తాజా కథలు @ CCK

మూర్ఖుడు తన అవివేకాన్ని, తనకుతానై పది మంది ఎదటా చాటుకుంటాడు

2015-04-07 13:05:01 చిన్నారుల కథలు
ఒకప్పుడు మగధరాజు విరూపసేనుడి కాలంలో, బోధిసత్వుడు ఒక ఏనుగు రూపం తాల్చాడు. ఆ ఏనుగు తెల్లని శరీరఛాయతో ఐరావతాన్ని పోలి వున్నది. అందుచేత మగధ రాజు ఆ ఏనుగును తన పట్టపుటేనుగుగా చేసుకున్నాడు. ఒక పర్వదినంనాడు మగధరాజ్యమంతా దేవలోకాన్ని మించి అలంకరించబడింది. నగరమంతటా అతి వైభవమైన ఊరేగింపు జరపటానికి ఏర్పాట్లు చేశారు.
పట్టపుటేనుగును చక్కగా అలంకరించారు. సైనికులు ముందూ, వెనకా నడుస్తూండగా రాజు ఆసీనుడైవున్న ఏనుగు అంబారీ ఊరేగింపు బయలుదేరింది. దారి పొడుగునా జనం ఉత్సాహంతో ‘‘ఆహా ! ఏమి ఈ గజరాజు గమనం. దీని అందచందాలు చూస్తూంటే, ఏ సార్వభౌముడికో వాహనంగా వుండతగిందిలా కనబడుతున్నది '' అంటూ ఏనుగును మెచ్చుకోసాగారు. ఈ పొగడ్తలకు రాజు కోపం తెచ్చుకుని, మనసులో జనం, రాజైన నాకు చూప వలసిన గౌరవం, ఈ ఏనుక్కు చూపుతున్నారన్నమాట.

ఒక్కడూ అంబారీలో వున్న నాకేసి కన్నెత్తి చూడడం లేదు. దీన్ని ఏదోవిధంగా పరలోకయాత్ర కట్టించాలి '' అనుకున్నాడు. రాజు మరసటి రోజున మావటివాణ్ణి పిలిపించి ‘‘ఒరే ! పట్టపుటేనుగు మంచి శిక్షణ గలదేనా ?'' అని అడిగాడు. దానికి శిక్షణ ఇచ్చి, అంబారీ ఏనుగుగా తయారు చేసింది నేనే, ప్రభూ !'' అన్నాడు మావటివాడు.

ఏమో ! నీ మాటల్లో నాకు నమ్మకం కలగడం లేదు. ఒట్టి పొగరుబోతు ఏనుగని, నా అనుమానం అన్నాడు రాజు. అలాంటిదేం లేదు, ప్రభూ ! అన్నాడు మావటివాడు. సరే ! నువ్వు చెపుతున్నట్టు, అంత గొప్ప శిక్షణలో పెరిగిన ఏనుగైతే, నువ్వు దాన్ని ఆ కనబడే పర్వత శిఖరానికి ఎక్కించగలవా ? అని అడిగాడు రాజు.

ఎక్కించగలను, మహాప్రభూ ! అని మావటివాడు, పట్టపుటేనుగును క్షణాల మీద పర్వత శిఖరానికి ఎక్కించాడు. రాజు కొంత పరివారాన్ని వెంటబెట్టుకుని, ఏనుగు వెనగ్గా కొండ ఎక్కాడు. శిఖరం ఒక చోట బల్లపరుపుగా కొంత దూరం పోయి, కోసుగా కొనతేరి వున్నది. రాజు ఏనుగును అక్కడ ఆపమని మావటికి చెప్పాడు. నువ్వు, దానికిచ్చిన శిక్షణ ఏపాటిదో చూస్తాను.

ఏనుగును మూడు కాళ్ళపైన నిలబెట్టగలవా ? అన్నాడు రాజు. వెంటనే మావటివాడు ఏనుగు తలను అంకుశంతో తాకి సైగ చేసి, బాబా ! ప్రభువులవారి ఆజ్ఞ అయింది. మూడు కాళ్ళ మీద నిలబడు ! అన్నాడు. ఏనుగు అలాగే చేసింది. రాజు, ఆహా !బావుంది. అని, ఈసారి ముందరి రెండు కాళ్ళ మీదా నిలబడగలదేమో చూడు అన్నాడు. మావటివాడు సైగ చేయగానే ఏనుగు ముందు కాళ్ళ మీద నిలబడింది.

ఇదీ, బాగానే వున్నది. ఇప్పుడు వెనక కాళ్ళ మీద నిలబడగలదేమో ఆజ్ఞాపించి చూడు అన్నాడు రాజు, ఏనుగు కేసి కోపంగా చూస్తూ. వెంటనే ఏనుగు వెనక కాళ్ళ మీద నిబడింది. ఒంటికాలి మీద నిలుచోగలదా ? అన్నాడు రాజు. ఏనుగు సునాయాసంగా ఒంటికాలి మీద నిలబడింది.

ఇన్ని తిప్పలు పెట్టినా ఏనుగు పర్వత శిఖరం మీది నుంచి కిందికి పడక పోయేసరికి, రాజు మనసులో కుళ్ళిపోతూ, మావటితో, ఇలాంటి పనులు ఏ కొద్దిపాటి శిక్షణ గల ఏనుగైనా చేయగలదు. ఇంకొక్క పరీక్ష పెట్టదలిచాను  అన్నాడు. ‘‘అలాగే, ఆ పరీక్ష ఏమిటి, ప్రభూ?'' అని అడిగాడు మావటి. ‘‘ఏనుగు కాళ్ళ ఆధారంతో కొండ మీద నడిచినట్టే, గాలిలో కూడా నడిచేలా చెయ్యి. ఇది, నా ఆజ్ఞ !'' అన్నాడు రాజు.

ఆఖరికి రాజు దురుద్దేశం మావటివాడికి అర్థమైంది. కాని ! అతడు ఏమాత్రం బెంబేలు పడిపోకుండా ఏనుగు చెవిలో రహస్యంగా ఇలా అన్నాడు: ‘‘బాబా ! నువ్వు, ఈ కొండ శిఖరం నుంచి కింద పడి మరణించాలని రాజు పథకం వేశాడు. అతడు నీ విలువ తెలియనివాడు.

నీకు నిజంగా శక్తే వున్నట్టయితే, ఈ శిఖరం కొన నుంచి ముందుకుపోయి, గాలిలో నడువు '' అన్నాడు. గొప్ప మహిమా, అద్భుత శక్తులూ గల ఆ ఏనుగు శిఖరం నుంచి ముందుకు పోయి, అలా గాలిలో తేలియాడుతూ వెళ్ళసాగింది. అప్పుడు మావటివాడు రాజుతో, ఓ, రాజా ! ఈ ఏనుగు సామన్యమైంది కాదు, మహత్తరమైన దైవాంశ గలది. విలువ తెలియని, నీ వంటి వాడికి పట్టపుటేనుగుగా వుండదగింది కాదు.

మూర్ఖులు ఇటువంటి ఏనుగులనే కాదు, అమూల్యమైన మరి దేనినైనా పోగొట్టు కుంటారు. మూర్ఖుడు తన అవివేకాన్ని, తనకుతానై పది మంది ఎదటా చాటుకుంటాడు అన్నాడు. ఏనుగు గాలిలో నడుస్తూపోయి, కాశీ రాజ్యం చేరి, అక్కడి రాజుగారి ఉద్యానవనం మీద ఆకాశంలో నిలిచింది. ఇది చూసిన నగర పౌరులు కోలాహలంగా అక్కడికి చేరారు.

ఈ వార్త రాజు గారికి చేరింది. కాశీ రాజు ఉద్యానవనానికి వచ్చి, ఏనుగు కేసి చేతులు జోడించి, ‘‘గజ రాజా ! నీ రాకతో నా రాజ్యం పవిత్రమైంది. కిందికి దిగిరా ప్రార్థిస్తున్నాను '' అన్నాడు. రాజు ఇలా అనగానే ఏనుగు రూపంలో వున్న బోధిసత్వుడు పైనుంచి, ఉద్యానంలోకి దిగాడు. రాజు ప్రశ్నించిన మీదట మావటివాడు జరిగినదంతా చెప్పాడు. అది విన్న కాశీ రాజుకూ, అక్కడ చేరిన ప్రజలకూ చాలా ఆనందం కలిగింది.

రాజు, ఏనుగును చక్కగా అలంకరింప చేసి, ఒక దివ్య సుందరమైన ప్రత్యేక శాలలో దానికి నివాసం ఏర్పరిచాడు. ఆ తర్వాత తన రాజ్యాన్ని మూడు భాగాలుగా చేసి, ఒక భాగం ఏనుగు రూపంలో వున్న బోధిసత్వుడి పోషణ కోసం, రెండవ భాగం మావటికీ ఇచ్చి వేసి, మిగిలిన దాన్ని తన సొంతానికి వుంచుకున్నాడు. బోధిసత్వుడు కాశీ రాజ్యం చేరినది మొదలుగా కాశీ రాజు ఐశ్వర్యమూ, సంపదా దినదినాభివృద్ధి కాజొచ్చింది. ఆయన పేరు ప్రఖ్యాతులు దశదిశలా వ్యాపించినై.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం