తాజా కథలు @ CCK

ఉత్తమ జాతి అశ్వం - పంచకల్యాణి

2015-06-13 15:05:01 చిన్నారుల కథలు
బహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో ఒకప్పుడు, బోధిసత్వుడు ఉత్తమ జాతి అశ్వంగా జన్మించాడు. అది రాజుగారి గుర్రాలలోకెల్లా ప్రధానమైన పంచకల్యాణిగా వుండేది. అందుచేత దాని పోషణ, అలంకరణ, ప్రత్యేకించి రాజఠీవి ఉట్టిపడేటట్టు జరుపుతూ వచ్చారు.

రాజుగారి గుర్రాలలో ముఖ్యమైన ఆ పంచకల్యాణికి మూడేళ్ళనాటి ప్రశస్తమైన పాత ధాన్యాలతో ఆహారం తయారుచేసిపెట్టేవారు. దాని ఆహారం మామూలు అన్ని గుర్రాలకు మోస్తరుగా కాక, వేయి మొహిరీలు ఖరీదు చేసే ఒక బంగారు పళ్ళెంలో పెట్టేవారు. అది మసిలే శాల గుమగుమలాడుతూ పరిమళించేది. ఆ శాల చుట్టూతా ఆకర్షణీయమైన రంగురంగుల తెరలు వేలాడుతూ వుండేవి. పైన బంగారు పువ్వులు చమికీ వేసిన అందాల చాందినీ కట్టబడి వుండేది. నాలుగు గోడలకూ సువాసనలు విరజిమ్మే రకరకాల పుష్పజాతులు అమర్చబడి వుండేవి. రాత్రింబగళ్ళు ఆ శాల అగరువత్తుల ధూపంతో, సుగంధద్రవ్యాల పరిమళాలతో వెలిగిపోతూ వుండేది.

ఇటువంటి ఉత్తమమైన అశ్వం గల కాశీ రాజును చూస్తే ఇరుగు పొరుగు సామంత రాజులెవళ్ళకూ అంతగా ఇష్టం వుండేది కాదు. అసూయతో రగిలిపోయేవారు. చివరకు ఏడుగురు సామంత రాజులు ఒకటిగా చేరి, కాశీ రాజుకు ఇలా రాయబారం పంపించారు, మీ రాజ్యం మాకు అప్పగించినాసరే, లేకుంటే యుద్ధానికి తయారై వచ్చినా సరే అని.

వెంటనే కాశీ రాజు తన మంత్రులను సమావేశపరచి, సంగతి సందర్భాలు చెప్పాడు. అందుకు మంత్రులు, మహారాజా ! మీరు యుద్ధ రంగానికి స్వయంగా వెళ్ళవలసిన పని లేదు. మన సేనాని వీరవర్మను పంపిస్తే సరి. అతడే జయించుకు వస్తాడు.అటువంటి వాడే జయించలేకపోయినట్టయితే, తరవాత సంగతి అటుపైన ఆలోచిద్దాం, అని సలహా ఇచ్చారు.

అప్పుడు కాశీ రాజు సేనానిని పిలిపించి, ఓయీ, వీరవర్మా ! మన మీదికి ఇప్పుడు ఏడుగురు సామంతులు ఒక్కసారిగా ఎదురు తిరిగి రాబోతున్నారు. ఆ ఏడుగురినీ జయించటం నీ వల్ల అవుతుందా ? అని అడిగాడు.

మహా ప్రభూ ! ఏలికకు ఎంతో ప్రియమైనటువంటి పంచకల్యాణిని దయచేయిస్తిరంటే ఈ ఏడుగురు రాజులనే కాదు, దేశమంతటినీ ఒక్క దెబ్బతో జయించుకు రాగలను అని ధీమాగా పలికాడు వీరవర్మ.అందుకు రాజు సంతోషంతో, పంచకల్యాణిని తీసుకు వెళ్ళి యుద్ధం జయించుకు రమ్మని సేనానిని పంపాడు. రాజు వద్ద సెలవు తీసుకున్న సేనాని, వెంటనే పంచకల్యాణిని తీసుకొని, యుద్ధానికి బయలుదేరాడు.

వీరవర్మ మెరుపులాగా కోట నుండి ఇవతల పడ్డాడు. ధైర్య సాహసలతో పోరాడి, మొదటి సామంతుణ్ణి పట్టి, బందీగా తీసుకున్నాడు. మళ్ళీ యుద్ధరంగానికి వచ్చి, రెండవ సామంతునీ, ఆ తరవాత మూడవ సామంతునీ అలాగే వరసగా ఐదుగురు రాజులనూ బందీలుగా చేసుకొన్నాడు.

ఇంతవరకు జయించుకు వచ్చిన వీరవర్మ ఆరవ మకాముకు చేరుకుని, ఆ రాజుతో తలపడి జయించేటంతలో అతని గుర్రానికి దెబ్బ తగిలి, గాయం నుంచి నెత్తురు ప్రవహింపసాగింది.

వీరవర్మ పంచకల్యాణిని ఒక ద్వారం వద్ద కట్టివేసి, మరొక గుర్రాన్ని తీసుకొని యుద్ధానికి వెళదామని ఆలోచించాడు. ఈ ఆలోచనతో, పంచకల్యాణికి వున్న జీనూ, కళ్ళెమూ తక్కిన సామగ్రీ విప్పి వేయబోయాడు.

అప్పుడు పంచకల్యాణి రూపంలో వున్న బోధిసత్వుడు సేనాని చేస్తున్న పనిని కళ్ళు విప్పి చూశాడు. అయ్యో, వీరుడా ! ఎంత అమాయకుడవు ! నాకు దెబ్బ తగిలిందనగానే మరొక గుర్రాన్ని తయారు చేసుకుందామని అనుకుంటున్నావు. ఏడవ మకాము భేదించి, ఏడవ సామంత రాజును పట్టి ఇవ్వడం ఆ గుర్రానికేమి చేతనవుతుంది ? అలా నమ్మి, నువ్వు కొత్త గుర్రాన్ని తీసుకోవటంతో ఇంత వరకు నేను చేసిన పని అంతా వ్యర్థం అయిపోతుందే. పైగా, నువ్వు నిష్కారణంగా శత్రువు చేతులలో పడి చచ్చి పోతావే ! దాని ఫలితంగా మన యజమాని అయిన కాశీ రాజు అతి సులువుగా సామంతుల చేతులలో చిక్కుకొనిపోతాడే ! ఏడవ సామంత రాజును జయించటం ఒక్క నా వల్లనే అవుతుందిగాని మరొక గుర్రానికి అలవికాదని నీకు తెలియక పోయె కదా ! అని అనుకుని ఎంతగానో విచారించాడు.

అంతటితో ఊరుకోలేదు. దెబ్బ తగిలి అలా పడిపోయి వున్న ఆ పంచకల్యాణి వీరవర్మను దగ్గరకు పిలిచి, మానవ స్వరంలో ఇలా చెప్పింది. ఓయీ, శూరుడా ! వీరవర్మా ! ఏడవ మకాము భేదించి ఏడవ శత్రురాజును పట్టగల గురమ్రు నేను తప్ప మరొకటి లేదని తెలుసుకో. ఇంత వరకూ నేను చేసిన పని వ్యర్థం కానీయకు.

ఎటువంటి పరిస్థితులలోనైనా ధైర్యం, సాహసం ఉండాలి. ఇందుకు తోడు ఆత్మవిశ్వాసం, గుండెనిబ్బరమూ అవసరమై వుంది. కనుక, నా మీద పూర్తి నమ్మకం కలిగి వుండు. దెబ్బ తగిలినంత మాత్రాన నన్ను విడిచి పుచ్చకు. గాయం తగిలిన నా కాలుకు వెంటనే కట్టుకట్టి బాగు చెయ్యి. మళ్ళీ నన్ను పూన్చి, త్వరగా యుద్ధరంగానికి బయలుదేరు ,అని అనేక విధాల బోధచేసింది.

తక్షణమే వీరవర్మ తన పంచకల్యాణికి కట్టు కట్టి మళ్ళీ తయారు చేశాడు. దాని పైన ఎక్కి బయల్దేరేసరికి, అది మెరుపు లాగా మెరిసి, శరవేగంతో దూసుకు వెళ్ళి, చూస్తూ వుండగా ఏడవ మకాం భేదించింది. వీరవర్మ ఏడవ సామంతుని కూడా బందీగా పట్టి వేశాడు. వీరవర్మకే యుద్ధంలో విజయం కలిగింది.

బందీలుగా పట్టుబడిన ఏడుగురు సామంతులనూ, సైనికులు కాశీ రాజు ఎదుటపెట్టారు. పంచకల్యాణి రూపంలో వున్న బోధిసత్వుడూ అక్కడికి వచ్చాడు. వచ్చి, రాజుతో ‘ప్రభూ ! ఈ ఏడుగురూ నీకు సాటి రాజులు. వారిని హింసించటం తగదు. వారిని కించపరచటం కూడా న్యాయం కాదు. నీకు తోచిన ఒక షరతు పెట్టి, వారిని ఆ షరతుకు లోబరచి వదిలేయటమే సమంజసం. రాజా ! ఉదారత కలిగి వుండు. ధర్మబుద్ధితో న్యాయంగా రాజ్యం యేలుకో, అని బోధించగా, భటులు వచ్చి గుర్రం వంటి పైన వున్న అలంకారాలన్నీ తీసివేశారు.

తీస్తూ వుండగానే పంచకల్యాణి రూపంలో వున్న బోధిసత్వుడు పంచత్వం పొందాడు. తరవాత కాశీ రాజు ఆజ్ఞ ప్రకారం సమస్తమైన మర్యాదలతోనూ గుర్రానికి ఉత్తర క్రియలు జరిగినై. వీరవర్మకు గొప్ప గౌరవం జరిగింది. ఏడుగురు సామంతులనూ వారి వారి రాజ్యాలకు పంపివేశారు. నాటినుండీ కాశీ రాజ్యంలో బోధిసత్వుని ఇష్ట ప్రకారం న్యాయ సమ్మతంగా, ధర్మయుతంగా పరిపాలన సాగుతూ వచ్చింది.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం