తాజా కథలు @ CCK

చిలుక తల్లి - చిలుక జోస్యం

2015-05-17 23:05:01 చిన్నారుల కథలు
ఒక అడవిలో పచ్చని చెట్ల  మీద చాలా చిలకలు నివసిస్తూఉండేవి. అవి చేసే సందడి అంతా ఇoతా కాదు !   తియ్యని పండ్లను తింటూ, చిలుక పలుకులు పలుకుతూ అవి హాయిగా  ఉండేవి.

వాటిలో ఒక కొంటె చిలుక   ఉండేది. దాని చిలిపితనం చెప్పనలవి కాదు ! ఎప్పుడూ ఏదో ఒక చిలిపి చేష్ట చేస్తూ, మిగిలిన వాటిని  నవ్విస్తూ ఉండేది. అది వయసులో అన్నిoటికన్నా పెద్దది కావడం వల్ల , మిగిలిన  చిలుకలన్నీ దానిని ‘‘ చిలుక తల్లి ! ’’ అని పిలుస్తూ ఉండేవి.

చిలుక తల్లి చేసే చిలిపి పనులతో , అవి ఒక్కో సారి అయోమయంలో పడిపోతూఉండేవి కూడా ! చిలుక తల్లి ఏవేవో అబద్ధాలు చెప్పి , వాటిని నమ్మిస్తూ ఉండేది. దాని మాయమాటలు విని అవి మోసపోయేవి . తన మాటలతో మిగిలిన వాటిని బురిడీకొట్టించి వినోదించడం చిలుక తల్లికి   వ్యసనంగా మారిపోయింది.

ఒక్కో సారి ఫలానా రోజు భూ ప్రళయం వస్తుందని భయపెట్టేది. మరోసారి గ్రామం పొలిమేరల్లో ఉండే అగ్నిపర్వతం బ్రద్దలై  ముప్పు కలుగుతుందని భయపెట్టేది. ఇంకోసారి పదుల సంఖ్యలో బోయలు వచ్చి చిలుకలనన్నింటినీ ఉచ్చులు వేసి బంధించి తీసుకుపోతారని చెప్పేది . మరోసారి , అడవిలోని చెట్లన్నీ అకారణంగా కూలిపోయి, చిలుకలు తినడానికి ఒక్క పండూ మిగలదని జోస్యం చెప్పేది.

తీరా, గడువు దాటిపోయినా ఏ ఆపదా కలగకపోవడంతో చిలుకలు ఊపిరి పీల్చుకునేవి . ఇలా , చిలుక తల్లి " జోస్యం "  పేరుతో ఎన్నిసార్లు బెదరగొట్టినా, ఆ అమాయకపు చిలుకలు  మళ్ళీ మోసపోతూనే ఉండేవి .

ఇలా ఉండగా, ఒక రోజు నిజంగానే   వేటగాడు   అడవిలోకి వచ్చి,అక్కడి చిలుకలని పట్టుకోడానికి ప్రయత్నించాడు. దురదృష్టవశాత్తూ వాడి చేతికి చిలుక తల్లి చిక్కింది . వాడు దానిని తీసుకునిపోయి, చెట్టు క్రింద " చిలుక జోస్యం " చెప్పే వాడికి అమ్మేసాడు. వాడు దాన్ని పంజరంలో బంధించాడు. ఎగిరి పోకుండా రెక్కలు సన్నగా కత్తిరించాడు.

పంజరం మీద చేతి వేళ్ళతో తాను కొడుతూ ఉంటే , క్రింద   ఉంచిన కాగితాల కట్టలోనుండి  ఒక కాగితాన్ని ముక్కుతో తీసి ఇవ్వడం ఎలాగో దానికి శిక్షణ ఇచ్చాడు . ఇప్పుడు, దాని పని ఆ జోస్యం అబద్ధమని తెలిసినా కాగితాల కట్టలోనుండి ఒక కాగితం తీసి ఇచ్చి, తిరిగి బుద్ధిగా పంజరంలోకి దూరి పోవడమే అయింది . చిలిపితనంతో నేస్తాలకి అబద్ధపు జోస్యాలు చెప్పి, బెదరగొడుతూ ఉండే చిలుక తల్లికి, ఇప్పుడు నిజంగానే అబద్ధపు జోస్యం చెప్పే దుస్థితి వచ్చింది .  అందుకది చింతిస్తూ ఉండేది. ఏo చేయలేని అసహాయతతో  కుమిలిపోయేది .

ఇలా ఉండగా, ఓ రోజు అక్కడికి   వీధి రౌడీ వచ్చాడు. వాడు , లోగడ అక్కడ చిలుక జోస్యం చెప్పించుకున్నాడు. ఆ జోస్యం ఏమాత్రం నిజం కాలేదని   కోపంతో   అక్కడికి వచ్చాడు !  నానా మాటలూ అంటూ వాడు చిలుక తల్లి ఉండే పంజరంను కాలితో బలంగా   తన్నాడు . పంజరంతో పాటూ దూరంగా ఎగిరిపడిన చిలుక తల్లికి శరీరమంతా   గాయాలయ్యాయి.

జోస్యం పేరుతో ఇదివరకు అడవిలోని తోటి చిలుకలని తాను ఆటపట్టిస్తూ ఉండడం చిలుక తల్లికి గుర్తుకొచ్చింది. ఆ పాపమే ఇప్పుడు తనపాలిట శాపమైoదని   ఎంతగానో విచారించింది . ఆపసోపాలుపడుతూ   తిరిగి అడవికి చేరుకుంది.

అడవిలో చిలుకలన్నీ దాని చుట్టూ చేరి జరగిoదంతా   తెలుసుకున్నాయి. చిలుక తల్లి ఏడుస్తూ జరిగిoదంతా వివరించింది. అంతే కాదు, ఇదివరకు తాను వాటితో అబద్ధాలు కల్పించి చెప్పి , వాటిని వేళాకోళం చేసినందుకు పశ్చాత్తాపపడుతూ మన్నించమని వేడుకుంది.

‘‘ అయ్యో ! అంతమాట ఎoదుకమ్మా ? మేము అవన్నీ మనసులో ఉంచుకోము  ! ’’ అంటూ, చిలుకలన్నీ అప్పటి నుండి చిలుక తల్లితో స్నేహంగా ఉన్నాయి .

 

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం