తాజా కథలు @ CCK

మనిషికి తుమ్ము రావడం చాలా అరుదు

2015-05-21 23:05:01 చిన్నారుల కథలు
బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పాలించేకాలంలో, బోధిసత్వుడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతడి తండ్రి మణిమాణిక్యాల్లాంటి విలువైన వస్తువులతో వ్యాపారం చేస్తూండేవాడు. ఆయన బోధిసత్వుడికి పదహారేళ్ళ వయసు వరకూ, ఒక గురుకులంలో చక్కగా విద్య నేర్పించాడు.

బోధిసత్వుడు గురుకులం నుంచి ఇంటికి తిరిగి రాగానే అతడి తండ్రి, నాయనా ! నేను పెద్దవాణ్ణి అయిపోతున్నాను. నువ్వు నాకు ఒక్కగానొక్క సంతానం. నీకు ఇంత కాలంగా నేను చేస్తున్న వ్యాపారంలోని మెళకువలు నేర్పదలిచాను అన్నాడు. బోధిసత్వుడు అందుకు సరేనన్నాడు. ఆ తరవాత ఒక వారం రోజులకు తండ్రీ కొడుకులు విలువైన మణిమాణిక్యాలను మూటలు కట్టుకుని, వ్యాపార నిమిత్తం బయలుదేరారు.

ఇద్దరూ అనేక గ్రామాలూ, పట్టణాలూ తిరిగి లాభసాటిగా తమ వద్ద వున్న మణిమాణిక్యాలను అమ్ముతూ, చివరకు వారాణాసి నగరం చేరారు. వాళ్ళు ఆ నగరం చేరేసరికి సూర్యాస్తమయమై చీకటి అలముకుంటున్నది. బోధిసత్వుడి తండ్రి నగర ద్వారపాలకుణ్ణి సమీపించి, నగరంలో ప్రవేశించేందుకు అనుమతి కోరాడు.

అయ్యలారా ! సూర్యాస్తమయం నుంచి, తిరిగి సూర్యోదయం వరకూ నగర ద్వారాలు తెరవరాదని, రాజుగారి ఆజ్ఞ, అన్నాడు ద్వారపాలకుడు.

బోధిసత్వుడి తండ్రి అతడితో, నాయనా ! మన రాత్రి భోజనం మాటేమిటి ? ఇప్పుడే ఆకలి దహించేస్తోంది. నగరం ప్రవేశిస్తే ఏ సత్రంలోనో భోజనం చేసి, హాయిగా విశ్రమించేవాళ్ళం అన్నాడు.

పక్కనే వుండి ఈ మాటలు విన్న ద్వారపాలకుడికి వాళ్ళపై జాలి కలిగి, మీ వెంట వంట చేసుకునేందుకు అవసరం అయిన సామగ్రి వుంటే, నా చిన్న కుటీరంలో వంట చేసుకోవచ్చు అన్నాడు. తండ్రీకొడుకులు ద్వారపాలకుడు చెప్పిన చిన్న కుటీరంలోకి వెళ్ళి, ఒక గంట కాలంలో వంట పూర్తి చేసి, భోజనాలు ముగించారు. అయితే ! అతి చిన్నదైన ఆ కుటీరంలో వాళ్ళిద్దరూ పడుకుని నిద్రపోయేందుకు చోటు చాలలేదు. బోధిసత్వుడి తండ్రి, ద్వారపాలకుడికి కృతజ్ఞత చెప్పుకుని, అయ్యా ! ఈ రాత్రి విశ్రమించేందుకు తగిన చోటు ఏదైనా చూపగలరా ? అని అడిగాడు.

నగరం వెలుపల ఒక పర్ణశాల వున్నది. కాని ! అది భూతప్రేతాలకు ఆవాసం. భయం లేదనుకుంటే, మీరక్కడ ఈ రాత్రి గడపవచ్చు, అన్నాడు ద్వారపాలకుడు. భూతప్రేతాల మాట వింటూనే బోధిసత్వుడి తండ్రి దిగాలు పడిపోయాడు. కాని ! బోధిసత్వుడు ఆయనకు ధైర్యం చెబుతూ, నాన్నా ! మీరేం సంశయించకండి.పది సంవత్సరాల కాలం గురుకులంలో అభ్యసించిన నా విద్యల ప్రభావం మీరెరుగరు అన్నాడు.

బోధిసత్వుడు ఇలా అనగానే, ఆయన తండ్రికి ఎంతో ధైర్యం కలిగింది. తండ్రీ కొడుకులు ఇద్దరూ నగర పొలిమేరలో వున్న పర్ణశాలను చేరారు. అప్పుడు అక్కడ ఎవరూ లేరు. ఇద్దరూ లోపలికి పోయి, గోడవారగా వున్న బల్లచెక్కల పైన పడుకున్నారు. ఆ పర్ణశాలలో నరమాంస భక్షకుడైన ఒకానొక యక్షుడు ద్వారబంధం మీద నివసిస్తున్నాడు.

వాడీమధ్య కొన్ని రోజులుగా ఆహారం దొరక్క ఆకలితో నకనకలాడుతున్నాడు. వాడు తండ్రీ కొడుకులను చూస్తూనే, మంచి ఆహారం దొరికిందని సంతోషించాడు. అయితే ! వాడికొక ఋషి శాపం వున్నది. ఎవరైనా తుమ్మినప్పుడు. తుమ్మిన వాడు గానీ, లేక పక్కన వున్నవాడు గానీ, చిరంజీవ అనకపోతే , ఆ అననివాడినే వాడు భక్షించగలడు.

ఈ కారణం వల్ల, యక్షుడు ఆ తండ్రీ కొడుకుల్లో ఎవరైనా తుమ్ముతారేమో అని చాలా సేపు వేచి చూశాడు. కాని ! ఎంతకూ ఇద్దరిలో ఎవరూ తుమ్మకపోయేసరికి, వాడు పైనుంచి బోధిసత్వుడి తండ్రి మీద ఒక ఘాటైన భస్మం చల్లాడు.

ఆ భస్మం ముక్కుపుటాలను తాకగానే బోధిసత్వుడి తండ్రి గట్టిగా తుమ్మాడు. అయితే ! బోధిసత్వుడు చిరంజీవ అనలేదు. యక్షుడు సంతోషించి, ద్వార బంధం మీది నుంచి కిందికి దిగసాగాడు. ఇదంతా, గమనించిన బోధిసత్వుడు, వెంటనే తండ్రి వీపు తట్టి, ‘‘చిరంజీవ’’ అన్నాడు. యక్షుడు నిరాశ చెంది వెనుదిరుగుతున్నంతలో, వాణ్ణి ఆటపట్టించేందుకు, బోధిసత్వుడు తన ముక్కు రంధ్రాల్లోకి చిన్న గుడ్డపేలికను పోనిచ్చి పెద్దగా తుమ్మాడు.

యక్షుడికి తిరిగి ఆశ కలిగింది. తిరిగి వాళ్ళను సమీపించబోతూండగా, బోధిసత్వుడి తండ్రి, ‘‘ చిరంజీవ ’’ అంటూ బోధిసత్వుడి తలను చేతితో తాకాడు. ఇది చూసి యక్షుడికి కలిగిన కోపం అంతా ఇంతా కాదు. వాడికి నోటి దగ్గరకు వచ్చిన ఆహారాన్ని ఎవరో హఠాత్తుగా తన్నుకుపోయినంత బాధ కలిగింది. అయినా ! చేసేది లేక వాడు ద్వారబంధం ఎక్కబోతున్నంతలో బోధిసత్వుడు, " యక్షా ! ఇటు రా ’’ అన్నాడు.

యక్షుడు వెనుదిరిగి బోధిసత్వుడికేసి పరీక్షగా చూసి, ఆయన ముఖంలోని తేజస్సుకు భయకంపితుడై, చేతులు కట్టుకుని వచ్చి నిలబడ్డాడు.బోధిసత్వుడు వాడికేసి తీవ్రంగా చూస్తూ, యక్షా ! మీ జాతి నరభక్షకులని, నాకు తెలుసు. మా ఇద్దరిలో ఎవరో ఒకర్ని తిని, నీ ఆకలి తీర్చుకోవచ్చు గదా !అలా వెళ్ళిపోతున్నావేం ? అని అడిగాడు.

యక్షుడు, బోధిసత్వుడికి వంగి నమస్కరించి, మహాతేజస్వీ ! నాకొక ఋషి శాపం వున్నది. అందువల్ల, మీపట్ల నేను నిస్సారుణ్ణి,  అన్నాడు. ఏమిటా ఋషి శాపం ? ఎందుకా శాపం ఇచ్చాడు ? అని అడిగాడు బోధిసత్వుడు.

అందుకు యక్షుడు, నేను ఇప్పటికి యాభై ఏళ్ల క్రితం అరణ్యాల్లో తిరుగుతూ, యధేచ్ఛగా కనబడిన మానవులను భక్షిస్తూ వుండే వాడిని. ఒకసారి చీకటిపడే వేళ ఒక నది ప్రాంతాన ఆహారం కోసం తిరుగుతున్నాను. ఆ సమయంలో చెట్ల చాటు నుంచి ఒక మనిషి నదికేసి పోతున్నాడు. ఆహా ! ఆకలి తీరే మార్గం కనిపించింది,అని సంతోషిస్తూ, వెనకనుంచి ఆ మనిషి మెడ పట్టుకున్నాను. అంతే ! మరుక్షణం పిడుగుపాటుకు గురైన వాడిలా స్పృహ తప్పి కింద పడిపోయాను, అని ఇంకా ఏదో చెప్పబోయాడు.

బోధిసత్వుడు చిన్నగా నవ్వి, నీ పొగరుబోతుతనం కొద్దీ, తపశ్శాలి అయిన ఏ ఋషినో ఆహారం చేసుకోవాలని అనుకున్నావన్నమాట, అన్నాడు. అదే జరిగింది. కింద పడిన నేను కొద్దిసేపటికి తెప్పరిల్లి లేవ బోయేంతలో ఆ ఋషి, " ఓరీ , పాపీ ! ఈ ప్రాంతాల నరభక్షణ చేస్తున్నది నీవన్న మాట.నువ్వు చేసిన ఘోరాలకు ఫలితం అనుభవించక తప్పదు. నిన్ను ఆకలి బాధకు గురి చేయదలిచాను. మనిషికి తుమ్ము రావడం చాలా అరుదు.

అలా ఎవరైనా తుమ్మినప్పుడు, ఆ తుమ్మిన వాడు గాని లేక పక్కన వున్న వాడు గాని, చిరంజీవ అనకపోతే,అలాంటి వాళ్ళను మాత్రమే భక్షించు.అంతే గాని, మరే మానవుడినైనా భక్షించదలిచావో నిలువునా దగ్ధమైపోతావు, అని శపించాడు అన్నాడు యక్షుడు. ఇది విన్న బోధిసత్వుడికి, యక్షుడిపై జాలి కలిగింది. ఆయన వాడికి ప్రాణి హింస మహాపాపమని బోధించి, తెల్లవారిన తరవాత వాణ్ణి వెంటబెట్టుకుని తండ్రితో పాటు రాజును దర్శించాడు.

రాజు జరిగినదంతా విని, బోధిసత్వుడికి ప్రణమిల్లి, మీరు మహాశక్తి సంపన్నులు. మీ కారణంగా, నా రాజ్యంలోని ప్రజలకు, నరమాంసభక్షకుడైన యక్షుడి బాధ తప్పింది. మీరు మా సేనాధిపతిగా పదవి స్వీకరించకోరుతున్నాను, అని వేడుకున్నాడు. బోధిసత్వుడు అందుకు అంగీకరించాడు. రాజు ఎంతగానో సంతోషించి బోధిసత్వుణ్ణి సేనాధిపతిగా నియమించాడు. ఆయన తండ్రిని ఘనంగా సన్మానించి, యక్షుడి సంగతేమని అడిగాడు.

రాజా ! ఈ యక్షుడిప్పుడు పరమసాత్వికుడు. అతడి వల్ల ఇక ఎవరికీ ఎటువంటి కీడూ జరగదు. ఇతణ్ణి మీ అశ్వ, గజ శాలలకు అధిపతిగా నియమించండి, అని సలహా ఇచ్చాడు బోధిసత్వుడు. రాజు ఆ విధంగానే యక్షుణ్ణి తన అశ్వ, గజ శాలలకు అధిపతిగా నియమించాడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం