తాజా కథలు @ CCK

తప్పు చేసిన మనిషి మనస్సాక్షి ఎప్పుడు భయపడుతూ వుంటుంది .

2015-06-12 17:05:01 చిన్నారుల కథలు
ఒకసారి అక్బర్ మహారాజు ఉంగరం పోయింది. కోట మొత్తం వెతికినా కనిపించలేదు.

అప్పుడు అక్బర్, బీర్బల్ను దర్బారుకి పిలిపించి , “ బీర్బల్ ! నా ఉంగరం కనిపించటంలేదు. సేవకులు కోటంతా వెతికేరు, ఐనా దొరకలేదు. ఎవరో దొంగలించారని నా అనుమానం. దొంగలించిన వాళ్ళు మన సభలో ఎవరో అయ్యుండాలి, ఎవరో కనిపెట్టగలవా ? ” , అని అడిగారు.

బీర్బల్ ఒక నిమిషం అలోచించాడు. “ ఇది చాలా సులువైన పని . మహారాజా ! దొంగలించిన మనిషి గడ్డంలో ఒక బియ్యపు గింజ వుంటుంది, అందరి గడ్డాలు పరీక్షిస్తే దొంగెవరో ఇట్టే కనిపెట్టచ్చు ” , అన్నాడు.

వెంటనే సభలో ఒక వ్యక్తి తన గడ్డం తడుముకున్నాడు. ఇది చూసిన బీర్బల్ వెంటనే దొంగని పట్టించాడు.

అక్బర్ చాలా ఆశ్చర్యపోయారు. “ బీర్బల్ ! నీకెలా తెలిసింది, దొంగ గెడ్డంలో బియ్యపు గింజ వుందని ? ” అని అడిగారు.

“ మహారాజా ! తప్పు చేసిన మనిషి మనస్సాక్షి ఎప్పుడు భయపడుతూ వుంటుంది. దొంగతనం చెయ్యని వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని చూస్తుంటే, తప్పు చేసిన వాడు తన గడ్డం భయంతో తడుముకున్నాడు ” , అని బీర్బల్ వివరించాడు.

ఇలా , బీర్బల్ మరొక్కసారి తన సమయస్ఫూర్తిని, తెలివితేటలని ప్రదర్శించాడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం