తాజా కథలు @ CCK

అతి తెలివికి పోతే మనమే బోల్తా పడతాo

2015-04-15 01:05:01 చిన్నారుల కథలు
ఒక పెద్ద అడవిలో  నక్క ఉండేది. ఓసారి అది, జంతువులను పట్టుకోటానికి వేటగాడు వేసిన ఉచ్చులో చిక్కుకుంది. దాన్నుంచి బయటపడాలని చాలా ప్రయత్నించింది. చివరకు తప్పించుకుంది. కానీ ! ఆ ప్రయత్నంలో అనుకోకుండా దాని తోక తెగిపోయింది. దాంతో ఎక్కడలేని దిగులూ నక్కకు పట్టుకుంది.

‘‘అయ్యో ! నా తోక తెగిపోయిందే. ఇప్పుడెలా ! తోక లేని నన్ను చూసి అడవిలోని మిగిలిన నక్కలన్నీ గేలి చేస్తాయేమో’’ అంటూ బెంగపడింది. ఆ అవమానాలు ఎలా తప్పించుకోవాలా ? అని ఆలోచించడం మొదలెట్టింది. అప్పుడు దానికో ఉపాయం తట్టింది. వెంటనే మిగిలిన నక్కలన్నిటినీ పిలిచి, ఓ సమావేశం ఏర్పాటు చేసింది. అన్నీ వచ్చాక ఇలా అంది.

‘‘చూడండి మిత్రులారా ! ఇవాళ నేనో కొత్త విషయం తెలుసుకున్నాను. అది మీ అందరికీ చెప్పాలనే ఈ సమావేశం ఏర్పాటు చేశాను. మనం మామూలుగానే అందంగా ఉంటాం. కానీ మన తోకలు కత్తిరించుకుంటే ఇంకా అందంగా ఉంటాం. అయినా ! తోక వల్ల మనకు పెద్ద ఉపయోగమేమీ లేదు సరికదా... అదో బరువు కూడా. అందుకే మీరందరూ కూడా నాలా తోకలు కత్తిరించుకుంటే మరింత సుందరంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. ఓసారి ఆలోచించండి’’ అంది.

అక్కడున్న నక్కల్లో ఒకదానికి విషయం అర్థమయ్యింది. ‘‘మిత్రమా ! నువ్వు తోకను అందం కోసం కత్తిరించుకోలేదని, అది ప్రమాదంలో తెగిపోయిందని నాకు తెలుసు. అయినా ! నీ తోక తెగిపోకుండా ఉంటే, నువ్విలాగే చెప్పేదానివా’’ అని అడిగింది.తన పథకం వారికి తెలిసిపోవడంతో నక్క మారు మాట్లాడలేకపోయింది. అతి తెలివికి పోతే మనమే బోల్తా పడతామని తెలుసుకుని, మెల్లగా అక్కడ్నుంచి జారుకుంది.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం