తాజా కథలు @ CCK

అన్నదమ్ముల అన్యోన్యత

2015-05-30 09:05:01 చిన్నారుల కథలు
ఒక  ఊళ్ళో సీనయ్య ,  సీతయ్య అనే అన్నదమ్ములుoడేవారు. వారిలో  సీనయ్య పేదరికంతో బాధపడుతూoడేవాడు.   చిన్న గుడిసెలో సాదాసీదా జీవితం గడుపుతూoడేవాడు.  సీతయ్య మాత్రం వ్యవసాయం మీదా, వ్యాపారాల మీదా బాగా సంపాదించి, విలాసవంతమైన జీవితం గడుపుతూoడేవాడు. పెద్ద ఇల్లు కట్టుకుని అందులో భార్యా పిల్లలతో దర్జాగా  ఉండేవాడు.

సీనయ్య  భార్య ఒంటి మీద  పసుపుతాడు తప్ప , వెండి బంగారాలేమీ ఉండేవి కావు. పిల్లలకి   మంచి బట్టలు ఉండేవి కావు. ఐనా సరే, ఆ కుటుంబంలోని వారు ఏ విచారo లేనట్టుగా   సంతోషంగా జీవితం గడుపుతూ ఉండేవారు. రొజూ ఆనందంగానేకాక, ఆరోగ్యంగా కూడా ఉండేవారు.

సీతయ్య  కుటుంబం మాత్రం ఎంత ఆస్తి ఉన్నా, రొజూ ఏదో అసంతృప్తితో  ఉండేది. అతని భార్యకు ఎన్ని నగలు,  చీరలున్నా, ఇంకా చాలవని భర్తను వేధిస్తూ ఉండేది, పిల్లలు కూడా దుబారా ఖర్చులు చేసేవారు . రోజూ ఇంట్లో అంతా  గొడవ పడుతూ ఉండేవారు. అంతే కాదు, తరచుగా వారికి  రోగాలు వచ్చేవి .

సీనయ్య ఇంటికి వచ్చిన అతిథులకు ఉన్నంతలో పెట్టి తృప్తి పరిచేవాడు .  సీతయ్య సంగతి తెలిసి అతని ఇంటికి ఎవరూ వచ్చే వారు కాదు. అంత పెద్ద ఇల్లు బోసిపోయి ఉండేది. ఏమీ లేక పోయినా, అన్న  కుటుంబం  సంతోషంగా ఎలా ఉండగలుగుతోందో తెలుసుకోవాలని సీతయ్యకు కుతూహలంగా ఉండేది. ఐతే ! డబ్బుందనే అహంకారంతో బంధుత్వాన్ని ప్రక్కన పెట్టిన సీతయ్యకు అన్నని ఆ విషయం అడగడానికి ముఖం చెల్లేది కాదు .

ఇలా ఉండగా...ఓ రోజు    సీనయ్య దారిన పోతూ ఉంటే, అతని కాలిలో ముల్లు గుచ్చకుంది. బాధతో ‘‘ అమ్మా ! ’’ అని, అంతలోనే తేరుకుని, ముఖంలో ప్రశాంతత తెచ్చుకున్నాడు. ఇదంతా, అతని వెనుకగా నడచి వస్తున్న  సీతయ్య చూసి ఆశ్చర్య పోయాడు . ఇక ఉండలేక, అన్నగారిని ముల్లు గుచ్చుకున్న బాధను అంతలోనే ఎలా మరచిపోగలిగావని అడిగాడు.

దానికి  సీనయ్య నవ్వుతూ , ‘‘ ముల్లు గుచ్చుకుంటే ఎవరికైనా బాధ కలగడం సహజమే తమ్ముడూ !   ఇప్పుడు   ముల్లు కాలిలో గుచ్చు కుంది. కానీ , కంట్లో గుచ్చుకోలేదు కదా ! అనే ఆలోచన వచ్చింది. అందుకే , క్షణంలో నా బాధంతా చేత్తో తీసి పారేసినట్టయింది ! ’’ అని , చెప్పాడు.

అన్నగారి కుటుంబం సంతోషంగా ఎలా ఉండగలుగుతోందో ఆ మాటలతో అర్ధమయింది సీతయ్యకి. ఉన్నంతలో తృప్తి పడడం, బాధలోనూ సుఖం వెతుక్కోడం వల్లనే అన్నగారి కుటుంబం సంతోషంగా ఉంటోందని అతనికి అర్ధమయింది.

అహంకారంతో అందరినీ దూరం చేసుకోకుండా, నలుగురితో కలిసిమెలసి ఉంటే , ఆ ఇoట సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని కూడా గ్రహించాడు.

ఆనాటి నుండీ సీతయ్యలో మంచి మార్పు వచ్చింది., భార్యా పిల్లలకి నచ్చచెప్పి వారిలో మార్పు తీసుకొచ్చాడు. అన్నగారి కుటుంబంతో   రాకపోకలు సాగించాడు. ఇప్పుడు ఆ అన్నదమ్ముల అన్యోన్యతని మెచ్చుకోని వారు లేరు .

 

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం