తాజా కథలు @ CCK

ధర్మం జయిస్తుంది

2015-06-08 01:05:02 చిన్నారుల కథలు
కాపవరం అనే గ్రామంలో, రాయుడు అనే ధనవంతుడుండేవాడు. ధనంతోపాటు ఆయనకు గ్రామంలో ఎన్నో పంట పొలాలున్నాయి. ఆ పొలాలన్నింటినీ ఆయన పెట్టుబడి పెట్టి, పేద రైతుల చేత సాగు చేయించేవాడు. రైతులందరూ విశ్వాసంగా ఆయన్నో జమీందారులా కొలుస్తూ, ఏలోటూ లేకుండా సుఖంగా జీవించసాగారు. రాయుడి పూర్వీకులు గొప్ప మల్లయోధులు. రాయుడు కూడా స్వయంగా మంచి మల్లయోధుడు.

ఆయన తన పూర్వీకులను సంస్మరించుకుంటూ, ప్రతి యేటా మల్ల యుద్ధ పోటీలు పెట్టి బహుమతులిచ్చి, మల్లులను ప్రోత్సహించడం చేత రాయుడి పేరు అందరికీ తెలియసాగింది. కాపవరం, ఉప్పలపాడు జమీ గ్రామాల్లో ఒకటి. రాయుడి గురించి ఉప్పలపాడు జమీందారు కృష్ణభూపతి విన్నాడు. ఆయన దివానుతో, కాపవరం మన జమీలోనిదే కదా ! కాని, రాయుడు మన కన్న ఎక్కువ పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నాడని విన్నాను.

దాన్ని అలా సాగనిస్తే, మనకన్న అతడు చుట్టు ప్రక్కల గొప్ప ప్రసిద్ధుడై పోతాడు. మనం జమీందార్లం కనక అతడి పొలాన్ని చేజిక్కించుకునే మార్గమేదైనా ఆలోచించండి అన్నాడు. దానికి దివాను వినయంగా, ప్రభూ! ఇటువంటి వాటిల్లో కయ్యము కన్నా వియ్యమే మేలు. రాయుడికి ఒక్కర్తే కుమార్తె, మంచి సౌందర్యవతి అని విన్నాను. మన యువరాజుకు కూడా పెళ్ళీడు వచ్చింది.

రాయుడి కూతుర్ని కోడల్ని చేసుకోండి, అని సలహా ఇచ్చాడు. కృష్ణభూపతికి ఈ సలహా నచ్చింది. ఆయన అట్టహాసంగా బయల్దేరి కాపవరం వెళ్ళాడు. రాయుడు ఆయనను సాదరంగా ఆహ్వానించాడు. కృష్ణభూపతి, రాయుడితో కొంతసేపు గ్రామ పరిస్థితిని గురించి మాట్లాడి, తనతో వియ్యమందవలసిందిగా కోరాడు.

ఇందుకు రాయుడు మందహాసం చేసి, ప్రభూ ! మీరు జమీందారులు; నేను సామాన్యుణ్ణి. జమీందారీ వంశంలో నా కూతురు ఇమడలేదని, నేను భావిస్తున్నాను. మరో విషయమేమిటంటే, నా చెల్లెలి కుమారుడికి ఇచ్చి చేయాలని చిన్నతనం నుంచి అనుకున్నాము. ఆ ప్రకారం కొద్ది రోజుల క్రితం నిశ్చయ తాంబూలం పుచ్చుకున్నాం. క్షమించండి అన్నాడు.

జమీందారు కృష్ణభూపతికి చాలా కోపమొచ్చింది. పక్కన వున్న దివాను, రాయుడూ ! సిరిరామోకాలొడ్డటమంటే ఇదే ! రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా ? అన్నాడు. రాయుడు భయపడి నీళ్ళు నములుతూ, నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వండి అన్నాడు. జమీందారు సరేనని తన పరివారంతో వెళ్ళి పోయాడు. కొంతసేపు సావధానంగా ఆలోచించాక, రాయుడికి, జమీందారు గురించి అంతగా పట్టించుకోవలసిన అవసరం లేదనిపించింది.

ఒక మంచి ముహూర్తం చూసి, తన కుమార్తె వివాహం మేనల్లుడితో జరిపించేశాడు. జమీందారు ఇది చాలా అవమానంగా భావించాడు. ఆయన దివానుతో, వియ్యం పేరుతో నన్ను కాపవరం తీసుకెళ్ళారు. ఏమయిందో చూశారు కదా ? నాక్కావలసింది, రాయుడి ఆస్తేగాని, అతగాడి కూతురు కాదని, మీకు బాగా తెలుసు. నేడే ఆ పొగరుబోతు ఆస్తిపాస్తుల్ని స్వాధీనపరచుకుంటున్నామని ప్రకటించండి అన్నాడు ఉగ్రుడైపోతూ.

జమీందారు మాట్లాడుతున్నప్పుడు యువరాజు శాంతివర్మ అక్కడే వున్నాడు. అతడు తండ్రితో,  నన్ను అల్లుడిగా తిరస్కరించినందుకు, ఆ రాయుడికి నేనే బుద్ధి చెబుతాను. అందుకు నేనో ఉపాయం ఆలోచించాను అన్నాడు. అదేమిటన్నట్లు జమీందారూ, దివానూ, శాంతివర్మ కేసి చూశారు. అప్పుడు శాంతివర్మ, మల్లయుద్ధంలో నన్ను మించిన వారు లేరు కదా !

వయసు మళ్ళిన ఆ రాయుడిని సునాయూసంగా ఓడించగలను. మల్లయుద్ధ నియమం ప్రకారం, నేను రాయుడిని పోటీకి ఆహ్వానిస్తాను. నాతో ఓడిపోతే, రాయుడు తన ఆస్తి నా పరం చేయాలని నియమం పెడతాను. ఇది అన్యాయమనిపించినా, మన ఇద్దరి పగ తీరడానికి అన్యాయంలా పైకి కనిపించని చక్కని ఉపాయమిది అన్నాడు.

జమీందారు, అందుకు సంతోషంగా అంగీకరించాడు. అనుకున్న ప్రకారం ఉగాది మల్లయుద్ధ పోటీలలో పెద్ద ప్రతిఘటన లేకుండా శాంతివర్మ విజేతగా నిలిచి, ఈ పోటీలు సంతృప్తిగా ముగియాలంటే, రాయుడు నాతో తలపడి గెలవాలి. రాయుడు గనక నెగ్గితే, ఆయనను ఇకపై సాటి జమీందారుగా అంగీకరిస్తాను. ఓడిపోతే ఆస్తి స్వాధీనపరిచి సామాన్య పౌరుడిగా జీవించాలి ! అన్నాడు. ఇది వింటూనే ప్రేక్షకులలో వున్న రాయుడి రైతులూ, గ్రామస్థులూ, ఇది అన్యాయమంటూ అరిచారు.

ఇది చూసి జమీందారు కోపంతో రెచ్చిపోబోతుంటే, రాయుడు అందరినీ వారించి, జమీందారు ప్రభువులు కోపగించుకోనవసరం లేదు. నాకు వయసు మళ్ళినా మల్లయుద్ధ నీతి ప్రకారం శాంతివర్మతో పోరుకు సిద్ధంగా వున్నాను. ధర్మం జయిస్తుందని, నా నమ్మకం ! అంటూ ముందుకు వచ్చాడు. నెరిసిన మీసాలతో వయసు మళ్ళినప్పటికీ ఎంతో గంభీరంగా వింత తేజస్సుతో తన ఎదుటికి వచ్చిన రాయుడిని చూడగానే శాంతివర్మ ఒక్క క్షణం ఉలిక్కిపడ్డాడు.

ధర్మం జయిస్తుంది ! ధర్మం జయిస్తుంది ! అన్న మాటలు ఆయన చెవిలో మారుమోగసాగాయి. రాయుడికి, శాంతివర్మకు మల్లయుద్ధం ప్రారంభమైంది. ఐతే ! విచిత్రంగా శాంతివర్మ మొదటి పట్టులోనే నేలకరిచాడు. ఇందుకు శాంతివర్మ ఎక్కడలేని ఆశ్చర్యంతో జనంకేసి ఒకసారి చూసి, వయసు, బలం, శిక్షణ అంటూ ఏ విధంగా చూసినా, నేనే గెలిచి తీరవలసింది. కానీ ! రాయుడి చేతిలో ఒక్కగానొక్క పట్టులో నేలకొరిగాను.

ఇందుకు బహుశా ఆయన ధర్మబలమే కారణం కావచ్చు ! అన్నాడు. జమీందారు కృష్ణభూపతి, ఊహించని ఈ పరిణామానికి మనసులో బాధపడుతూనే, చేసిది లేక రాయుడిని అభినందించి, కుమారుడితో ఉప్పలపాడు తిరిగి వెళ్ళిపోయాడు. రాయుడు ఎప్పటిలాగే రైతులను ఆదరిస్తూ, చాలా కాలం సుఖంగా జీవించాడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం