తాజా కథలు @ CCK

మూఢ విశ్వాసం

2015-05-07 23:05:01 చిన్నారుల కథలు
ఒకప్పుడు రామాపురం అనే గ్రామంలో  పది గడపలు కూడా ఉండేవి కావు. కానీ, ఆ ఇళ్ళ వారికి ఎప్పుడూ ఒకరంటే ఒకరికి పడేది కాదు . ప్రతి చిన్న విషయానికీ ఎప్పుడూ  గొడవలు పడుతూనే ఉండేవారు.  అందువల్ల ,చుట్టు ప్రక్కల గ్రామాల వారికి ఆ ఊరంటే చులకన భావం ఏర్పడిoది.

రామాపురాన్ని అందరూ  వేళాకోళం చేస్తూ ఉండేవారు. రామాపురానికి చెందిన రాఘవరావు అనే యువకుడికి మాత్రం , తమ గామ ప్రజల ప్రవర్తన తలనొప్పిగా ఉండేది. చాలా కాలం పెద్ద చదువుల కోసం పెద్ద పట్టణాలలో గడిపాడు. వాడిలో లోకానుభవం వల్ల చక్కని సంస్కారం ఏర్పడింది.

గ్రామస్థుల ప్రవర్తన వల్ల ఊరికి చెడ్డ పేరు వస్తోందని వాడు దిగులు చెందుతూoడేవాడు. మంచిగా చెప్తే వాళ్ళు వినరని , ఏదో విధంగా ఊరి ప్రజలలో మార్పు తీసుకుని రావాలని   నిర్ణయించుకున్నాడు. ఇలా ఆలోచించి, ఒక రోజు రాత్రి ఎవరూ చూడకుండా ఒక తోడేలు బొమ్మ ఉండే పతాకాన్ని ఒక యింటి కప్పు మీద ఉంచాడు. దాoతో, ఆ ఇంటి యజమాని భయపడి  మర్నాడు ఉదయాన్నే రాఘవరావు దగ్గరకి వచ్చి ఆ విషయం చెప్పాడు.

రాఘవరావు అతని భయం  రెట్టింపు అయ్యేలా మాట్లాడాడు. అదేదో " అరిష్ట పతాకం "లా ఉందని అన్నాడు. దాని విషయమై తాను పట్నం వెళ్ళి ప్రముఖ సిద్ధాంతి గారిని అడిగి తెలుసుకుని వస్తానని చెప్పాడు." హమ్మయ్య ! ఆ పని త్వరగా చెయ్యి. నీకు పుణ్యం ఉంటుంది   ’’అని బ్రతిమాలాడు.

ఆ తరువాత, అలాగే   ప్రతి రాత్రీ అందరి ఇళ్ళ మీదా అలాంటి పతాకాలే ఉంచడం మొదలుపెట్టాడు రాఘవరావు. భయంతో తన దగ్గరకి పరుగెత్తుకొచ్చిన అందరికీ అవి అరిష్ట పతాకాలే , అని నమ్మబలికేవాడు. దాoతో , ఊరంతా  వాటి విషయమై వెంటనే పట్నం వెళ్ళి సిద్ధాంతి గారిని కనుక్కురమ్మని అతని మీద  ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. ఇదిగో, అదిగో ! అంటూ రాఘవరావు వారిని ప్రతి రోజూ త్రిప్పి పంపించేస్తున్నాడు. దాoతో, ఊరి వాళ్ళు విసిగిపోయారు.

ఇక లాభం లేదని, ఒక రోజు ఆ ఇళ్ళ యజమానులందరూ కలసికట్టుగా రాఘవరావు దగ్గరకి వచ్చి దీనంగా ఈ విధంగా వేడుకున్నారు , ‘‘ అరిష్ట పతాకాల గురించి పట్నం వెళ్ళి సిద్ధాంతి గారిని కనుక్కురమ్మని అడిగితే ఇన్ని రోజులూ వెళ్తానంటూనే జాప్యం చేస్తున్నావు . మన ఊరిలో చదువుకున్న వాడివి నువ్వొక్కడివే. మేం ఎవరం ఎప్పుడూ పట్నం మొహం చూసి ఎరుగని వాళ్ళం . పట్నం తెలిసిన వాడివని నీ సహాయం కోరితే, నువ్వేమో  జాప్యం చేస్తున్నావు. అరిష్ట పతాకాల వల్ల  ఎవరికీ రాత్రి  నిద్ర పట్టడం లేదు.భయతోం వణికి పోతున్నాం . పట్నం బయలుదేరకుండా ఆలస్యం చేస్తున్నావు. నీకిది ధర్మంగా లేదు  ,’’ అని అన్నారు.

వారి మాటలకి,  రాఘవరావు కోపం నటిస్తూ వారితో ఇలా అన్నాడు - ‘‘ మీలో మీకు ఎప్పుడూ సఖ్యత లేదు . ఎప్పుడూ ఏదో ఒక దానికి గొడవలు పడుతూనే ఉంటారు. మన గ్రామం పరువు మంటకలుపుతున్నారు. మీకు కష్టం వచ్చింది. కనుక, ఇప్పుడు మాత్రం అంతా ఒకటిగా నా దగ్గరకి వచ్చారు. ఈ కష్టం తొలగిపోయాక మళ్ళీ   మీలో మీరు గొడవలు పడుతూ ఉంటారు.

అందుచేత, ఇప్పుడు  నేను మాత్రం మీకు ఎందుకు సహాయం చేయాలి. వెళ్ళి రండి , ’’ అని   చెప్పాడు. దాoతో,   గ్రామస్థులు   ఇక మీదట అలా ప్రవర్తించమనీ, అంతా కలసిమెలసి ఉంటామనీ ప్రమాణం చేసారు. తమ తప్పులు మన్నించి, వెంటనే పట్నం వెళ్ళి అరిష్ట పతాకాల గురించి తెలుసుకుని రమ్మని వేడుకున్నారు.

అప్పుడు రాఘవరావు నవ్వి ఇలా అన్నాడు , ‘‘అరిష్ఠ పతాకాలు అనేవి ఒక మూఢ విశ్వాసం . అవి నేను పెట్టిన పతాకాలు . మీలో భయం కలిగించి, మీ మధ్య సఖ్యత కలిగించడం కోసమే నేను వాటిని మీ ఇళ్ళ మీద ఉంచాను . మూఢ నమ్మకం వల్ల భయంతో ఒకటైన మీరు మన ఊరికి చెడ్డ పేరు రాకుండా కలసి మెలసి ఉండలేరా ! ’’ అన్నాడు.

రాఘవరావు మాటల  వల్ల ఊరి ప్రజలలో  మార్పు వచ్చింది. ఇప్పుడు, వాళ్ళు ఇదివరకటిలా గొడవలు పడటం లేదు. చక్కగా కలసి మెలసి ఉంటున్నారు.

 

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం