తాజా కథలు @ CCK

గొప్పవాడిననే భావం

2015-06-05 15:05:01 చిన్నారుల కథలు
అయిన దానికీ ,కాని దానికి పందెం కాసే రాజుకి ఆ ఊరిలో పందేల రాజు అని పేరు పడిపోయింది .పైగా చాలా పందేల్లో అతడే గెలవడం వల్ల తాను గొప్పవాడిననే భావం అతడిలో బాగా పెరిగిపోయింది . అతడి ఈ అలవాటును మార్చాలని తల్లిదండ్రులూ ,స్నేహితులూ ఎంత ప్రయత్నిచినా వీలు కాలేదు .

పట్నంలో చదువుకుంటున్న సూరి సెలవుల్లో గ్రామానికి వచ్చాడు . ఊరిలో అందరూ తన స్నేహితుడి గురించి చులకనగా మాట్లాడటం విని , ఎలాగైనా సరే అతడిని ఈ చెడ్డ అలవాటు నుంచి బయటపడేయాలనుకున్నాడు.

ఒక రోజు తన స్నేహితుల సమక్షంలో " మా తోటలోని ఒక చెట్టుకున్న పది కాయల్ని తిన్న వారికి పది వేల రూపాయల బహుమతి ఇస్తాను . ఓడిపోయిన వాళ్ళు నాకు అయిదు వేలు ఇచ్చినా చాలు " అంటూ సవాలు విసిరాడు.

అలవాటు ప్రకారం వెంటనే పందేనికి దిగిపోయాడు రాజు.సూరి అతడిని గన్నేరు చెట్టు దగ్గరకు తీసుకెళ్ళి దాని కాయలు తినమన్నాడు . దాన్ని చూడగానే రాజు పై ప్రాణాలు పైనే పోయాయి.దాంతో పందెంలో ఓడిపోయానని ఒప్పుకొని అయిదువేలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు . సూరి మాత్రం ఆ సొమ్మును తీసుకోకుండా " నువ్వు పందేల జోలికి వెళ్ళకుండా చేయడానికే ఈ ఏర్పాటు చేశాను . ఇంకెప్పుడూ పందేలు కాయనని మాట ఇస్తే చాలు " అన్నాడు.అప్పటినుండి రాజు పందేల జోలికి వెళ్ళకుండా బుద్ధిగా ఉండడం మొదలుపెట్టాడు .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం