తాజా కథలు @ CCK

వీళ్ళు పరమ మూర్ఖలు ప్రభూ !

2015-06-08 09:05:01 చిన్నారుల కథలు
ఒకసారి అక్బర్ సభలోని వారినుద్దేశించి ఇలా ప్రకటన ఇచ్చాడు. ‘‘ సభికులారా ! మీలో ఎవరైతే నాకు నలుగురు మూర్ఖులను తెచ్చి చూపిస్తారో వారికి మంచి బహుమానం ఇస్తాను.’’ అక్బర్ చేసిన ఈ ప్రకటన విని సభలోని వారంతా అక్బరు దగ్గరికి మూర్ఖులను తెచ్చి వాళ్లు చేసే తెలివి తక్కువ పనుల గురించి వివరించడం మొదలుపెట్టారు.

కానీ ! ఎవరూ అక్బర్ ని సంతృప్తి పరచలేకపోయారు. చివరికి బీర్బల్ ఒకనాడు సభలోకి ఇద్దరు మూర్ఖులను తీసుకొచ్చాడు.  ఈ ఇద్దరూ ఎవరు ?  అని అక్బర్ బీర్బల్ ని ప్రశ్నించాడు. ‘‘ వీళ్ళు పరమ మూర్ఖలు ప్రభూ !’’ అని చెప్పాడు బీర్బల్.  సరే ! అలాగయిత వీళ్లేం తెలివి తక్కువ పనులు చేశారో చెప్పు ,అని అడిగాడు అక్బర్.

మొదటి మూర్ఖుడిని చూపించి బీర్బల్ ఇలా చెప్పడం మొదలు పెట్టాడు. ‘‘ ప్రభూ ! వీడు ఒక గేదె వీపు మీద ఎక్కి తన నెత్తిన గడ్డి మోపుని మోస్తూ వెళ్తున్నాడు. నీ నెత్తిన గడ్డిని ఎందుకలా పెట్టుకున్నావ్ అని నేను అడిగాను. దానికి వీడు నా గేదె అసలే బక్క చిక్కి చాలా నీర్సంగా ఉంది కాబట్టి అది గడ్డి మోపును మోయలేదని నేనే దాన్ని నెత్తి మీద పెట్టుకుని మోస్తున్నాను అని అన్నాడు ప్రభూ ! అది విని సభలోని వారందరూ పగలబడి నవ్వారు.

రెండో మూర్ఖుడు చెట్టు మీద తాను కూర్చున్న చెట్టు కొమ్మనే గొడ్డలితో నరుకుతున్నాడు. నువ్వు కూర్చున్న కొమ్మనే నరుకుతున్నావు అలా చేస్తే ఏమవుతుందో నీకు తెలుసా ? అని నేను అడిగాను ప్రభూ ! దానికి వాడు, ఎందుకు తెలీదు, కొమ్మని నరకగానే కొమ్మతో పాటు నేను కూడా కిందకి వచ్చేస్తాను కదా ! చక్కగా నేను చెట్టు దిగే అవసరం లేదు అని చెప్పాడు.’’ సభలోని వారంతా మళ్లీ గట్టిగా నవ్వారు. ‘‘

నువ్వు చెప్పినట్టుగా నిజంగానే వీళ్ళిద్దరూ పరమ మూర్కులే . కానీ ! నేను తీసుకు రమ్మన్నది నలుగురు మూర్ఖుల్ని కదా ! అన్నాడు అక్బర్.  మరో ఇద్దరు మూర్ఖులు ఇక్కడే ఉన్నారు ప్రభూ ! అని సమాధానం చెప్పాడు బీర్బల్. ఇక్కడే ఉన్నారా ? ఎవరు వాళ్ళు? అంటూ ఆశ్ఛర్యంగా అడిగాడు అక్బర్.

‘‘ ఎంతో విలువైన నా సమయాన్ని ఎలాంటి పనికిరాని పనికి ఉపయోగించిన నేను ఒక మూర్ఖుడిని ప్రభూ ! ఇలాంటి పనికి నన్ను ఉపయోగించిన మీరూ ’’ అంటూ ఆగాడు. అది అక్బర్ పాదుషాకి కోపం తెప్పించే సమాధానం. అయినా ! బీర్బల్ మాటల్లో నిజాన్ని గ్రహించడం వల్ల అక్బర్ తన కోపాన్ని దిగమింగి, ఇచ్చిన మాట ప్రకారం బీర్బల్కి బహుమానo ఇచ్చాడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం