్న ఉదయం మా ఇంటి గదిలో అందరికీ కనబడేలాగా ఒక వెండి కుంకుమభరిణె ఉంచాను. తలుపు చాటున ఉండి చూస్తున్నాను . ఇతను అటూ, యిటూ   చూస్తూ ఉండడం గమనించాను. ఇతను ఆ వెండి కుంకుమభరిణెని   తీసి పంచె చాటున దాచుకుని ఏo తెలియనట్టు వీధిలోకి వెళ్ళబోతూ ఉంటే నేను పట్టుకున్నాను .

ఇతను  ఏడుస్తూ తన తప్పు ఒప్పుకున్నాడు . వెంటనే పనిలో నుండి తీసేసాను. ఇతను మాత్రం తన తప్పును అంగీకరిస్తూనే, తనని పనిలోనుండి మాత్రం తొలగించవద్దని నన్ను ఇబ్బంది పెడుతున్నాడు .  ఇతని బుద్ధి బయటపడ్డాక కూడా ఇతనిని పనిలో ఎలా పెట్టుకోగలను . తమరే తీర్పు చెప్పండి ! ’’ , అని అన్నాడు  రాజయ్య .

సోము  తను వెండి కుంకుమభరిణె దొంగతనం చేసినట్టుగా అంగీకరించాడు. ఇంతకు ముందు ఎప్పుడూ అలాంటి  పనులు చేయలేదని ఏడుస్తూ చెప్పాడు. అదే మొదటిసారి అనీ, తన సంపాదన సరిపోకపోవడంతో దొంగతనం చేసానని ఏడుస్తూ  చెప్పాడు ఇలా..... ‘‘ ఆ సమయంలో నా ఇబ్బందులన్నీ గుర్తుకు వచ్చి , అనుకోకుండా వెండి కుంకుమభరిణె కనబడడంతో   దానిని దొంగిలించాను. తప్పయింది , కనికరించండి..... ఇప్పుడు రాజయ్య గారు నన్ను పనిలోనుండి తీసివేస్తే మా కుటుంబానికి ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప ఇంకొక దారి లేదు , ’’ అని అంటూ ఏడ్చాడు .

కిష్టప్ప  కాసేపు ఆలోచించి  తీర్పు చెప్పాడు ఇలా .... ‘‘ ఎలా చేసినా , ఎందుకు చేసినా , సోము దొంగతనం చేసాడు . కనుక , అతనికి యాభై కొరడాదెబ్బలు శిక్ష వేస్తున్నాను .

ఇక , సోము పేదరికం తెలిసి కూడా అతని బలహీనతనకి పరీక్ష పెట్టినందుకు రాజయ్యని కూడా శిక్షించక తప్పదు !

" నేరం చేయడం ఎంత తప్పో , నేరానికి ఏదో విధంగా ప్రేరేపించడమూ అంతే నేరం ! "

అంచేత , రాజయ్యకి శిక్ష . అదేoటంటే , అతను సోముని తిరిగి పనిలో పెట్టుకోవాలి . అంతేకాదు , ఇక నుండీ అతనికి ఇచ్చే జీతాన్ని , తిండీ మరియు బట్టలను కూడా రెట్టింపు చేయాలి . ఇదే అతనికి సరైన శిక్ష ! ’’ , అని తీర్పు చెప్పాడు.

చుట్టు ప్రక్కల  ఉన్న జనం అతడి ఆ తీర్పు విని , ‘‘   చాలా బాగుంది ! గొప్ప తీర్పు ’’, అని మెచ్చుకున్నారు .

 

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం