తాజా కథలు @ CCK

పిసినారితనం

2015-03-13 05:05:01 చిన్నారుల కథలు
రామాపురం అనే ఊరిలో  రాఘవయ్య అనే  ధనవంతుడు ఉండేవాడు. కానీ, పరమ పిసినారి . ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టే వాడు కాదు .అయితే ! అతడు తన పిసినారితనాన్ని అందరి ముందూ వెల్లడి కాకుండా జాగ్రత్త పడేవాడు.

ఒకసారి అతని దగ్గరకి  రాజయ్య అనే పేద రైతు వచ్చి, తన కుమార్తె పెళ్ళికి వెయ్యిరూపాయలు అప్పుగా ఇవ్వమని అడిగాడు. ఆ సమయంలో  రాఘవయ్య చుట్టూ ఊరి పెద్దలు కూర్చుని ఉన్నారు. అందరి మధ్య రాజయ్యని లేదు పొమ్మనడం కుదరక,  రాఘవయ్య   తన భావాలను ముఖంలో కనబడనీయకుండా జాగ్రత్త పడ్డాడు.

రాజయ్య  అడిగిన వెయ్యిరూసాయలూ అతనికి ఇస్తూ ఇలా అన్నాడు , ‘‘ రాజయ్య ! ఈ డబ్బుతో నీ కూతురి పెళ్ళి జరిపించు. నాకు నువ్వు వడ్డీ ఇవ్వనవసరం లేదు. అసలు కూడా, నీ దగ్గర ఎప్పుడు  ఉంటే అప్పుడే తెచ్చి ఇవ్వు. తొందరేమీ లేదు. నీ దగ్గర డబ్బు ఎప్పుడు  ఉంటే అప్పుడే నా బాకీ తీర్చ వచ్చు . పోయిరా ! ’’ అన్నాడు ఎంతో దయగా...  రాఘవయ్య మాటలు విని అక్కడున్న వాళ్ళందరూ అతని మంచితనాన్ని ఎంతగానో పొగిడారు .

రాఘవయ్య  ఇంట్లో పని చేసే భీముడు అనే నౌకరు  ఇదంతా గమనిస్తూ ఉన్నాడు. వాడికి  యజమాని మాటలు నమ్మబుద్ధి కాలేదు. బయటకి మంచితనం చూపిస్తున్నా, యజమాని మనసులో ఏదో దురాశ ఉండే ఉంటుందని వాడు అనుమానించాడు. వాడు అనుమానించినట్టే అయింది .

ఆ మరుసటి రోజే  రాఘవయ్య,  భీముడిని పిలిచి ఇలా అన్నాడు : ‘‘ నువ్వు వెంటనే  రాజయ్య ఇంటికి వెళ్ళు. నాకు అనుకోని అవసరం వచ్చoది. అతనికి నేను నిన్న ఇచ్చిన వెయ్యిరూపాయలలో నాలుగువందలరూపాయలు అడిగి తీసుకురా . సాయంత్రానికి తిరిగి ఇస్తానని చెప్పు.  రాజయ్య , కూతురి పెళ్ళికి ఇంకా వారం రోజుల సమయం ఉంది కదా ! ’’, అన్నాడు.

భీముడికి , యజమాని ఎత్తు తెలిసిoది. చేసేదేమీ లేక,  రాజయ్య దగ్గరికి వెళ్ళి ,యజమాని చెప్పినట్టే చెప్పాడు.  రాజయ్య ఇచ్చిన నాలుగువందలూ తెచ్చి  రాఘవయ్య చేతికి ఇచ్చాడు. రెండో రోజు కూడా  మరో రెండువందలు తెప్పించుకున్నాడు రాఘవయ్య .

రాఘవయ్యకి  ఏ అవసరం వచ్చిందో ? పాపం ! అనుకున్నాడే. కానీ, రాజయ్యకి అతని మీద అనుమానం రాలేదు. పెళ్ళికి ఇంకా సమయం ఉంది. కనుక, రాఘవయ్య   వెనక్కి తీసుకున్న డబ్బు తిరిగి ఇస్తాడని నమ్మాడు రాజయ్య . మూడో రోజు,  రాఘవయ్య నేరుగా  రాజయ్య ఇంటికి వచ్చి, ఏదో కారణం చెప్పి ఆ సాయంత్రమే   వెయ్యిరూపాయలూ మళ్ళీ ఇస్తానని చెప్పి నాలుగువందలు తీసుకుని పోయాడు . దీoతో రాజయ్యకి ఇచ్చిన వెయ్యిరూపాయలూ తిరిగి  రాఘవయ్య తీసుకున్నట్టయింది . ఆ సాయంత్రం కాదు  , మరుసటి రోజు  కూడా  రాఘవయ్య అతనికి డబ్బు సర్దుబాటు చెయ్యలేదు.

దాoతో, రాజయ్య కనీళ్ళపర్యంతమయ్యాడు. ఇదంతా, గమనిస్తున్న భీముడు యజమాని ని అసహ్యించుకున్నాడు. తన యజమానికి ఎలాగైనా గుణపాఠం నేర్పాలని అనుకున్నాడు . ఆ రోజు రాత్రి భోజనాల సమయంలో  రాఘవయ్య విస్తరిలో భీముడు అన్ని పదార్ధాలూ వడ్డించాడు.

తీరా, యజమాని తినబోతూ ఉంటే, ఆగమని చెప్పి, ఉప్పు తక్కువైoదనో, పులుపు  లేదనో, కారం వేయడం మరచిపోయాననో చెబుతూ అతని విస్తరిలో నుండి ఒక్కో పదార్ధమూ తీసెయ్యడం మొదలుపెట్టాడు . చివరకి విస్తరి అoతా ఖాళీ అయింది . భీముడు మళ్ళీ పదార్ధాలను వడ్డిస్తాడని ఎదురుచూశాడు రాఘవయ్య .

కానీ, ఎంత సమయం ఎదురు చూసినా, వడ్డిoచడు. దాంతో , రాఘవయ్యకి కోపం వచ్చింది . ‘‘ విస్తరిలో వడ్డించినట్టే వడ్డించి ,అన్నీ తీసేస్తా వేమిట్రా  ! ’’ అంటూ భీముడిని కొట్టడానికి చేయెత్తాడు. కానీ , అంతలోనే అతనికి భీముడు అలా ఎందుకు ప్రవర్తించాడో అర్థమయింది.

రాజయ్యకి తను చేసిన ద్రోహానికి ,ఇది ప్రతీకారమని గ్రహించాడు.సిగ్గుతో తల దించుకున్నాడు. ఆ  మరుసటి రోజే రాజయ్యని పిలిచి, అతని కుమార్తె పెళ్ళికి డబ్బు సర్దుబాటు చేసాడు . అంతేగాక, వధువు చేతిలో విలువైన కానుకలు ఉంచి ఆశీర్వదించాడు .ఆ రోజు నుండీ రాఘవయ్యలో పిసినారితనం  కొంచెం కూడా కనిపించ లేదు .

 

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం