తాజా కథలు @ CCK

తండ్రి, తాతల ఆస్తుల మీద పిల్లలకి హక్కు

2015-04-11 05:05:01 చిన్నారుల కథలు
పూర్వం కోసల గ్రామంలో గంగమ్మ అనే వృద్దురాలికి సోమయ్య అనే కొడుకు ఉండేవాడు అతడు సోమరిపోతు. ఏ పని చేసే వాడు కాదు. అతనికి ఒక భార్య ఉండేది. చాలా సౌమ్యురాలు.

సోమయ్య ప్రతి రోజూ ఉదయాన్నే తిని ఊరి మీదకి వెళ్లి పనిపాట లేనివారితో తిరిగి మళ్ళి మధ్యాహ్నం భోజన వేళకి వచ్చి తిని మళ్లి వెళ్లి తిరిగి తిరిగి ఏ రాత్రికో ఇంటికి వచ్చేవాడు. గంగమ్మ మరియు అతని భార్య ఏనాటికైనా పరిస్థితులు అర్ధం చేసుకుని మారక పోతాడా ఎదురు చుసేవారు.

నిత్యం అన్నం వడ్డించే సమయంలో సోమ్మయ్య తల్లి "బాబు ఈ సద్దన్నం తినయ్యా..." అంటూ ఉండేది. సోమయ్య రోజు నేను తినను వేడన్నమే పెట్టు అని గొడవ చేసేవాడు. గంగమ్మ ఒకనాడు ఏదో పని మీద బయటికి వెళుతూ కోడలితో "అమ్మా ! మీ ఆయనతో నేను చెప్పినట్టు మర్చిపోకుండా సద్దన్నం తినమని చెప్పు" అని చెప్పి వెళ్ళింది. మధ్యాహ్నం భోజన వేళకి భోజనం తినడానికి కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వచ్చి భోజనం వడ్డించమని పీట వేసుకుని కూర్చున్నాడు. భార్య కంచం కడికి భర్త ముందు పెట్టి !సద్దన్నం తినండి" అని పెట్టబోయింది. సోమయ్యకి కోపం వచ్చి నువ్వు కూడా అమ్మలాగా "సద్దన్నం తినమంటావేంటి ?" అంటూ అరిచాడు. అత్తయ్య గారు మీకు ఇలా చెప్పమని మరీ మరీ చెప్పి వెళ్ళారండి. అని వేడన్నం వడ్డించి, అత్త గారు వచ్చాక జరిగిన విషయం చెప్పింది.

సోమయ్య సాయంత్రం వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికి కూర్చోగానే గంగమ్మ " నాయనా ! సద్దన్నం తినమని కోడలు చెప్తే అరిచావంట కదా!" అనగా, సోమయ్య! అవునమ్మా అరిచాను. నువ్వు చెప్పావని చెప్పింది. నాకు చద్దన్నం అంటే గిట్టదు. అన్నాడు. గంగమ్మ నవ్వి

నీకు చద్దన్నం అంటే గిట్టదంటున్నావు. ఇన్నాళ్ళు నువ్వు అనుభవించే ఈ ఆస్థి, తినే తిండి చద్దివే కదా! నీ నాన్న, తాతలు సంపాదించినదే కదా బాబు. ఇవి ఎందుకు అనుభవిస్తున్నావు. తప్పు కదా !. తండ్రి, తాతల ఆస్తుల మీద పిల్లలకి హక్కు ఉండవచ్చు. కాని ఆస్థి ఉంది కదా అని కన్నూ మిన్నూ గానక ప్రవర్తిస్తే మొదటికే మోసం కలుగుతుంది. మీ తండ్రి  మీకోసం సంపాదించాడు. దానిని మంచి ధర్మ కార్యాల కోసం ఉపయోగించు. నీవు సంపాదించే సంపాదన కుటుంబ పోషణ కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగించు. అంతేకాని ఉన్న ఆస్థిని ఇలా జల్సాల కోసం వాడుకుంటే నీ తరువాత వారికి ఏమిస్తావ్? నీ చెడు వ్యసనాల భాగస్వామ్యమా? నువ్వు చేసే పాపాలలో భాగమా? ఏమిస్తావ్? అని ప్రశ్నించగానే బదులు చెప్పలేక సిగ్గుతో తల దించుకున్నాడు.

నేను ఏదో అన్నానని తల దించుకోవడం కాదు రా. నేను, నీ భార్య మా బాధ్యతగా సర్దుకుపోతాం. కాని నీ వ్యసనాల వలన ఆస్తితో బాటు పరువు హరించుకుపోతుంది. ఆరోగ్యం క్షీణిస్తుంది. బుద్ది మందబారుతుంది. శరీరం ఏ పని చేయాలన్నా సహకరించదు. మనస్సు అదుపులో ఉండదు. అన్ని విధాల చేటు కలుగుతుంది. ఇకనైనా తెలివి తెచ్చుకుని బ్రతుకరా అంటూ హితభోద చేసింది. ఆ మాటలకి సిగ్గుపడి ఆనాటి నుండి పూర్తిగా మారిపోయి ఇంటి భాధ్యతలు తీసుకుని ఊరంతా మంచి పేరు సంపాదించి అందరికి తలలో నాలుకయ్యాడు. ఆ ఊరికే పెద్ద అయ్యాడు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం