తాజా కథలు @ CCK

దేవేంద్రుడి వ్యూహం నెరవేరింది

2015-05-14 23:05:02 చిన్నారుల కథలు
బహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పాలించేకాలంలో, సామంతరాజయిన చిరాయు వద్ద నాగార్జునుడనే పేరుతో బోధిసత్వుడు ముఖ్య మంత్రిగా ఉండేవాడు.నాగార్జునుడు దయాళువూ, దానశీలుడూ అని పేరుగాంచాడు. అంతేకాదు, రసాయన శాస్ర్తంలోనూ, ఓషధీజ్ఞానంలోనూ గొప్పనిధి. అతడు, రసాయనిక ప్రయోగంలో ఒక రహస్య యోగం కనిపెట్టి, తనకూ, రాజుకూ జరామరణాలు లేకుండా చేసుకున్నాడు.
ఒకనాడు అతని కొడుకులలోకెల్లా తనకు ప్రేమాస్పదుడైన సోమదేవుడు చనిపోవడం తటస్థించింది. కుమారుడి చావు నాగార్జునుడికి అంతులేని దుఃఖం కల్గించింది. సహజంగా కరుణాళువైన నాగార్జునుడు, ఇక మీదట లోకంలో మరణమనేదే ఉండకూడదు. మరణం ద్వారా ఎవరూ శోకించకూడదు. అందుకు తగిన ఉపాయం కనిపెట్టాలి అని ఆలోచించసాగాడు.

రసాయనాలైతే అమిత వ్యయంతో కూడుకున్న పని. అందువల్ల సామాన్యులకు కూడా అందుబాటులో వుండే మూలికలతోనే అమృతం తయారు చేయాలి. అప్పుడే ప్రజలందరు కూడా శోకానికి లోనుకాకుండా సుఖంగా వుండగలరు , అని నాగార్జునుడు నిశ్చయించాడు.
నిశ్చయం ప్రకారం ఓషధుల సంపుటితో అమృతం తయారు చేయడానికి పూనుకున్నాడు. తనకున్న శాస్ర్తపరిజ్ఞానాన్నంతటినీ వినియోగించి అనేక పరిశోధనలు చేశాడు. చాలా వరకు ప్రక్రియలన్నీ పూర్తి అయినాయి. నాగార్జునుడి ప్రయత్నం చివరి ఘట్టానికి వచ్చింది. " అమృతకల్పం " అనే మూలిక ఒక్కటి చేర్చాలి.

అంతలో, ఈ సంగతి దేవేంద్రుడికి తెలియవచ్చింది. వెంటనే దేవేంద్రుడు అశ్వినీ దేవతలను పిలిచి, మీరు ఇప్పుడే భూలోకానికి పోయి, ఎలాగైనా నాగార్జునుడు తలపెట్టిన అమృతయోగం సిద్ధించకుండా చేయాలి.సామదానబేధ దండోపాయాలన్నిటినీ ప్రయోగించండి. తక్కినపని నేను చూస్తాను అన్నాడు.

అశ్వినీ దేవతలు మారు రూపాలతో భూలోకానికి దిగి వచ్చి, నాగార్జునుణ్ణి దర్శించి, కుశల ప్రశ్నలు ప్రారంభించారు. మంత్రి పుంగవా !రాజ్యాలనే తల్లకిందులు చేయగల యుక్తులు తెలిసిన ఘనుడవైన నీకు తెలియని విషయం లేదు. కాని ! ఇప్పుడు బ్రహ్మ సంకల్పానికే నిరోధం కల్గించడానికి సాహసిస్తున్నావు. మానవుల ధర్మగతి అయిన మరణాన్ని నువ్వు, " అమృతసిద్ధి "చేత ప్రతిబంధించినట్లయితే, సృష్టి పరిపాలనే తారుమారువుతుంది కదా ! మానవుడు ఒక్కడూ చావకుండా వుంటే, ఎన్ని లోకాలైనా సరిపోగలవా ? పైగా !దేవతలు చేయవలసిన ఈ గొప్ప కార్యం మానవమాత్రుడవైన నువ్వే సాధించడానికి పూనుకుంటే, దేవతలకూ, మానవులకూ వ్యత్యాసం ఏదైనా వుంటుందా ? ఇంతకూ నీ కొడుకు చనిపోయాడనే దుఃఖంతోనే కదా ఇంత పని చేస్తున్నావు ? నీ కుమారుడు భూలోకం వదిలినా, స్వర్గంలో సుఖంగానే వున్నాడు అని ధర్మబోధ చేశారు.

ఈ మాటలు నాగార్జునుడి మనస్సుకు అంతగా తృప్తి కలిగించలేదు. తను చేస్తున్న పని తప్పు అవుతుందా ? కాదా ? అన్న ఆలోచనలో మునిగిపోయాడు.ఆ సమయంలోనే చిరాయు పుత్రుడైన జయసేనుడి రాజ్యాభిషేకానికి ఘనమైన ఏర్పాట్లు జరిగినై.
ఈ లోపల, వృద్ధ బ్రాహ్మణ రూపంలో భూలోకానికి చేరుకున్న దేవేంద్రుడు జయసేనుణ్ణి సమీపించి, ఇలా అన్నాడు. నాగార్జునుడు తయారు చేసిన రసాయనిక సేవన వల్ల నీ తండ్రికి జరామరణాలే లేవు గదా ! అటువంటప్పుడు నువ్వు యువరాజుగా వుండి పోవలసిందే .కాని ! నీకు రాజ్యార్హత ఎప్పటికీ కలగదు.

ఆ మాట విన్న జయసేనుడు విచారంతో కుంగిపోయాడు. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు, నాయనా ! ఈపాటి దానికే ఖేదపడకు. నీ కోరిక నెరవేరడానికి సులువైన ఉపాయమున్నది. రోజూ భోజనం ముందు, ఎవరేమి అడిగినా లేదనకుండా ఇవ్వడం నాగార్జునుడికి మామూలు. రేపు నువ్వు ఆ వేళకు వెళ్ళి, ఏమాత్రం జంకకుండా, ‘‘నాకు నీ తల కావాలి '' అని అడుగు. తరవాత ఏం జరుగుతుందో నువ్వే చూద్దువుగాని,అని మనసుకు నచ్చేటట్టు నూరిపోశాడు.

రాజ్యకాంక్షతో వున్న జయసేనుడు మరునాడు భోజనాల వేళ నాగార్జునుడి వద్దకు వెళ్ళి, సరిగ్గా వృద్ధుడు చెప్పినట్టే కోరాడు. నాగార్జునుడు కొంచెమైనా సంశయించకుండా, తన కత్తి జయసేనుడి చేతికిచ్చి, నాయనా ! తల తెగ్గొట్టి తీసుకో. భయపడకు అన్నాడు. రసాయన ప్రభావం వల్ల నాగార్జునుడి శరీరం వజ్రకాయమై వుండడం వల్ల జయసేనుడు ఎన్నిసార్లు నరికినా, కత్తి తూలుతూ వుంది గాని, నాగార్జుడి తల మాత్రం తెగలేదు.

ఈ సమాచారం ఒక్కతృటిలో రాజుకు తెలిసి, ఆయన ఆత్రంతో పరుగెత్తి వచ్చాడు. కొడుకు చేస్తున్న పనికి విచారించి, వానిని వారింపబోయాడు.అప్పుడు నాగార్జునుడు, మహారాజా ! యువరాజు కోరిన కోరికకు పూర్వాపరాలు అన్నీ నాకు తెలుసు.
అతడు నిమిత్తమాత్రుడు. కనుక , అతడిని ఆటంక పరచవద్దు. ఇప్పటి వరకూ గత జన్మలలో నేను తొంభై తొమ్మిది సార్లు, లేదనకుండా నా తల కొట్టి ఇచ్చివున్నాను. ఇది నూరవది. ఈ కొంచెంలో వెనుకంజ వేశానని అపకీర్తి రాకుండా మాట దక్కించవలసిన భారం మీపై వున్నది, అంటూ అఖరి సారిగా భక్తితో రాజును ఆలింగనం చేసుకున్నాడు. తరవాత తన వద్దనున్న మూలికలలో ఒకటి తీసి, కత్తికి రాసి, జయసేనుడితో, ఇప్పుడు కొట్టు నాయనా ! అన్నాడు.

జయసేనుడు ఈసారి కత్తితో నరకగానే, నాగార్జునుడి తల కాడ నుంచి వూడిన కమలం లాగా కింద పడింది.ఆ దృశ్యం చూడలేక, రాజు కూడా ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధమయ్యాడు.అప్పుడు, కింద పడిన నాగార్జునుడి మొండి తల, రాజా ! విచారించకు.ఎన్ని జన్మలకైనా నీతోనే వుంటాను, అంటూ ప్రాణం విడిచింది.

రాజు పూర్తి విరాగి అయ్యాడు. వెంటనే కొడుక్కు పట్టాభిషేకం చేసి, తను తపస్సు చేసుకోడానికి అడవులకు వెళ్ళిపోయాడు.
ఈ విధంగా జయసేనుడికి రాజ్యం లభించింది. దేవేంద్రుడి వ్యూహం నెరవేరింది.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం