తాజా కథలు @ CCK

కనువిప్పు

2015-06-05 19:05:01 చిన్నారుల కథలు
వింధ్యాపురం  రాజ్యాన్ని రాఘవుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు.వేట అతనికి   వ్యసనంగా మారింది. వేట రాఘవుడికి ఎంత వ్యసనంగా మారిందంటే, రాజకార్యాలేవీ పట్టించుకోనంత ! ఏడాది పొడుగునా వేట కోసం మందీమార్బలంతో అడవిలో ఉండేవాడు.

పరిపాలనను గాలికొదిలేసాడు. రాజు గారి వేటంటే మాటలా ! అందమైన గుడారాలు,  వంటలు తయారు చేయడానికి వంట వాళ్ళూ, రాజు గారిని ఉల్లాస పరిచేందుకు నాట్యకత్తెలు, సంగీత  కళాకారులు, విదూషకులూ, వందిమాగధులూ .....  ఒకరేమిటి ! రాజు గారి వెంట అడవికి రాచనగరంతా తరలి వెళ్ళేది. రాఘవుడికి రాజ వైభవాలన్నీ అడవిలోనే అమరిపోయేవి .  రాజ పాలన అస్సలు పట్టించుకోవడమే మానేసాడు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పడానికి ఎవరికీ ధైర్యం లేదు.   ప్రజలు   అవస్థలూపడేవారు.

ఇలా ఉండగా, ఒక రోజు అడవిలో వేటాడుతూ ,రాఘవుడు దారి తప్పిపోయాడు. అతని పరివారమంతా బాగా వెనుకబడిపోయింది. రాజు ఒంటరిగా కీకారణ్యంలో చిక్కుకుపోయేడు. చాలా దూరం నడచి  బాగా అలసిపోయాడు. ఆకలి . దాహంతో నాలుక పిడచకట్టుకుపోయింది. చిత్రంగా అడవి చెట్లన్నీ మ్రోడువారిపోయాయి . అడవి, రాఘవుడి కంటికి ఎడారిలా కనిపించసాగింది. ఎక్కడా తిండీ, నీరూ దొరికే సూచనలు లేవు. అలసట వల్ల నిద్ర ముంచుకొస్తోంది. రాజుకి దు:ఖం వచ్చింది. ఏడుపొక్కటే తరవాయి ! ‘‘ దేవా ! గుక్కెడు నీళ్ళూ , పిడికెడు అన్నమూ ఇప్పించవయ్యా ... సుఖంగా నిద్ర పోయేందుకు సురక్షితమైన చోటు చూపించవయ్యా ....’’ అని, గుర్తొచ్చిన దేవుళ్ళనందరినీ వేడుకున్నాడు.

అడివంతా తిరిగాడు. రాజుకి మతిపోయింది. పచ్చగా ఉండే అడవంతా ఇప్పుడు వెలవెలబారిపోయిoది.  పళ్ళ చెట్లకు ఒక్క పండూ కనిపించడం లేదు. రాజుకి ఆందోళన ఎక్కువయింది .   అడవంతా తిరిగాడు. " ఒకే ఒక్క చోట,  చెట్టుకి ఒకే ఒక్క పండు కనిపించింది " . రాజుకి ప్రాణం లేచొచ్చినట్టయింది. దానిని కోసుకుని తినబోయాడు.

అంతలో, ఆ చెట్టు కింద కూర్చుని ఒక కుర్రాడు ఆకలికి ఏడుస్తూ కనిపించాడు. రాజుకి వాడిపై జాలి వేసింది. ఆకలి బాధ చల్లార్చుకోవడం కోసం నోట పెట్టుకోబోతున్నఆ  పండుని వాడికి ఇచ్చేసాడు. " వాడు  పండు తిన్నాడో, లేదో, వెంటనే మాయమైపోయాడు "  . రాజు ఆశ్చర్యానికి అంతు లేదు . అంతలోనే అడవిలో చెట్లన్నీ ఇదివరకటిలాగే పళ్ళతో కళకళలాడుతూ కనిపించాయి. కావలసిన పళ్ళని కోసుకుని తిందామని , రాజు అనుకుంటూ ఉండేంతలో విపరీతమయిన మంచు తుఫాను కురిసింది.రాజు మంచులో తడిసి పోయాడు, చలికి వణికిపోసాగేడు.

అంతలో,  ముసిలామె   చెట్టు కింద చలికి వణికిపోతూ అతనికి కనపడింది. రాజు జాలితో ఆమెకు తన ఒంటి మీద బట్ట తీసి ఇచ్చేడు. అంతే ! ఆమె వాటిని అందుకుందో, లేదో, మంచు తుఫానూ మాయమైపోయింది. మళ్ళీ అడివంతా ఎప్పటిలా  ప్రశాంతంగా ఉంది.  రాజు ఈ సారి మరింత  ఆశ్చర్య పోయాడు. ఈ వింత మార్పులకి కారణం ఏమిటా ?  అని ఆలోచిస్తూ ముందుకి నడిచాడు . ఇంతలో, అడవిలో ఒక్కసారిగా దావాలం చెలరేగింది. ఆ మంటల్లో  కుందేలు చిక్కుకుపోయి, వివిలాడుతూ ఉండడం రాజుకి కనపడింది. ఏ మాత్రం ఆలోచించకుండా, రాజు దయతో దానిని కాపాడి, అడవిలో వదిలేసాడు.

అప్పుడు, రాజుతో ఆకాశవాణి ఇలా అంది -  ‘‘ ఓ రాజా ! నీ వేట వ్యసనం వల్ల అడవిలోని జంతుజాలం నానాటికీ తగ్గిపోతోంది . నీ వల్ల, నీ పరివారం వల్ల అడివంతా నాశనమై పోతోంది. నీకిది తగదు సుమా ! అయితే, ఒక విషయం ! నువ్వు ఆకలితో ఏడుస్తున్న బాలుడికి , చలికి వణికిపోతున్న వృద్ధురాలికి, సాయం చేస్తున్నప్పుడు నీకు నీ ఆకలిదప్పులు కానీ, చలి బాధ కానీ గుర్తుకు రాలేదు ! అంటే, నువ్వు నీ రాజ ధర్మాన్ని పూర్తిగా మరచిపోలేదన్నమాట ! అలాగే, చేతికి చిక్కిన కుందేలుని కాపాడి వదిలిపెట్టావంటే, నీ వేట వ్యసనం నిన్ను ఇంకా పూర్తిగా నిర్దయుడిగా చేయలేదన్నమాట ! నీలో ఇంకా రాజధర్మం, మానవత్వం మిగిలే ఉన్నాయి.

ఒక్క నీ వేట వ్యసనం వల్ల నీకూ, నీ ప్రజలకీ అనర్ధం జరుగుతోంది. దానికి ప్రతీకగానే అడవిలో పచ్చని చెట్లన్నీ అకస్మాత్తుగా మ్రోడువారిపోవడం, మంచు తుఫాను కురియడం, దావానలం వ్యాపించడం ... జరిగాయి. ఈ విపరీతాలన్నీ నీకు కనువిప్పు కలిగించడం కోసం వనదేవత సృష్టించినవే ! అందువల్ల, నువ్వు ఇకనైనా ఈ వేట వ్యసనాన్ని తగ్గించుకుని, నీ ప్రజలను చక్కగా పరిపాలించు ! నీ రాజ్యంలోని ప్రజల ఇక్కట్లు తొలిగించు. అది నీ ధర్మం ! ’’ అంది.

రాజుకి కనువిప్పు కలిగింది. ఇంతలో , రాజు పరివారమంతా వెతుక్కుంటూ వచ్చారు. అప్పటి నుండి, క్షత్రియ ధర్మంగా ఎప్పుడో తప్ప , రాజు వేటకు రావడం లేదు. అప్పటి నుండి, రాఘవుడి రాజ్యం సుభిక్ష మయింది .   ప్రజల సంతోషం ఇంతా అంతా కాదు !

 

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం