తాజా కథలు @ CCK

అసలు రహస్యం తెలియదు కదా !

2015-06-18 23:05:01 చిన్నారుల కథలు
హేలాపురిలో దుర్గమ్మ సంపన్నురాలు. భర్త పోయినా, ఒక్కగానొక్క కొడుకు రఘునాధుణ్ణి అల్లారు ముద్దుగా పెంచి పెద్దచేసింది. దుర్గమ్మ, రఘునాధుడికి పెళ్ళి ప్రయత్నాలు మొదలు పెట్టింది. సుగంధపురి నివాసి నారాయణ కుమార్తె సింధుర చూడగానే రఘునాధుణ్ణి ఆకట్టుకుంది. అందం, అణకువ సింధురకు పెట్టని ఆభరణాలు. ఐతే ! నారాయణ పెద్ద ఆస్తిపరుడు కాదు. కట్నకానుకలేవీ ఇచ్చుకోలేడు.

దండిగా కట్నకానుకలు తీసుకురాలేని ఈ సంబంధం, దుర్గమ్మకు సుతరామూ నచ్చలేదు. కానీ, రఘునాధుడు, సింధురనే చేసుకుంటానని పట్టుపట్టాడు. చిల్లి గవ్వ ఆస్తి లేని ఈ పేద సంబంధం మనకు వద్దు అనేసింది, దుర్గమ్మ. గారాబంగా పెంచిన తల్లి మాట జవదాటలేక రఘునాధుడు మౌనంగా వుండిపోయినా, మనసులో నుంచి సింధురను మాత్రం తొలగించుకోలేకపోయాడు.

ఈ పరిస్థితిలో నారాయణ బంధువు వ్యవహార దక్షుడైన డెబ్బై ఏళ్ళ వృద్ధుడు శ్రీకరుడు, దుర్గమ్మను చూడవచ్చాడు. ఆయన తనెవరైనదీ దుర్గమ్మకు చెప్పి, సింధుర తండ్రి నారాయణ నాకు ఆప్త బంధువు. అతడికి ఆస్తిపాస్తులు లేని కారణంగా, మీరు అతడి కుమార్తెను చేసుకోవడానికి వెనుకాడుతున్నట్టు తెలిసింది. మీకో రహస్యం చెబుతున్నాను, వినండి. త్వరలోనే సింధురకు ఆమె అత్త వైపు నుంచి బోలెడంత ఆస్తి సంప్రాప్తం కాబోతున్నది.

సింధుర మెడలో మీ అబ్బాయి తాలి కట్టిన మరుక్షణం, ఇరవై లక్షలకు పైగా ఆస్తి ఆమెకు ధారాదత్తమవుతుంది. ఇంతకు మించి నేనేమీ చెప్పలేను అన్నాడు. ఇది వింటూనే దుర్గమ్మకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. సంతానం లేని ధనికురాలైన సింధుర మేనత్త ఎవరో, వివాహమైన మరుక్షణం సింధురకు ఇరవై లక్షల విలువైన ఆస్తి చెందేలా వీలునామా రాసి వుంటుందని ఊహించిందామె.

దుర్గమ్మ, శ్రీకరుడి ముఖంలోకి పరీక్షగా చూస్తూ, అయ్యా ! తమరు పెద్దవారు. అబద్ధం చెప్పరని నమ్ముతున్నాను. కానీ, మీరు చెప్పిన విధంగా జరగని పక్షంలో మాత్రం పరిస్థితులు చాలా దారుణంగా పరిణమిస్తాయి. నారాయణ గారితో వివాహానికి ఏర్పాట్లు చేసుకోమని చెప్పండి అన్నది. ఆ తర్వాత ఒక పక్షం దినాల్లో సింధుర వివాహం రఘునాధుడితో వైభవంగా జరిగిపోయింది.

అతి సామాన్య కుటుంబానికి చెందిన సింధురను, సంపన్నురాలైన తన కోడలుగా చేసుకున్న దుర్గమ్మ ఉదారతను, నారాయణ వైపు బంధువులు పొగడుతూండడం దుర్గమ్మ చెవులబడుతూనేవుంది. వీళ్ళెవరికీ అసలు రహస్యం తెలియదు కదా ! అని నవ్వుకున్నది దుర్గమ్మ. తనకున్నంతలో కూతురికి చీరె, సారె పెట్టి అత్తవారింట కాపురానికి పంపాడు, నారాయణ. త్వరలో కోడలికి కలిసి రాబోయే ఇరవై లక్షల ఆస్తి కళ్ళ ముందు కదలాడుతుండడంతో దుర్గమ్మ, నారాయణ ఏం పెడుతున్నదీ పెద్దగా పట్టించుకోలేదు.

నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి. సింధురకు మేనత్త వీలునామా ద్వారా ఇచ్చి పోయిన ఆస్తి ఎంతకూ రాకపోవడంతో దుర్గమ్మ, శ్రీకరుడి కోసం సుగంధపురికి కబురు చేసింది. ఆయన వస్తూనే దుర్గమ్మ, నా కొడుకు సింధుర మెడలో తాళి కట్టిన మరుక్షణం, ఆమె మేనత్త తరఫు ఆస్తి వస్తుందని చెప్పావు. దాని మాటేమిటి ? అని అడిగింది.

దానికి శ్రీకరుడు మందహాసం చేసి, అమ్మా ! దుర్గమ్మగారూ !

కోడలవగానే, సింధురకు అత్త గారైన నీ నుంచి ఇరవై లక్షలపై చిలుకు ఆస్తి కలిసొచ్చిందని, నీవింకా గ్రహించలేదా ? ఆమె ఇప్పుడు పేదవాడైన నారాయణ కూతురు కాదు. సంపన్నురాలైన దుర్గమ్మ కోడలు అన్నాడు. ఇది వింటూనే దుర్గమ్మ నిర్ఘాంతపోయింది. శ్రీకరుడు చెప్పిందే జరిగిందన్నది, కళ్ళెదుట కనబడుతున్న నిజం. ఇందులో ఎవరినీ తప్పుపట్టలేం. లక్షలు రాకపోతే ఏం ? తన కొడుకు కోరిక తీరింది. గుణవంతురాలు తనకు కోడలయింది, అని సర్ది చెప్పుకున్న దుర్గమ్మ, శ్రీకరుడి తెలివిని మెచ్చుకున్నది.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం