తాజా కథలు @ CCK

నిజమైన గౌరవ మర్యాదలు

2015-06-13 05:05:01 చిన్నారుల కథలు
ఒక ఊళ్ళో గంగులు అనే బలశాలి  ఉండేవాడు.వాడికి కండ బలంతో పాటు, చెప్పలేనంత అహంకారం కూడా ఉండేది. కన్నూమిన్నూ కానకుండా పొగరుమోతు తనంతో వ్యవహరిస్తూ ఉండేవాడు. వాడిని చూస్తూనే ఊరి ప్రజలందరూ ప్రక్కలకి తొలగిపోతూ ఉండేవారు. వాడితో ఎవరూ మాట్లాడడానికి సాహసించే వారు కాదు. అది చూసి, వాడు తనంటే అందరికీ చెప్పలేనంత గౌరవం, భక్తీ ఉన్నాయని అనుకుంటూ ఉండేవాడు.ఆ విషయమే తండ్రికి కూడా తరచుగా చెబుతూ ఉండేవాడు.

గంగులు తండ్రి చాలా ఉత్తముడు. తనకి అలాంటి దుర్మార్గుడయన కొడుకు పుట్టినందుకు ఎప్పుడూ కుమిలిపోతూ ఉండేవాడు. ఎన్ని విధాలుగా మంచి బుద్ధులు చెప్పినా , గంగులు వినిపించుకునేవాడు కాదు. అంతేకాక, తండ్రి మీద కూడా విరుచుకుపడుతూ ఉండేవాడు. తండ్రి వాడికి చెప్పి చెప్పి , విసిగిపోయేవాడు.

ఇలా ఉండగా, ఆఊరికి ఒక రోజు ఒక సాధుపుంగవుడు వచ్చేడు.అతని రాకతో ఊరి జనం అంతా తీర్ధయాత్రలాగా బయలుదేరి సాధువును దర్శించుకోవడం మొదలుపెట్టారు.సాధువును చూడాలనే తొందరలో వెళ్తూ దారిలో గంగులు కనిపించినా మునుపటిలా వారు ప్రక్కలకి తొలగిపోవడం మానేసారు. దాంతో గంగులుకి విపరీతమయిన ఆగ్రహం వచ్చింది. వడి వడిగా సాధువు దగ్గరకి వెళ్ళాడు.

సాధువును ఏకాంతంగా కలసి ఇలా నిలదీసాడు. ‘‘ మీ రాకతో ఈ ఊరి ప్రజలు నన్ను మునుపటిలా పట్టించుకోవడం మానేసారు. నన్ను చూసి ప్రక్కలకి తొలగిపోవడం లేదు. ఇది వరకటిలా గౌరవ మర్యాదలు చూపించడం లేదు. నాకు చాలా చిన్నతనంగా ఉంది. వాళ్ళు అలా నన్ను ధిక్కరించడానికి కారణం ఏమిటో చెప్పండి ’’ అనడిగేడు. సాధువు నవ్వి, ‘‘ ఊరి ప్రజలు ఇంత వరకూ నిన్ను నిజమైన గౌరవ మర్యాదలతో చూస్తున్నారనుకుంటున్నావా ? అది నీ భ్రమ . ఊరి వారి నుండి నువ్వు నిజమైన గౌరవ మర్యాదలు పొందాలంటే ,ఒక ఉపాయం చెబుతాను, విను .

ఒక వారం, రోజులపాటు నువ్వు అందరితోనూ స్నేహంగా మెలగు. అందరికీ వీలయినంత సాయం చెయ్యి. అందరితో మంచిగా ఉండు. ఎవరినీ భయపెట్టేలా ఉండకు. ఇలా, ఓ వారం రోజులపాటు చేసాక కూడా వారు నన్ను పట్టించుకోవడం లేదని నీకనిపిస్తే , మళ్ళీ నా దగ్గరకి రా . ఏం చెయ్యాలో అప్పుడు చెబుతాను ’’ అని సలహా ఇచ్చేడు. సాధువు మాటలతో గంగులు ఆలోచనలో పడ్డాడు. తన తండ్రి తనతో తరచుగా చెప్పేదీ, సాధువు ఇప్పుడు చెబుతున్నదీ ఒకటే . వారు చెబుతున్నట్టానే ఓ వారం రోజుల పాటు చేసి చూద్దాం , అనుకున్నాడు.

అందరితో సఖ్యంగా ఉంటూ, మంచిగా మర్యాదగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అందరితో కలుపుగోలుతనంతో మాట్లాడడం మొదలు పెట్టాడు. అందరికీ వీలయినంత సాయం చేసేవాడు. అప్పుడందరూ అభిమానంతో వాడి చుట్టూ తిరగడం మొదలు పెట్టారు. ఇంతకు ముందు తనని చూస్తూనే భయంతో ఇళ్ళలోకి దూరిపోతూ ఉండే పిల్లలు కూడా ఇప్పుడు తన చుట్టూ చేరడం గంగులు గమనించేడు. వాడికి చాలా సంతోషం కలిగింది . వారం తరువాత సలహా కోసం వాడు మరింక సాధువు దగ్గరకి వెళ్ళనక్కర లేకపోయింది .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం