తాజా కథలు @ CCK

బుద్ధి వక్రమార్గాన్ని పట్టినప్పుడు మంచి వస్తువుల వల్ల కూడా కీడే కలుగుతుంది

2015-06-17 05:05:01 చిన్నారుల కథలు
బహ్మదత్తుడు కాశీ నగరాన్ని పరిపాలించే కాలంలో ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను "వేదభం"అనే మహామంత్రంలో సిద్ధి పొందాడు. గ్రహాలన్నీ కూటమయ్యే సమయంలో, ఆకాశం వంక చూస్తూ ఆ మంత్రాన్ని పునశ్చరణ చేసినట్టయితే, సరాసరి ఆకాశం నుంచి బంగారు, వెండి, ముత్యం, పగడం, రత్నం, కెంపు, నీలం....ఈ ఏడు వస్తువులూ వర్షిస్తాయి. మంత్రసిద్ధి గల ఆ బ్రాహ్మణ్ణి ఆశ్రయించి బోధిసత్వుడు, ఆయనకు ప్రియశిష్యుడయ్యాడు.
ఒక రోజున శిష్యుణ్ణి వెంటబెట్టుకుని గురువు అరణ్య ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ అరణ్యంలో ఐదు వందల మంది గజదొంగలున్నారు. వాళ్ళు గురు, శిష్యులిద్దరినీ అటకాయించారు. ఐతే ! ఆ దొంగలలో చిత్రమైన నియమం ఒకటి వున్నది. ఇద్దరు బాటసారులు కలిసి ఆ త్రోవన వచ్చినట్టయితే ఇంటికి పోయి శిక్షారుసుము తెచ్చి తోటివాడిని విడిపించుకోవటానికి అవకాశమిచ్చి, అందులో ఒకడిని వదిలేస్తారు.

ఆ వచ్చిన బాటసారులు తండ్రీ, కొడుకులైతే తండ్రిని పోయిరమ్మని చెప్పి, రుసుము తెచ్చి కొడుకును విడిపించుకునేటందుకు అవకాశమిస్తారు. అలానే ! తల్లీకూతురూ ఐతే తల్లినీ, సోదరులైతే అందులో ఒకణ్ణీ, గురు శిష్యులైతే శిష్యుణ్ణీ , ఇలా... వదిలిపెట్టడం వాళ్ళకు మామూలు. ఇప్పుడా వింత దొంగలు బ్రాహ్మణ్ణి తమ వద్ద అట్టేపెట్టుకుని, శిష్యుడైన బోధిసత్వుణ్ణి పోయిరమ్మని పంపించారు. వెళ్ళేటప్పుడు బోధిసత్వుడు గురువుకు నమస్కరించాడు. గురువర్యా ! భయపడకండి. ఒకటి రెండు రోజులలో తప్పక తిరిగి వచ్చేస్తాను.

ఐతే ! నా మనవి మటుకు ఒక్కటి వినండి. ఇవాళ గ్రహాలన్నీ కూటమయ్యే రోజు. కొంపతీసి ఇవాళ మాత్రం మంత్రం జపించి రత్నాల వర్షం రప్పించకండి. అలా చేశారంటే మీకూ, ఈ దొంగలకూ కూడా తీరని ముప్పు కలిగి తీరుతుంది, అని మరిమరి చెబుతూ, బోధిసత్వుడు బయలుదేరి వెళ్ళాడు. సూర్యాస్తమయం అయింది. దొంగలు వచ్చి బ్రాహ్మణ్ణి పట్టుకున్నారు. పుచ్చ పువ్వులాoటి వెన్నెల కిరణాలను వెదజల్లుతూ పున్నమిచంద్రుడు ఆకాశాన తిరుగుతున్నాడు.

బ్రాహ్మడు పైకి చూసి, గ్రహాలు కూటమయ్యే సమయం వస్తుందని పసికట్టాడు. దొంగల బారిని పడి, చేతకాని వాడిలాగా ఈ హింసలన్నీ ఎందుకు నేననుభవించాలి ? చేతిలో వున్న మంత్రాన్ని పఠించి, కనక వర్షం రప్పించి, దొంగల రుసుము వాళ్ళకిచ్చేసి, విడుదలవుతాను. స్వేచ్ఛ పొంది సుఖంగా వుంటాను  అనుకున్నాడు. తరవాత బ్రాహ్మడు ఆ దొంగల గుంపును చేరబిలిచాడు. మీరు నన్నెందుకు బంధించారు చెప్పండి అన్నాడు.

అయ్యా ! ఇంకెందుకు? డబ్బు కోసం ! అన్నారు వాళ్ళు. అంతే కదా ! అలా ఐతే నేను చెప్పినట్టు చేయండి, మీరు కోరిన ధనం ఇస్తాను. ముందు నా కట్లు విప్పెయ్యండి. నాకు శుభ్రంగా స్నానం చేయించండి. నూతన వస్త్రాలు కట్టబెట్టండి. పుష్ప జాతులన్నీ తెచ్చి ఇక్కడ పోగుపోయండి. నా చుట్టూ పరిమళద్రవ్యాలూ, ధూపదీపాదులకు కావలసిన సామగ్రులూ అమర్చిపెట్టండి. అటుపైన ఏం జరుగుతుందో చూడండి ! అని బ్రాహ్మడు చెప్పాడు. అక్షరాలా ఆ బ్రాహ్మడు చెప్పిన ప్రకారమే చేశారు దొంగలు.

తరవాత ఆయన అదును చూసి, ఆకాశం వంక దృష్టి నిలిపి " వేదభ " మంత్రం ఉచ్చరించాడు. వెంటనే విలువ గల లోహాలూ, మణులూ వర్షించినై. దొంగలు గబగబా వాటన్నిటినీ ఏరి మూటలు కట్టుకొని వాళ్ళ దారిని వాళ్ళు పోయారు. వాళ్ళ వెనకనే బ్రాహ్మడూ వెళుతున్నాడు. ఆ సమయంలో మధ్య దారిలో మరి ఒక దొంగల గుంపు తారసపడి, మొదటి గుంపును ఎదుర్కొన్నది.

ఎందుకయ్యా ! మీరు మమ్మల్ని పట్టుకుంటారు? అని అడిగారు మొదటి దొంగలు. అందుకు రెండవ గుంపు, ఇంకెందుకు, డబ్బు కోసం అన్నారు. అంతే కదా ! డబ్బు కోసమే. ఐతే ! ఈ బ్రాహ్మణ్ణి ఆశ్రయించండి. ఈయన ఆకాశం పైకి చూస్తే చాలు, విలువ గల రత్నాలూ, మణులూ వర్షిస్తాయి. అలా చేసే మాకు ఈ ధనమంతా ఇచ్చాడు, అని చెప్పి వాళ్ళు తప్పించుకుపోయారు. ఇప్పుడు రెండవ దొంగల జట్టు బ్రాహ్మణ్ణి వదలక పట్టుకుంది.

మాకు కూడా ధనమియ్యవయ్యా, బ్రాహ్మడా ! అని వాళ్ళు  పీడించసాగారు. అందుకు బ్రాహ్మడు, అయ్యలారా ! ఇందాక ఆ దొంగలకు నేనిచ్చింది మంత్రమహిమ వల్ల రప్పించిన ధనం. నేను నేర్చిన మంత్రానికి మళ్ళీ ఒక యేడాదికి గాని శక్తి కలగదు. ఇది నా ఇష్టం వచ్చినప్పుడల్లా జపించితే పని చేసే మంత్రం కాదు. దీనికంతా గ్రహకూటం కలియడం అదీ, చాలా గొడవ వున్నది. దాని వల్ల ఇప్పటికి ప్రయోజనం కలగదు కనుక, ఒక్క ఏడాది అయ్యే సరికి, గ్రహాలు కూటమవుతై. అప్పుడు నా మంత్రం జపించి, మీకు కనక వర్షం కురిపిస్తాను అన్నాడు.

బ్రాహ్మడి మాటలు నమ్మలేదు దొంగలు. మాకంటే ముందు వచ్చిన వాళ్ళను ఇట్టే కుబేరులను చేసి పంపావే, మేం అడిగితే ఏడాది వరకూ కనిపెట్టుకు ఉండమంటావా ? అబద్ధాలకోరా ! అంటూ పదునైన కత్తి పుచ్చుకుని బ్రాహ్మణ్ణి నిలువునా రెండు ముక్కలుగా చీల్చి వేశారు.అతని కళేబరాన్ని దారి మధ్యలో వేలాడదీశారు. ఆ తరవాత గబగబా పరుగులెత్తిపోయి మొదటి దొంగల జట్టును కలిసి, అందరినీ చంపి, వాళ్ళ దగ్గర వుండే ధన ద్రవ్యాలను అపహరించారు.

అపహరించిన ధనం వాటాలు తెగలేదు. ఈ రెండవ జట్టు దొంగలలో రెండు కక్షలు ఏర్పడినై. ధనం కోసం రెండు కక్షల వాళ్ళూ పోరాడుకున్నారు. పోరాటంలో మొత్తం ఒక వంద మంది నరుక్కుచావగా చివరకు ఇద్దరే ఇద్దరు మిగిలారు. ఇలా మిగిలిన దొంగలిద్దరూ ధనాన్నంతటినీ సమీపంలోని ఒక అరణ్యంలో దాచిపెట్టారు. అందులో ఒకడు విచ్చుకత్తులతో ఆ ధనానికి కాపలా కాస్తూ వుండగా, రెండవ వాడు తినుబండారాలు తేవటానికని దాపున వున్న ఊళ్ళోకి వెళ్ళాడు.

ధనాగారం వద్ద కూర్చున్న దొంగ, నా నేస్తం వస్తే , అయాచితంగా ఈ ధనంలో సగభాగం కబళించుకుపోతాడే, ఎలా ? అనే ఆలోచనతో కుమిలిపోసాగాడు. అక్కడ తినుబండారాలు తీసుకు రావటానికి వెళ్ళిన ఆ దొంగ, వాడు చస్తే ఆ ధనమంతా నాకే ఉండిపోతుందిగా ! కుబేరుడినయిపోవచ్చు . కదా ! అని అనుకొని, తనవంతు పదార్థాలు కేటాయించుకుని, తక్కిన భాగంలో విషం కలిపివేశాడు.
వాడు పదార్థాలు చేతపట్టుకొని తన బస చేరుకునేసరికల్లా ఆ రెండవ దొంగ వీడి పీక తెగవేసి, కళేబరం దూరంగా విసిరి వేశాడు. తరవాత విషం కలిసిన తినుబండారాలు తిని, చివరకు వాడూ ప్రాణాలు విడిచాడు. ఈ విధంగా బ్రాహ్మడూ, బ్రాహ్మడితో పాటు దొంగలూ అంతా, కలిసి మొత్తంగా చచ్చివూరుకున్నారు. ఒకటి రెండు రోజులలో బోధిసత్వుడు దొంగలకీయవలసిన రుసుము చేత పట్టుకు వచ్చాడు.

గురువు కోసం చూశాడు. గురువు కానరాలేదు. ఎక్కడ చూసినా ధనమే. ఎక్కడ చూసినా కళేబరాలే . అప్పుడిలా అనుకున్నాడు బోధిసత్వుడు, ఈ బ్రాహ్మడు నా మాట చెవిని పెట్టలేదు. తనకు తోచినంతా చేశాడు. మొన్నటి రోజున ఈ బ్రాహ్మడు మంత్రం జపించి, రత్నాల వర్షం రప్పించే వుంటాడు. దాని ఫలితంగానే అందరూ చచ్చివుంటారు, అని తలిచి, బాట వెంబడే చూసుకుంటూ పోసాగాడు.
కొంత దూరంలో గురువు గారి కళేబరం కనిపించింది. అయ్యో ! గురువర్యా ! నా మాట విన్నావు కాదుకద ! ఎంతటి దుర్గతి పాలయ్యూవు అంటూ... అతను వాపోయూడు. చితుకులు పోగు చేసి తెచ్చి గురువుకు దహనాది క్రియలు సలిపాడు. అడవి పువ్వులు పట్టుకు వచ్చి ఆ స్థలమందు వుంచి, భక్తి పూర్వకంగా తుదిసారి నమస్కరించాడు.

అక్కడి నుంచి ఇంకా అలా అలా... వెళ్ళగా మొదటి దొంగల జట్టులోని కొందరి శవాలూ కంటపడినై. మరి కొంత దూరంలో రెండవ జట్టులో వుండే దొంగల కళేబరాలు పడివున్నయి. రెండు తప్ప, బోధిసత్వుడికి తను చూసి వున్న అందరి కళేబరాలూ లెక్కకు సరీగా కనిపించినై.

ఐతే ! ఆ ఇద్దరూ ఎక్కడికి తప్పించుకుపోయారా ? అని ఆలోచించాడు. వాళ్ళు ధనం దోచుకుపోయిన జాడ కనిపెట్టి, ఆ దారినే వెళ్ళగా ఆ దారి బోధిసత్వుణ్ణి ఒక కీకారణ్యంలోకి తీసుకుపోయింది. ఆ అరణ్యంలో ధనం మూటలు కనిపించినై. తప్పిపోయారనుకొన్న ఇద్దరు దొంగలలోనూ ఒకడి కళేబరం కనిపించింది. ఐతే ! వాడి పక్కన తినుబండారాలు గల పాత్ర వున్నది. ఓహో ! ఇదా సంగతి ! అని అనుకొన్నాడు బోధిసత్వుడు.

ఇంకా, నాలుగడుగులు వేసేసరికి ఒక మూల ఆ మిగిలి వున్న దొంగ కళేబరం వేలాడదీయబడి వున్నది. ఇంకిప్పుడు ఎవరూ చెప్పనక్కరలేకుండానే జరిగిన సంగతి అంతా బోధిసత్వుడికి మొదటి నుంచి చివరి వరకూ అవగాహనైపోయింది. ఇదంతా, చూసి బోధిసత్వుడు చాలా విచారించాడు. నా మాట పాటించాడు కాదు గురువు గారు. అంతగా చెప్పిపోయినా, పెడచెవిని పెట్టాడు. ఆత్మబుద్ధి సుఖమనుకున్నాడు.

ఇందుకు ఫలితం ? తనూ నాశనమయ్యాడు, తనతో పాటు చాలా మంది జనమూ చావటానికి కారకుడయ్యాడు. వివేకవంతుల మాట వినక, తమకు తోచిందే మంచిదని అనుకొని పనులు చేసే వాళ్ళకు ఇటువంటి శాస్తి జరిగే తీరుతుంది. నా గురువు గారు తన మంత్ర మహిమ వల్ల భూలోకానికి రప్పించిన ధన సంపద మానవకోటికి ఉపకృతి చేయలేదు సరికదా ! పైగా సంఘాత మరణానికీ, అంతులేని వినాశానికీ దారి తీసింది.

కనుక, బుద్ధి వక్రమార్గాన్ని పట్టినప్పుడు మంచి వస్తువుల వల్ల కూడా కీడే కలుగుతుంది. దోషం వస్తువులో లేదు, బుద్ధిలో వుంది. వక్రబుద్ధి అగ్నిజ్వాల వంటిది. అది ఒకళ్ళ నాశనంతో పోదు. మరి ఎంత మందినో నాశనం చేస్తేగాని ఆ అగ్ని చల్లారదు. ఈ బోధలను బోధిసత్వుడు అరణ్యమంతా మారుమోగేటట్టు ప్రబోధించాడు.

తన గురువు గారిని ఉదాహరణగా చూపి, అందరకూ వినచ్చేటట్టు చెప్పాడు. బోధిసత్వుడి ప్రబోధానికి వన దేవతలు జేజేలు కొట్టారు. అటు తరువాత ఆ ధన సంపదనంతటినీ బోధిసత్వుడు తన ఆశ్రమానికి తీసుకుపోయి, అదంతా లోకోపకారం కోసం వినియోగించి, అవతారం చాలించాడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం