తాజా కథలు @ CCK

దేవేంద్ర పదవి

2015-04-29 07:05:01 చిన్నారుల కథలు
పూర్వం కాశీ రాజ్యాన్ని పాలించిన బ్రహ్మదత్తుడికి, నూరుగురు కొడుకులు. అందరిలో కడగొట్టువాడి పేరు " సంవరుడు ". రాజు తన కొడుకులలో ఒక్కొక్కణ్ణి ఒక గురువు దగ్గరకు విద్యాభ్యాసానికి పంపాడు. చిన్నవాడైన సంవరుడికి బోధిసత్వుడు గురువు.

కొంత కాలం తరవాత రాజకుమారులకు గురువులైన వాళ్ళందరూ, తమ శిష్యులను రాజు దగ్గరకు తీసుకుపోయి, మహారాజా ! తమ పుత్రులు సకల విద్యాపారంగతులయ్యారు, అని చెప్పి, రాజు నుంచి సన్మానాలు పొందారు.

రాజు, తన కుమారులను రాజ్యంలోని వివిధ ప్రాంతాలకు పాలకులుగా ప్రకటించాడు. సంవరుడు, గురువును, నా తండ్రి, నా అన్నలకులాగే, నాకూ రాజ్యంలోని ఏదో ఒక ప్రాంతాన్ని ఇచ్చి, పరిపాలకుడుగా వెళ్ళమంటే, నేనేం చేయాలి ? అని అడిగాడు.

శిష్యుడి ప్రశ్నకు బోధిసత్వుడు, నాయనా ! నీ తండ్రి ఒకవేళ నీకు రాజ్యం ఇస్తానంటే,అందుకు అంగీకరించకు. నీ అన్నలందరూ, తండ్రిని వదిలి తలా ఒక ప్రాంతం వెళ్ళిపోయారు. తండ్రిని కనిపెట్టుకుని వుంటూ, ఆయనను సేవించటం, నీ విధి అన్నాడు.

రాజు ఒకనాడు బోధిసత్వుడి ఆశ్రమానికి వచ్చాడు. సంవరుడు తండ్రికి నమస్కరించి, గురువు పక్కన నిలబడ్డాడు. రాజు, అతణ్ణి "బాబూ ! నీ విద్య పూర్తయిందా ?" అని అడిగాడు.

నాన్నగారూ ! గురువు గారి దయ వల్ల అన్ని విద్యలూ నేర్చుకున్నాను, అన్నాడు సంవరుడు.

అలా అయితే ! నువ్వు పరిపాలించేందుకు, రాజ్యంలో నీ ఇష్టమైన ప్రాంతాన్ని కోరుకో అన్నాడు రాజు.

నేను అందరిలోనూ కడగొట్టువాడిని. నేను రాజ్యం పంచుకుపోతే, మిమ్మల్ని కనిపెట్టుకుని వుండేవారెవరు ? నాకు రాజ్యంతో పని లేదు. మీకు సేవ చేస్తూ, కాలం గడపటమే నేను కోరుకునేది అన్నాడు సంవరుడు.

రాజు ఆ జవాబుకు చాలా సంతోషించాడు. సంవరుడు ఆనాటి నుంచీ తండ్రి దగ్గరే వుండసాగాడు. అవసరం అయినప్పుడు అతడు బోధిసత్వుడి సలహాలు పొందుతూండేవాడు.

ఒకసారి బోధిసత్వుడి సలహా ప్రకారం సంవరుడు కొంత బీడు భూమిని బాగు చేయించి, అందులో పూల చెట్లనూ, ఫల వృక్షాలనూ పెంచి, దాన్ని చక్కని ఉద్యానవనంగా తయారుచేశాడు.

మరొకసారి తండ్రి అనుమతి తీసుకుని సంవరుడు నగరంలోని అన్ని వర్ణాల వారికీ సంతర్పణ చేయించాడు. తరవాత రాజాశ్రితులకూ, రాజ్యంలోని కాల్బల, అశ్వదళ  సైనికులకూ గొప్పగా విందు చేశాడు. విదేశాల నుంచి వచ్చే రాయబారులకూ, వర్తకులకూ సౌకర్యం కోసం, అన్ని వసతులూ గల చక్కని భవనాలు కట్టించాడు. సంవరుడి కీర్తి ప్రతిష్ఠలు ఎంతగానో పెరిగినై.

ఇలా కొంత కాలం గడిచింది. బాగా వృద్ధుడైపోయిన రాజుకు అవసానకాలం సమీపించింది. ఆయన మంత్రులను పిలిపించి, నా తదనంతరం, నా నూరుగురు పుత్రులలో ఎవరికైనా సింహాసనం ఎక్కే హక్కున్నది. కనక, మీరు బాగా ఆలోచించి వారిలో అర్హుడైన వాడికి పట్టం కట్టండి అని చెప్పాడు.

రాజు చనిపోయాక, మంత్రులందరూ చర్చించుకుని, సింహాసనం ఎక్కదగిన వాడు సంవరుడే అని నిర్ణయించి, అతడికి వైభవంగా రాజ్యాభిషేకం చేశారు.

సంవరుడు తమ తండ్రి తదనంతరం రాజవటం, మిగిలిన తొంభై తొమ్మిది మంది రాజకుమారులకూ కోపకారణం అయింది. వాళ్ళందరూకూడబలుక్కుని, ఒక దూత ద్వారా సంవరుడికి సింహాసనం వదులుకోమని హెచ్చరిక పంపి, సైన్యాలతో వచ్చి, కోటను ముట్టడించారు.

సంవరుడు, ఈ సంగతి గురువైన భోదిసత్వుడికి తెలియచేశాడు. బోధిసత్వుడు అతడితో, సోదరులతో కలహించటం మహాపాపం. అందువల్ల నీ తండ్రి ఆస్తిని నూరు భాగాలు చేసి, నీ అన్నలకు ఎవరి భాగం వాళ్ళకు ఇచ్చెయ్యి అన్నాడు.

సంవరుడు అలాగే చేశాడు. ఈ సత్స్రవర్తన అందరిలోకి జ్యేష్ఠుడైన ఉపోసతుడికి చాలా ఆశ్చర్యం కలిగించింది. అతడు, తన తమ్ములతో, సింహాసనాన్ని సొంతం చేసుకోవటం ద్వారా, తమ్ముడు శత్రువయ్యాడని భావించి, దాడిచేయవచ్చాం. కాని ! అతడు న్యాయంగా ప్రవర్తించటం ద్వారా, ప్రజలందరి మెప్పూ పొందాడు. అలాంటి వాడి పైన మనం యుద్ధం చేయటం ఎలా ? అన్నాడు.

అయితే ! ఇప్పుడు మనం చేయవలసిందేమిటి ? అని అడిగాడు తమ్ములలో ఒకడు.

మన తమ్ముడితో రాజీ పడటం ఉత్తమ మార్గంగా, నాకు తోస్తున్నది. తండ్రి గారి సింహాసనానికి మనం అందరం హక్కుదారులం అన్నమాట నిజమే. కాని ! అందరం రాజ్యానికి రాజులం ఒకేసారి కాలేం కదా. అందువల్ల సంవరుడిని రాజుగా అంగీకరించి, మనకు వచ్చిన రాజ్యభాగాలను, తిరిగి అతడి పరంచేయటం న్యాయం అనిపించుకుంటుంది అన్నాడు ఉపోసతుడు.

ఆ మాటలకు తమ్ములందరూ తమ సమ్మతి తెలిపారు. వెంటనే వాళ్ళoదరూ తమ సైన్యాలతో సంవరుడికి జేజేలు పలుకుతూ, నగరం ప్రవేశించారు. సింహాసనాసీనుడై వున్న సంవరుడు, అన్నలందరికీ స్వాగతం చెప్పి, వాళ్ళకు ఉచితాసనాలు ఏర్పాటు చేశాడు.

ఉపోసతుడు సంవరుడితో, తమ్ముడూ ! నీ ధర్మగుణం వేనోళ్ళ కీర్తించదగింది. అందరితోనూ ఇంత మంచిగా వుండగల శక్తి, నీకెలా అలవడింది ? అన్నాడు.

అన్నా! నువ్వనే ఆ శక్తి, బహుశా నేను తోటి మానవుణ్ణెవణ్ణీ ద్వేషించని కారణంగా కలిగి వుంటుంది. ఇక రాజ్యపాలన విషయంలో, పరివారానికి ఎప్పటికప్పుడు జీతాలు పూర్తిగా ఇచ్చేస్తాను. మన రాజ్యానికి వచ్చే రాయబారులనూ, వర్తకులనూ తగిన విధంగా గౌరవిస్తాను. ప్రజల క్షేమమే, నాక్షేమంగా భావిస్తాను అన్నాడు సంవరుడు.

అప్పుడు ఉపోసతుడు, మిగిలిన తన తమ్ముల అందరి పక్షానా సంవరుడిని దీవించి, ఇదే విధంగా ధర్మ మార్గాన రాజ్యం పాలిస్తూ, కీర్తి గడించు. నీ అన్నలమైన మేమందరమూ, నీకు సహాయంగా వుంటూ శత్రు భయం లేకుండా చూస్తాము. ఈ భూలోకంలోనే, నీవు

" దేవేంద్ర పదవి " అనుభవించు అన్నాడు.

బోధిసత్వుడి శిష్యుడైన సంవరుడు, ఈ విధంగా అన్నల నుంచి ప్రేమాదరాలూ, ప్రజల నుంచి గౌరవ మర్యాదలూ పొందాడు. ఆ తరవాత ఎంతో కాలం ప్రజాక్షేమంగా రాజ్యపాలన చేసి, గొప్పరాజన్న కీర్తి గడించాడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం