తాజా కథలు @ CCK

మేకపోతు గాంభీర్యం

2015-06-07 05:05:01 చిన్నారుల కథలు
అనగనగా ఒక మేక . దాని యజమానికి ఆ మేక అంటే ఎంతో ఇష్టం. ఆ మేకకు కృష్ణుడు అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకోసాగాడు ఆ యజమాని. ఒక రోజు మిగతా మేకలతో కలిసి కృష్ణుడుని కూడా అడవికి మేతకు తీసుకుని వెళ్లాడు. కృష్ణుడు మేకల మందతో కలిసి అడవిలో బాగా ఆడుకుంది. కడుపు నిండా గడ్డి, ఆకులు అలములు తిన్నది. ఆ రోజు దానికి చాలా ఆనందంగా ఉంది. ఉరుకులు పరుగులు పెడుతూ అడవి అంతా తిరిగిన ఆ మేకపిల్ల అందరికన్నా ముందు వెళ్లాలన్న ఉత్సాహంతో మంద నుంచి తప్పిపోయింది. చాలాసేపు అడవి అంతా తిరిగింది. ఎంతసేపు తిరిగినా అది మేకల మందను చేరుకోలేకపోయింది. అప్పటికే చీకటి పడిపోవడంతో ఇక చేసేదేం లేక ఎటు పోవాలో తెలీక ఒక గుహ కనబడితే ఆ గుహ లోపలికి పోయి పడుకుంది.

కొంతసేపటికి ఏదో అలికిడి వినిపిస్తే కృష్ణుడికి మెలకువ వచ్చి లేచింది. ఆ గుహలో నివాసం ఉంటున్న సింహం దాని వేట ముగించి సుష్టుగా భోజనం చేసినట్టుంది. త్రేంచుకుంటూ వచ్చింది. సింహం గురించి ఇంతకు ముందు వినడమే తప్ప కృష్ణుడు దానిని ఎప్పుడూ చూడలేదు. అలాంటిది సింహాన్ని చూడగానే మేకపోతుకు గుండెలు దడ దడలాడాయి. కానీ తను భయపడినట్టు కనిపిస్తే సింహం తనను వదిలి పెట్టదు అని కృష్ణుడికి అర్ధం అయ్యింది. సింహం కూడా మేకపోతును చూసి భయపడింది. చీకటిలో మేకపోతు కళ్ళు మిల మిలా మెరుస్తున్నాయి. పెద్ద గడ్డము, కొమ్ములు, ఉన్న ఆ వింత జంతువును చూడగానే సింహానికి కూడా భయం వేసింది. ఈ వింత జంతువు బహుశా నన్ను చంపడానికే వచ్చినట్టుంది. అందుకే ఇక్కడకు వచ్చి నాకోసం ఎదురు చూస్తోంది అని అనుకుంది.

చీకటిలో తనను చూసి ఏదో వింత జంతువు అని సింహం అనుకుంటుందని అందుకే భయపడిందని మేకపోతుకు అర్ధం అయ్యింది. అది అలా తనను చూసి భయపడుతూ ఉండగానే దాన్ని ఇంకా భయపెట్టాలి. ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని మేకపోతు నిర్ణయించుకుంది. కానీ ఈ చీకటిలో ఎలా తప్పించుకోవడం? ఒక వేళ తప్పించుకుని వెళ్ళినా ఈ చీకటిలో ఈ అడవిలో ఎక్కడికని వెళుతుంది? కాబట్టి ఎలాగోలా తెల్లవారుఝాము దాకా ఇక్కడే ఉండి ఆ తర్వాత తప్పించుకోవాలి అని అనుకుని మేకపోతు గంభీరంగా అలాగే కూర్చుండిపోయింది. మరో పక్క సింహం కూడా అలాగే అనుకుంది. తెల్లవారితే ఆ వింత జంతువు ఏదో తెలుసుకోవచ్చు. ఒకవేళ అది నాకన్నా బలవంతురాలైతే దానితో స్నేహం చేసుకోవచ్చు. ఒకవేళ ఆ జంతువు తన కన్నా బలహీనురాలైతే దానిని సంహరించవచ్చు ఏదైనా తెల్లారే వరకు ఇలా మౌనంగా ఉండక తప్పదు అని సింహం అనుకుంది.

మేకపోతు, సింహం రెండూ కూడా నిద్రపోకుండా రాత్రంతా ఒకదానినొకటి గమనిస్తూ కూర్చున్నాయి. తెల్లవారుతుండగా మేకపోతు ధైర్యం తెచ్చుకుంది. అప్పుడే సింహాన్ని గమనిస్తున్నట్టుగా "ఏయ్ ఎవరు నువ్వు?" అని గద్దించింది. సింహంకు ఇంకా బెదురు పోలేదు. "నేను సింహాన్ని . మృగరాజును. నేనే ఈ అడవికి రాజును." అంది భయం భయంగా."నువ్వు ఈ అడవికి రాజువా!? చాలా విచిత్రంగా ఉంది. ఇంత బక్క పలచగా ఉన్నావు. నువ్వు ఈ అడవికి రాజువేంటి? అంటే ఈ అడవిలో మిగతా జంతువులు నీకన్నా బలహీనంగా ఉంటాయన్నమాట. సరే ఏది ఏమైనా నా అదృష్టం పండింది. నేను ఇంతవరకు లెక్కలేనన్ని పులులను, వెయ్యి వరకు ఏనుగులను చంపాను. అది కూడా నా వాడి కొమ్ములతో ఒక్క సింహాన్ని మినహా అన్ని జంతువులను నా కొమ్ములతో ఒక్క కుమ్ము కుమ్మి చంపేసాను. సింహాన్ని కూడా చంపితే నా దీక్ష పూర్తి అవుతుంది. సింహాన్ని చంపేవరకు ఈ గడ్డం తీయనని నేను ప్రతిఙ్ఞ పూనాను. నేటితో నా దీక్ష పూర్తి అయినట్టే" అంటూ సింహం మీదకు ఒక్క దూకు దూకింది.

అంతే సింహం పెద్దగా అరుస్తూ ఆ గుహలోంచి బయటకు పరుగు తీసింది. మేకపోతు సూర్యోదయం అయ్యే వరకు ఆ గుహ లోనే ఉండి సూర్యోదయం అయ్యాక అడవి లోకి వెళ్ళింది. అప్పటికే దాని యజమాని వెతుక్కుంటూ అటు వైపుగా వచ్చాడు. కృష్ణుడు యజమానిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. యజమాని దానిని చూసి చాలా సంబరపడ్డాడు. "నువ్వు ఎక్కడికి వెళ్లిపోయావో అని నేను ఎంత ఖంగారుపడ్డానో తెలుసా? రాత్రంతా ఇంటికి రాకపోతే అడవిలో తప్పిపోయి తిరుగుతున్నావో లేక ఏ జంతువుకైనా ఆహారమయిపోయావో అని భయపడ్డాను. పోన్లే నువ్వు క్షేమంగా ఉన్నావు కదా నాకు అదే చాలు", అని అంటూ కృష్ణుడ్ని దగ్గరకు తీసుకున్నాడు.

కృష్ణుడు ఆ తర్వాత మేకల మందతో కలిసి ఇంటి దారి పట్టాడు.

 సింహం చేతిలో చావు తప్పదని గ్రహించిన మేకపోతు... చేత కానప్పటికీ డాబూ, దర్పంతో గాంభీర్యాన్ని ప్రదర్శించి తన ప్రాణాలను ఎలా కాపాడుకుంది.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం