తాజా కథలు @ CCK

మహాపండితుడు

2015-06-11 17:05:01 చిన్నారుల కథలు
రాచపల్లి అగ్రహారంలో రామశాస్త్రి అనే ఒక మహాపండితుడుoడేవాడు. అతడు చిన్నప్పుడే అన్ని శాస్త్రాలూ ఔపోసన పట్టాడు. పురాణేతిహాసాలు క్షుణ్ణంగా చదువుకున్నాడు. చుట్టుప్రక్కలే కాక, సుదూర ప్రాంతాలలో ఉండే జమీందారులలో కూడా, అతనికి సాటి వచ్చే పండితుడే లేడని ప్రతీతి !

చాలా మంది అతని దగ్గర విద్యలు అభ్యసించి , మహా పండితులయ్యారు. అతనికి లెక్కలేనన్ని బిరుదులు వచ్చాయి. సువర్ణఘంటాకంకణధారణ, గజారోహణాలూ లాంటి గొప్ప సత్కారాలు చాలా జరిగాయి. దానితో, అతనికి అహంకారం ఎక్కువయింది. తన మాటే వేదవాక్కు అనుకునేవాడు. అతని పాండిత్యం ముందు నిలువలేక, ఎవరూ అతని ఎదుట నోరుమెదపలేకపోయేవారు.

రామశాస్త్రి కూతురు పేరు కమలిని. కొడుకులు లేరు. కమలిని అపురూప సౌందర్యవతి, వినయo  కలది. యుక్తవయస్సు వచ్చాక, రామశాస్త్రి  ఆమెకు వివాహం చేయాలని అనుకున్నాడు. చాలా మంది  ఎన్నో మంచి సంబంధాలు తీసుకువచ్చారు. కానీ , తన బిడ్డకు తగిన వాడిని తాను మాత్రమే ఎన్నిక చేయగలనని అతని ఆలోచన. అందువల్ల ఎవరెంత గొప్ప సంబంధం తెచ్చినా ,ఏదో వంకతో తిరస్కరించేవాడు.

తనతో వియ్యమందడానికి వచ్చిన వారిని, పెండ్లి కుమారులనూ అతను  జటిలమయిన ,శాస్త్ర సంబంధమయిన ప్రశ్నలడిగేవాడు. వారితో శాస్త్ర చర్చలకు దిగేవాడు. వారి మేధస్సుకు పరీక్ష పెట్టేవాడు.  శాస్త్రాలలోనే కాక, పురాణాల నుండి, ప్రబంధాల నుండీ   క్లిష్టమైన ప్రశ్నలడిగేవాడు. వాటికి సమాధానాలు చెప్పలేక ,వచ్చిన వాళ్ళు బిక్కముఖాల పెట్టేవారు. దాంతో, వచ్చిన మంచి సంబంధాలెన్నో తిరిగిపోయేవి.

అతను వేసే ప్రశ్నలకు అంతూ పొంతూ ఉండేది కాదు . అతి కష్టం మీద ఎన్నింటికి జవాబులు చెప్పినా, అతనికి తృప్తి ఉండేది కాదు . మరిన్ని అడిగి, వారి నోళ్ళు మూయించేవాడు. అతని ధోరణి చూసి ,అతని భార్య చారుమతికి చాలా దిగులుగా ఉండేది. ఇలా అయితే, పిల్లకి జన్మలో పెళ్ళి కాదని తెగ బాధపడుతూ ఉండేది.

ఇలా ఉండగా, ఆ గ్రామానికి కాశీ నుండి ఒక మహాపండితుడు వచ్చి దేవాలయంలో విడిది చేసాడని చారుమతి విన్నది.  రాహులుడు అనే అతని కొడుకు   అతని వెంట ఉన్నాడనీ, అవివాహితుడనీ, మంచి రూపo కలవాడు  అనీ  విన్నది. అంతే కాదు, బాగా చదువుకున్నవాడని , మంచి జమీందారీ నౌకరీ కూడా చేస్తున్నాడనీ  తెలిసింది. ఆ యువకుడు కమలినికి ఈడూజోడూ అని , తెలుసుకుని మురిసిపోయింది. ధైర్యం చేసి. తన మనసు లోని మాట తన అన్నగారి ద్వారా ఆ పండితునికి తెలియజేసింది. ఆ పండితుడు తన కుమారుడు  రాహులుడిని వెంట పెట్టుకుని, పెళ్ళి చూపులకు వచ్చాడు.

ఎప్పటిలానే, రామశాస్త్రి   ప్రశ్నల వర్షం కురిపించాడు. కాశీ పండితుడూ, అతని కుమారుడూ వాటికి చక్కగా సమాధానాలు చెప్పారు. సమయం గడుస్తుంది. కానీ, శాస్త్ర చర్చ మాత్రం ముగియడం లేదు . ఆ సంబంధం ఎలాగైనా కుదిరితే బాగుoడు , అని ఆశ పడుతున్న వారందరికీ ఆదుర్దాగా ఉంది.

ఆ సమయంలో కాశీ పండితుడు రామశాస్త్రి గారితో ఇలా అన్నాడు, ‘‘ అయ్యా ! మీరు మహా పండితులు. దానికి తిరుగు లేదు .మా గురుదేవులు అనుగ్రహించిన విద్య వల్ల మేమూ తగిన జవాబులు చెప్పగలిగాము. కానీ, మేము అడిగే ఒకే   ప్రశ్పకు మీరు సమాధానo ఇవ్వాలని  కోరుకుంటున్నాము ,’’ అన్నాడు. దానికి, రామశాస్త్రి ఒప్పుకున్నాడు.

ఇంత వరకూ మీ అమ్మాయికి చాలా సంబంధాలు వచ్చాయనీ, మీ శాస్త్ర చర్చలతో అవి తిరిగి పోయాయనీ విన్నాను. మీరు వచ్చిన వారి పాండిత్యాన్ని పరీక్షిస్తూ ఉండిపోయారే తప్ప , ఏనాడయినా, మీ అమ్మాయి మనసులో ఏముందని ఒక్కనాడయినా అడిగారా ? ఇదే నేను అడిగే ప్రశ్న, అని అన్నాడు కాశీ పండితుడు. దాoతో రామశాస్త్రికి కోపం  వచ్చింది.

ఇదేం ప్రశ్న ? ఇలాంటి లౌకికమైన ప్రశ్నలకి నేను జవాబులు చెప్పను , అన్నాడు కోపంగా.

అయ్యా ! క్షమించాలి . నేను తమను  ఒక్క ప్రశ్న అడుగుతానన్నాను. కానీ, అది లౌకికమైనదా , కాదా ? అని చెప్ప లేదు.

అదీ కాక, వివాహం చేసుకోవడం, కాపురం చేయడం అనేవి లౌకిక సంబంధమైన విషయాలని, తమకు నేను చెప్పవలసిన పని  లేదు , అన్నాడు కాశీ పండితుడు.

సూక్ష్మబుద్ధి గల రామశాస్త్రికి, కాశీ పండితుని మాటలలో ఆంతర్యం అర్ధమైoది. మరో ఆలోచనలేకుండా అతనితో వియ్యమందడానికి అంగీకరించాడు . అంతా సంతోషించారు.

మంచి ముహూర్తాన కాశీ పండితుని కుమారుడు  రాహులుడితో, కమలిని వివాహం అంగరంగవైభవంగా జరిగింది. ఇప్పుడా దంపతులకి ఒక  కొడుకు కూడా  !

 

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం