తాజా కథలు @ CCK

దైవానుగ్రహం ఉంటే, రాజానుగ్రహం ఉంటుంది

2015-05-17 11:05:01 చిన్నారుల కథలు
అవంతీపురం రాజ్యంలో రాజనాథుడు అనే రాజు ఉండేవాడు.  అతని రాజ్యం శత్రు భయం లేకుండా ప్రశాoతంగా ఉండేది. ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తూoడేవారు. ఎక్కడా అరాచకాలు లేవు, ఆందోళనలు లేవు, ఆకలి చావులు  లేవు. ఇదంతా ,తన పరిపాలనలోని గొప్పతనం అని రాజు  నమ్మేవాడు. దాoతో అతనికి అహంకారం ఎక్కువయింది.

రాజనాథుని పూర్వీకులు ఎంతో దైవ భక్తి కలవారు  . గుళ్ళూ, గోపురాలూ కట్టించారు. ఎన్నో పుణ్యకార్యాలు చేసారు. పండితులను ఎంతో గౌరవంగా చూసుకునేవారు. రాజనాథుని పాలనలో అన్నీ అంతరించిపోయాయి. దానికి కారణం , రాజుకి దైవం మీద కన్నా, తన మీద ఉండకూడనంత నమ్మకం ఉండడంచేతనే. దైవానిదేమీ లేదని, అంతా తన గొప్ప తనమేననీ  నమ్మేవాడు.

రాజనాథుడు  దైవ దూషన చేయక పోయినా, రాజ్యంలో దైవ కార్యాలకి  ఆదరన లేకుండాపోయింది.దేవాలయాలకు, పండితులకు ఆదరణ లేకుండాపోయింది. రాజపురోహితుడు , సుశర్మ ఈ పరిస్థితికి చాలా బాధపడ్డాడు. దైవానుగ్రహం గురించి రాజుతో ఒక రోజు సంభాషించాడు. రాజు ఆగ్రహించి, దైవానుగ్రహం కన్నా ప్రజలకు రాజానుగ్రహమే కావాలని వాదించాడు. ఏమీ అనలేక సుశర్మ మిన్నకుoడిపోయాడు.

ఇలా ఉండగా... కొన్నాళ్ళకు, రాచకొలువులో కొన్ని ముఖ్యమైన పదవులలో ఉద్యోగులను నియమించవలసివచ్చింది. వాటిలో కొన్ని పదవులు రాజు గారి అంత:పురంలో చేయాల్సినవి. అంత:పురంలో కొలువు చేసేవారికి ఎక్కువ వేతనం ఉంటుంది. మరికొన్ని రాజ్యంలోని వివిద దేవాలయాలలో చేయాల్సినవి. దేవాలయ విధులు చేసే వారికి వేతనం తక్కువగా ఉంటుంది. రాజు ఆ పదవులలో నియమించడానికి రాజ్యంలో నలుమూలల నుండి గొప్ప పండితులను పిలిపించాడు. ఆ  పదవులకు కావలసిన సంఖ్యలో పండితులను ఎన్నిక చేసాడు.

చిత్రంగా, వారందరూ వేతనం తక్కవే అయినప్పటికీ, దేవాలయాలలో విధులు చేయడానికే మొగ్గు చూపారు . అంత:పురంలో ఉద్యోగానికి ఏ ఒక్కరూ సిద్ధపడలేదు. రాజుకి ఆగ్రహంతోపాటూ, ఆశ్చర్యం కూడా కలిగింది .అప్పటికి వారిని పంపేసి, సుశర్మను పిలిపించి వారు అలా ప్రవర్తించడానికి కారణం ఏఏమిటని అడిగాడు.

సుశర్మ, రాజుకి ఇలా వివరించాడు-  ‘‘ మహారాజా ! తమ అనుగ్రహం వలన మన రాజ్యంలో ప్రజలూ , పండితులూ   సుఖసంతోషాలతో ఉంటున్నారు.   ఈ మహాపండితులంతా తమ  కొలువులో కాకుండా, దేవాలయాలలో పని చేయడానికి ఒక  కారణం ఉంది. అదేoటంటే,  దైవానుగ్రహం ఉంటే, రాజానుగ్రహం ఎలాగూ ఉంటుందని వారు భావిస్తున్నారు.

తమకు రాజానుగ్రహం ఎలాగూ పుష్కలంగా ఉంది. కనుక, ధనానికి లోటు లేదు. అందుకే, తమ అనుగ్రహం ఎప్పుడూ ఉండేలా వారు దైవానుగ్రహం కోరుకుంటున్నారు. అందుచేతనే వేతనం తక్కువైనప్పటికీ దైవానుగ్రహం పొందడానికి దేవాలయాలలో దైవకార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నారు.

అంతే కానీ ! ఇది రాజు పట్ల అవిధేయత మాత్రం కాదు, అని చెప్పాడు. మహామంత్రి మాటలతో రాజులో పరివర్తన కలిగి, అహంకారం తొలిగి పోయింది. ఆరోజు నుండి, ఆ రాజ్యంలో  దేవాలయాలు మళ్ళీ కళకళలాడాయి. ప్రజలు  సుఖసంతోషాలతో జీవించడం మొదలుపెట్టారు. శత్రు రాజ్యాలు, ఆ రాజ్యం వైపు కన్నెత్తి చూడనేలేదు !

 

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం