తాజా కథలు @ CCK

నలదమయంతుల కలయిక

2015-05-13 11:05:01 చిన్నారుల కథలు
దమయంతి తన దాసితో -  " వచ్చింది ఋతుపర్ణ మహారాజు అతని సారధి వార్ష్ణేయుడు. వారు నాకు తెలుసు, కాని, వారి వెంట ఉన్న కురూపి ఎవరు ? అతనిని చూసి నా మనస పరవశించిపోతుంది. అతని వివరాలు తెలుసుకుని రా " అని పంపింది.

దాసి నలుని వద్దకు వచ్చి " అయ్యా ! రాకుమారి మీ యోగ క్షేమాలు కనుక్కుని రమ్మంది " అని చెప్పింది. నలుడు " మీ రాకుమారి స్వయంవరం ప్రకటించింది కదా ! దానికి నేను మా మహారాజును ఒక్క రోజులో నూరు ఆమడల దూరం ప్రయాణించి తీసుకువచ్చాను, అని చెప్పు " అన్నాడు.

" మీతో వచ్చిన మూడవ వ్యక్తి ఎవరు ? " అని దాసి అడిగింది. నలుడు " అతడు వార్ష్ణేయుడు. ఇంతకు ముందు నలుని సారధి " అన్నాడు. దాసి " అతనికి నలుని జాడ తెలుసు కదా ? " అని అడిగింది. నలుడు దాసితో " తన రాజ్యాన్ని పోగొట్టుకునే ముందు నలుడు తన పిల్లలనిచ్చి వృష్ణేయిని విదర్భకు పంపాడు. ఆ తరువాత వార్ష్ణేయుడు ఋతుపర్ణుని వద్ద సారధిగా చేరాడు. నలుని గురించి నలునికి తెలియాలి, లేదా అతని భార్యకి తెలియాలి, వేరొకరికి తెలిసే అవకాశం లేదు " అన్నాడు బాహుకుడు.

దాసి " అయ్యా ! నలుడు తనను ప్రాణపదంగా చూసుకునే భార్యను నిర్దాక్షిణ్యంగా అడవిలో విడిచి వెళ్ళాడు. దమయంతి నలుడు విడిచి వెళ్ళిన సగం చీర ధరించి కాలం గడుపుతోంది. ఆమెను ఇలా విడిచి వెళ్ళడం ధర్మమా ? " అని అడిగింది. నలుని కంట నీరు పెల్లుబికింది. అది దాసికి తెలియకూడదని మొహం తిప్పుకున్నాడు. దమయంతికి దాసి జరిగినదంతా వివరించింది.

దమయంతి దాసితో -  " సందేహం లేదు. అతడు నలుడే. అయినా ! ఈ వికృత రూపం ఏమిటి ? అతను వంటవాడు అని చెప్పారు. కనుక, వంట ఎలా చేస్తాడో పరీక్షించు " అని పంపింది. దాసి వెళ్ళి నలుని నిశితంగా పరిశీలించి " అమ్మా ! అతను సామాన్యుడు కాదు. అతడు ఏ పని అయినా సునాయాసంగా చేస్తున్నాడు. అతడు గడ్డిని విదిలిస్తే మంటలు వస్తున్నాయి. వంట పూర్తయే వరకు అలా మండుతున్నాయి. వంటలు అద్భుతంగా ఉన్నాయి " , అని దమయంతికి చెప్పింది.

దమయంతి నలుడు వండిన వంటలు తెప్పించి రుచి చూసి " సందేహం లేదు, ఇవి నలుని వంటలే " అని గ్రహించి, దాసితో తన పిల్లలను నలుని వద్దకు పంపింది. నలుడు వారిని చూసి చలించి ఎత్తుకుని ముద్దాడాడు. దాసితో " అమ్మా ! ఏమీ అనుకోవద్దు, వీరిని చూస్తే నా బిడ్డలు గుర్తుకువచ్చారు . అందుకే అలా చేసాను. ఇక నువ్వు నా వద్దకు రావద్దు. ఎవరైనా చూస్తే ఏదైనా అనుకుంటారు. అయినా, మేము విదేశాల నుండి వచ్చిన అతిధులం మాతో నీకేం పని ? " అన్నాడు.

ఇది విని దమయంతి సంతోషపడి తన తల్లి వద్దకు వెళ్ళి " ఋతుపర్ణుని సారధిగా వచ్చిన కురూపి బాహుకుడే నలుడు. అమ్మా అతను ఇక్కడకు వస్తాడా, నేను అక్కడకు వెళ్ళాలా నువ్వే నిర్ణయించు " అని అడిగింది. భీమరాజు అనుమతితో ఆమె బాహుకుడిని దమయంతి వద్దకు రప్పించింది. దమయంతి నలుని చూసి, " అయ్యా ! నిస్సహాయంగా ఉన్న నన్ను నా భర్త నలమహారాజు నట్టడవిలో నిర్డాక్షిణ్యంగా వదిలి వెళ్ళాడు. అలా సంతానవతినైన నన్ను విడిచి పెట్టడం ధర్మమా ? అలా చేయడానికి నేనేమి అపకారం చేసాను ? అగ్ని సాక్షిగా విడువను అని నాకు ప్రమాణం చేసిన భర్త అలా చేయవచ్చా ? " అని దుఃఖించింది.

నలుడు " సాధ్వీ ! ఆ సమయంలో నన్ను కలి ఆవహించి ఉన్నాడు. అందువలన నేను అలా చేసాను. జూదంలో సర్వం పోగోట్టుకుని బాధలు పడుతున్న నేను, నాతోపాటు బాధలు పడుతున్న నీ బాధను సహించలేక, నిన్ను విడిచి వెళ్ళాను. అలా చేస్తే నువ్వైనా నీ తండ్రి ఇంటికి వెళ్ళి సుఖంగా ఉంటావని అలా చేసాను. నీపై అనురాగంతో మిమ్మల్ని చూడటానికే నేను ఇక్కడకు వచ్చాను. మరొక భర్త కోసం స్వయంవరం ప్రకటించడం కులస్త్రీలకు తగునా ? అలా ఎందుకు చేసావు ? అందుకే కదా... ఋతుపర్ణుడు వచ్చాడు.ఇది ధర్మమా ? " అని దమయంతిని అడిగాడు.

దమయంతి " నాధా ! నేను మీ కోసం గాలిస్తూ పంపిన విప్రులలో అయోధ్యకు వెళ్ళిన విప్రుడు మిమ్ములను గుర్తించాడు. మిమ్ములను రప్పించుటకే ఇలా చేసాను. మీరుకాక, ఇంకెవరు నూరు యోజమలు దూరం ఒక్క రోజులో ప్రయాణించగలరు ? నాలో ఎటువంటి పాపపు తలపు లేదు, అని మీ పాదములు అంటి నమస్కరించి ప్రమాణం చేస్తున్నాను " అని దమయంతి నలుని పాదాలకు నమస్కరించింది.

వెంటనే ఆకాశం నుండి వాయుదేవుడు " నలచక్రవర్తీ ! ఈమె పవిత్రురాలు, పతివ్రత. నేను, సూర్యుడు, చంద్రుడు ఈమె సౌశీల్యం కాపాడుతున్నాము " అని పలికాడు. నలుడు కర్కోటకుని స్మరించాడు వెంటనే ఒక వస్త్రం వచ్చింది. అది ధరించగానే నలునికి ఇంద్రతేజస్సుతో సమానమైన మనోహరమైన పూర్వ రూపం వచ్చింది. దమయంతిని పరిగ్రహించాడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం