తాజా కథలు @ CCK

సౌర తుఫాను అంటే ఏమిటి ?

2015-05-22 23:05:01 ఖగోళ జ్ఞానం

solar


సూర్యుడు నిరంతరం జ్వలిస్తూ వుండే అగ్నిగోళం. అయితే ఆ మంటలు ఎప్పుడూ వుండేవే అయినా, కొన్ని సార్లు నిద్రాణంగా వుంటే కొన్నిసార్లు మరీ ఉధృతంగా కెరటాలను తలపిస్తూ ఎగసిపడ్తాయి. సూర్యుడు తక్కువ చైతన్యంతో కొంత నిద్రాణంగా కనిపించే దశను ''సోలార్‌ మినిమమ్‌''అని, మహోజ్జ్వలంగా మండే దశను ''సోలార్‌ మాగ్జిమమ్‌''అని పిలుస్తారు. కాలప్రవాహంలో ఈ రెండు దశలు ఒకదాని తర్వాత ఒకటి చొప్పున వచ్చివెళ్తాయి. సూర్యుడిలో కనిపించే ఈ మార్పును ఏళ్ళ తరబడి ఖగోళ శాస్త్రజ్ఞులు పరిశీలిస్తున్నారు, అధ్యయనం చేస్తున్నారు. శాటిలైట్లు పంపే చిత్రాలద్వారా మరింత లోతుగా, నిశితంగా గమనిస్తున్నారు.


సామాన్యంగా పదకొండేళ్ళకు ఒకసారి దశ మారుతుందని సైంటిస్టులు గమనించారు. కానీ, ఈసారి సూర్యుడు సోలార్‌ మినిమమ్‌ దశ దాటి 16 నెలలు దాటినా సోలార్‌ మాగ్జిమమ్‌ దశలోనే వుండిపోయాడు. ఎందుకిలా జరిగిందని ఖగోళ శాస్త్రజ్ఞులు అధ్యయనం చేస్తున్నారు. ''సూర్యుడు ఎన్నాళ్ళిలా నిద్రావస్తలో వుంటా డు, దీని పరిణామం ఎలా వుంటుందని ఆందోళనగా వుంది'' అంటూ వ్యాఖ్యానించారు హార్వర్డ్‌ స్మిత్సోనియన్‌ ఆస్ట్రోఫిజిక్స్‌ సెంటర్‌ పరిశోధకుడు లియోన్‌ గ్లౌబ్‌. సోలార్‌ పవర్‌ ఎంత ముఖ్యమో, ఎంత అత్యవసరమో తెలిసిన సైంటిస్టులు ఆందోళన చెందడంలో అర్థముంది. క్రూడ్‌ ఆయిల్‌ నుండి వచ్చే పెట్రోలు, గ్యాసు తదితరాలు పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి గనుక శాస్త్రవేత్తలు సోలార్‌ ఎనర్జీమీద ఎంతో కృషి చేస్తున్నారు. కంప్యూటర్లు, క్యాలిక్యులేటర్లే కాదు ఆఖరికి సౌరశక్తితో పనిచేసే విమానాన్ని కూడా కనిపెట్టి సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలో మంటల ఉధృతి తగ్గడం శాస్త్రవేత్తలను కల్లోలపరిచింది.


ఇదిలా వుండగా సౌర సునామీ ఒక దుమారంలా బయల్దేరి శాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇంతకీ సౌర సునామీ అంటే ఏమిటో చూద్దాం. ఇది సూర్యుడిపై ఏర్పడే విద్యుత్‌ తరంగం. ఈ అలలు చుట్టుకుని మబ్బులా ఏర్పడి సూర్యుడి ఉపరితలాన్ని విచ్ఛేదనం చేయడం, సన్నటి పదార్థాలను ఊడ్చేయడం చేస్తాయి. సూర్యునిలో ఏర్పడే అసాధారణమైన అయస్కాంత విస్ఫోటనం ఇది. సూర్యమండలపు ఉపరితలం నుండి వచ్చే అయస్కాంత కెరటాలు భూమిని తాకడం చాలా అరుదు. ఈ ఖగోళ పరిణామంపైవిస్తృత పరిశోధనలు జరగాల్సివుంది. ఈ సునామీ కారణంగా సూర్యుడినుండి విద్యుత్‌ అయస్కాంత కణాలతో కూడిన విపరీతమైన ఆకర్షణ శక్తి ఉన్న అయస్కాంత సెగల మబ్బు అంతరిక్షంలో కొన్ని కోట్ల మైళ్ళ దూరం ప్రయాణించి భూమికి చేరువౌతోందని న్యూ సైంటిస్ట్‌ రాసింది. దీనికి ''ఫాస్ట్‌ మోడ్‌ మాగ్నెటో హైడ్రోడైనమికల్‌ వేవ్‌'' అనేది సాంకేతిక నామం. సంక్షిప్తంగా ఎం.హెచ్‌.డి. వేవ్‌ అంటారు. దీన్ని ''మొరెటన్‌ వేవ్‌'' అని కూడా పిలుస్తారు.


సూర్యమండలం మధ్యభాగంలో వృత్తా కారంలో భూమి కంటే ఎత్తుగా విద్యుదావేశ అలలు బయల్దేరి వేగంగా లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణం సాగించాయి. గంటకు పది లక్షల మైళ్ళ వేగంతో దూసుకొస్తున్న సౌర సునామీకి దారితీసిన సౌర విస్ఫోటన పరిణామాన్ని నాసా లోని సోలార్‌ డైనమిక్స్‌ అబ్జర్వేటరీ, ఇంకా ఇతర ఉపగ్రహాలు నిశితంగా పరిశీలించాయి. భూమిచుట్టూ తిరిగే ఉప గ్రహాలపై, భూమిపైనున్న విద్యుత్‌లైన్లు, గ్యాస్‌ పైపులపై దాని ప్రభావం వుంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరించినప్పటికీ అలాంటివేమీ చోటుచేసుకోలేదు.


భూమితో పోలిస్తే సూర్యమండలం చాలా పెద్దది. అది మొత్తంగా మండే గోళమే అయినప్పటికీ, అక్కడక్కడా ఉధృతమైన మంటలు లేస్తుంటాయి. వీటిని ''సన్‌ స్పాట్‌'' అని పిలుస్తారు. ఇవే మనకు మచ్చల్లా కనిపిస్తాయి. ఈ సన్‌ స్పాట్‌లు స్థిరంగా వుండవు. మంటలు ఎగసిపడ్తూ, సమసిపోతూ వుంటాయి. ఇప్పుడు తాజాగా, భూమికి ఎదురుగా ఒక సన్‌ స్పాట్‌ ఏర్పడింది. దీనికి 'సన్‌ స్పాట్‌ 1092' అని సైంటిస్టులు నామకరణం చేశారు. ఇప్పుడు ఈ సన్‌ స్పాట్‌ నుండి విద్యుదావేశిత కణాలు మేఘంలా ఏర్పడి భూమ్మీదకు బయల్దేరాయి.


1997 మే నెలలో సోలార్‌ అండ్‌ హెలియో స్పెరిక్‌ అబ్జర్వేటరీ (ఎస్‌.ఓ.హెచ్‌.ఓ.) తొలిసారిగా ఈ సోలార్‌ సునామీని కనుగొంది. అదే సంవత్సరం కొరోనల్‌ మాస్‌ ఇజెక్షన్‌ (సి.ఎం.ఇ.) సూర్యుడి ఉపరితలంపై పేలడం మొదలెట్టాయి. ఆ పేలిన ప్రదేశంనుండి తరంగాల మేఘం బయల్దేరినట్లు ఎస్‌.ఓ.హెచ్‌.ఓ. నమోదు చేసింది కానీ, నిశితంగా పరిశీలించడానికి దాని శక్తి సరిపోలేదు. ఇక ఈ విషయమై శాస్త్రవేత్తల్లో అనేక ప్రశ్నలు, సందేహాలు తలె త్తాయి. నాసా సోలార్‌ టెర్రెస్ట్రియల్‌ రిలేషన్స్‌ అబ్జర్వేటరీ (ఎస్‌.టి.ఇ.ఆర్‌.ఇ.ఓ) వెలసి శోధన మొదలుపెట్టింది.


ఈ శక్తివంతమైన సోలార్‌ సునామీలను నిజానికి ఎన్నో ఏళ్ళ క్రితమే గమనించారు. కాకపోతే వాటిని కంటితో చూడలేకపోవడాని స్థిరమైన అభిప్రాయానికి రాలేకపోయారు. ఇప్పుడు మాత్రం శాస్త్రవేత్తలు వాటిని నిర్ధారించారు. తొలిసారి సైంటిస్టులు ఇవి సూర్యమండలంపైనుండి వస్తున్నాయని నమ్మలేకపోయారు. వాటిల్లో కొన్ని భూమి కంటే ఎత్తుగా, వృత్తాకారంలో లక్షల మైళ్ళకు విస్తరించి, భయంకరమైన డ్రాకులా ఆకారాలను పోలి వున్నాయి. తొలుత ఇవి నీడలేమోనని కూడా భావించారు. కానీ, ఇప్పుడు అవి నీడలు కావని తేల్చిన నాసా, తాజాగా సోలార్‌ సునామీ వీడియోను విడుదల చేసింది.


సూర్యుడిపై సంభవించే పేలుళ్ళను సన్‌ స్పాట్‌లు అంటారు. ఇవి స్థిరంగా వుండవు. ఎక్కువతక్కువలుంటాయి. ఈమధ్యకాలంలో ఈ పేలుళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయి. రాబోయే మూడేళ్ళలో మరింత పెరిగి 2013 నాటికి గరిష్ట స్థాయికి చేరొచ్చని అంచనా. ఈ పేలుళ్ళవల్ల విద్యుత్‌ ప్రవహించే కణాలు లక్షల కిలోమీటర్ల దూరం వరకు ఎగజిమ్ముతాయి. ఆ విపరీతమైన వేడిమికి అయాన్లు భూమ్యాకర్షణశక్తివల్ల ఇటువైపు ప్రయాణిస్తాయి. నిజానికి ఫిబ్రవరి నెలలోనే సన్‌ స్పాట్‌ 11012 ఏర్పడినప్పుడు, ఎస్‌.టి.ఈ.ఆర్‌.ఈ.ఓ. స్పేస్‌ క్రాఫ్ట్‌ చిత్రాలతో సహా ఈ సౌర సునామీని నిర్ధారించింది. ఆ విస్ఫోటనంతో కోట్ల టన్నుల గ్యాస్‌ విడుదలైంది. అది సౌర సునామీగా బయల్దేరింది. ఈ కెరటాలు 90 డిగ్రీల దగ్గర రెండు ఆకృతుల్లోకి విడిపోయినట్టు కూడా రికార్డయింది. వర్జీనియాలోని జార్జ్‌ మాసన్‌ యూనివర్సిటీకి చెందిన స్పిరస్‌ పాట్సోరాకోస్‌ ''ఇది నీటి మేఘం కాదు, విద్యత్తు, ఆకర్షణ శక్తి కలిగిన మహా శక్తివంతమైన కెరటం'' అంటూ వ్యాఖ్యానించారు.


సన్‌ స్పాట్‌ నుండి బయల్దేరిన సోలార్‌ సునామీ భూ ఆవరణలోకి ప్రవేశించినందున భూ అయస్కాంత స్థితిలో పెనుమార్పు జరిగి పెద్ద కుదుపు సంభవించింది. ఆ స్థితి 12 గంటలపాటు నిలిచింది. సైంటిస్టులు ముందే చెప్పినట్టు ఎలాంటి నష్టమూ వాటిల్లలేదు. శాటిలైట్లను, ప్రసార సాధనాలను కొంత కల్లోలపరిచే అవకాశముందని శాస్త్రవేత్తలు ఊహించి నప్పటికీ అలాంటి ఘటనలు కూడా వాటిల్లలేదు. ఉత్తరార్థగోళంలోని ప్రజలకు పచ్చని, ఎర్రని మేఘాలను పోలిన రంగురంగుల కాంతులు కనిపించి కనువిందు చేశాయి. రష్యా, అమెరికా, న్యూజిల్యాండ్‌ తదితర దేశస్తులు వీటిని కుతూహలంగా గమనించారు. మొత్తానికి సోలార్‌ సునామీవల్ల ఎవరికీ, ఎలాంటి హాని లేదని రుజువైంది.


కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్‌గా పిలిచే ఈ విస్ఫోటనం ఏర్పడటం, అది భూమి దిశగా రావడం చాలా చాలా అరుదు. కనుకనే ఖగోళ శాస్త్రవేత్తలు సౌర సునీమీ కోసం వేయి కళ్ళతో నిరీక్షించారు. దాన్ని పరిశీలించి మరిన్ని కీలకమైన విషయాలు కనిపెట్టే ప్రయత్నాల్లో మునిగితేలారు. సోలార్‌ సునామీ గురించి మరింత లోతుగా అధ్యయనం చేసే పనిలో ఉన్నారు.


చుక్కలు పిక్కటిల్లిన వేళ...


భూమ్మీద మనం భూకంపాలు, సునామీలు చూస్తున్నట్టే గగనాంతర రోదసిలోనూ అల్లంత దూరాన మిలుకుమిలుకుమనే నక్షత్రాలలోనూ ఉపరిత కంపాలు ఉంటాయి. భూమ్మీద జరిగితే భూకంపం అంటున్నాం. అదే గ్రహాల మీద జరిగితే గ్రహ కంపం అనాలి. నక్షత్రాల మీద జరిగితే నక్షత్ర కంపం అనాలి. అందానికి అచ్చమైన నిర్వచనంలా కనిపించే చుక్కలలో కలిగే కంపం వాటిని ముక్కలు చేస్తాయి. అవి దిక్కులు పిక్కటిల్లేలా కేకలు పెడతాయి. ఆ నక్షత్ర ముక్కలే ఆకాశంలో ఉల్కల్లా అమిత వేగంతో దూసుకువచ్చి గ్రహాలను ఢకొీంటుంటాయి. భూమి వరకు కూడా వచ్చే ఈ ఉల్కలు చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే మన ఉపరితలం మీద పడ్డాయి. చాలా వరకు ఇవి సముద్రంలో రాలిపోతుంటాయి. ఉల్కలు పడ్డ ప్రాంతంలో పెద్దపెద్ద గోతులు ఉంటాయి. మండే నిపðరాయిలా ఉంటుంది ఈ నక్షత్ర శకలం. ఇలా పేలిపోయిన చుక్కనొకదాన్ని గమనించిన మన శాస్త్రవేత్తలు ఆ పరిణామ క్రమాన్ని పొల్లుపోకుండా రికార్డు చేశారు. నక్షత్రం పేలినపుడు తొలి 200మిల్లీ సెకన్ల సమయంలో భయంకరమైన కాంతిని వెదజల్లుతుంది. సూర్యుడు 2,50,000 సంవత్సరాలలో వెదజల్లే కాంతి ఎంత ఉంటుందో అంత కాంతిని నక్షత్రం ఆ కాస్త సమయంలో వెదజల్లుతుంది. అంతరిక్షం యావత్తు వెలుగు పుంతగా మారిపోతుంది. న్యూట్రాన్‌ కాంతిని వెదజల్లే చుక్కలలో కంపం పుట్టి అది ముక్కలయ్యే వరకు సంభవించే ప్రతీ పరిణామాన్ని రికార్డు చేయడానికి అంతర్జాతీయ స్థాయిలో కృషి చేసి వివిధ ఉపగ్రహాలు సేకరించిన సమాచారాన్ని ఒకచోట క్రోడీకరించి విశ్లేషించారు. ఇలా మిరుమిట్లు గొలిపే కాంతిని వెదజల్లే నక్షత్రాలు పాలపుంతలో, తారామండలంలో లక్షల సంఖ్యలో ఉన్నట్టు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. న్యూట్రాన్‌ నక్షత్రాలలో అత్యంత బలమైన అయస్కాంత ఆవరణ ఉంటుంది. ఇది భూమ్యాకర్షణ శక్తి కన్నా 300 కోట్ల రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ అయస్కాంత శక్తి అమితంగా కలిగిన నక్షత్రాలను మాగ్నాస్టార్స్‌ అంటారు. తాజాగా శాస్త్రవేత్తలకు దొరికిన మాగ్నాస్టార్‌ పేరు ఎస్జీఆర్‌ 1806-20. దీని చుట్టూ ఉన్న అయస్కాంత ఆవరణ అంత బలమైన ఆవరణ మరే నక్షత్రానికి లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏ నక్షత్రానికైనా ఆవరణలోనే తప్ప మధ్యలో ఆకర్షణ శక్తి ఉండదు. నక్షత్రం మధ్యలో న్యూట్రానులు, ప్రోటానులు, ఎలక్ట్రానులు ఉంటాయి. ఇందువల్ల విపరీతమైన విద్యుత్‌ శక్తి ఉద్భవిస్తుంది. ఈ అయస్కాంత శక్తి ద్రవరూపంలో ఉండి కదులుతూ ఉంటుంది. ఈ విద్యుదయస్కాంత ఆవరణను చూస్తే రబ్బరు బ్యాండ్‌ను వేగంగా తిప్పితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మాగ్నాస్టార్‌లో ఉపరితలంలో ఇనుము ఉంటుంది. అందుచేత అయస్కాంత తరంగాలు దాని ద్వారా ప్రయాణించడం సులువే కదా! ఈ నక్షత్రం వైశాల్యం 10 కిలోమీటర్లు. ఇందులో విస్ఫోటనం జరిగేముందు మొదటి పగులు ఏర్పడినపుడు అది దాదాపు సగం భాగాన్ని తీసేసుకుంది. అందే 5కిలోమీటర్ల ప్రాంతంలో పగులు చూపింది. దీని ద్వారా వెలువడిన ఉష్ణం చిమ్మించి కొట్టినట్టు ఎంతో దూరం వరకు దూకింది. మొదట్లో విస్ఫోటనం ఎంత వేగంగా మొదలైందో ఆ తరువాత అంత నిదానించింది. ఆ సమయంలో పగులు పెరుగుతూ ఉందన్నమాట. ఈ నక్షత్రం భూమికి 50వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అయినా దీని పేలుడు దాటికి ఉపగ్రహాలు కొంతసేపు పనిచేయడం మానేశాయి. భూమ్యాకర్షణ శక్తి మీద కూడా దాని ప్రభావం పడింది. మరో 10 కాంతి సంవత్సరాల కాలంలో భూమికి ఉన్న ఓజోన్‌ పొర బద్దలయ్యే అవకాశం ఉంది. అంతరిక్షంలో ఇప్పటి వరకు 9 మాగ్నాస్టార్‌లు ఉన్నట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటిలో నాలుగు ఇప్పటికే ఎక్సరే, గామారేలు వెదజల్లుతున్నట్టు వారు చెబుతున్నారు. న్యూట్రాన్‌ నక్షత్రం పేలడం వెనక ఒక క్రమంలో తిరిగే ఎక్సరే కిరణాల ప్రభావం ఉంది.


Source : http://www.prabhanews.com/life/article-134278


 

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం