తాజా కథలు @ CCK

నిజాయితీ

2015-05-03 17:05:02 చిన్నారుల కథలు
జార్జ్ వాషింగ్టన్‌కు ఆరు సంవత్సరాల వయస్సుంటుంది. జార్జ్‌కు తోటల్లో పని చేయడమంటే చెప్పలేనంత ఇష్టం. తోటల్లో తిరిగే సమయంలో తానే స్వయంగా ఒక గొడ్డలిని తయారు చేసుకునేవాడు. ఇంకేముంది పదును తేలిన గొడ్డలితో కలుపు మొక్కలను ఏరి పారేస్తూ ఏపుగా ఎదుగుతున్న మొక్కల ఆలనా పాలనా చూసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తుండేవాడు. ఒకసారి తమ ఇంటి ఆవరణలో గల చెట్ల మధ్య తిరుగుతుండగా జార్జ్‌కి ఒక ఆలోచన వచ్చింది . "నా దగ్గర ఉన్న గొడ్డలితో అమ్మకు ఒక ఊతం కర్ర తయారు చేసి ఇస్తే ఎలా ఉంటుంది ? " సరిగ్గా అదే సమయంలో ఎదురుగా ఉన్న చిన్నపాటి చెర్రి చెట్టు మీద అతని దృష్టి పడింది.

ఇంకేముంది ముందూ వెనకా ఆలోచించకుండా గొడ్డలితో చెర్రి చెట్టు మీద ఒక దెబ్బ వేశాడు జార్జ్. అసలే బలహీనంగా ఉందేమో, ఒక్క గొడ్డలి వేటుకే చెట్టు కుప్పకూలిపోయింది. ఆ చెట్టంటే జార్జ్ వాళ్ల నాన్నగారికి ఎంతో ప్రేమ. దానిని ఆయన కంటికి రెప్పలా చూసుకుంటారు. బజారు నుంచి ఇంటికి వచ్చిన జార్జ్ తండ్రికి, తాను ఎంతగానో ప్రేమగా చూసుకునే చెర్రి చెట్టు నేలకూలిపోయి కనిపించింది. దానిని నిలబెడదామని ఆయన చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫలమైపోయాయి. దాంతో చెట్టును నరికిన వాళ్ల మీద ఆయనకు ఎక్కడ లేని కోపం ముంచుకు వచ్చింది. "చెర్రి చెట్టును నరికెందెవరు ?" అంటూ కనపడిన వారందర్నీ అడిగారు. ఎవ్వరూ సమాధానం చెప్పలేదు.

కొంత సేపయ్యాక తండ్రి గదిలోకి వెళ్లాడు జార్జ్. లోపలికి వచ్చిన జార్జ్‌ను చూసి ఏమిటన్నట్లుగా అడిగాడు తండ్రి. "నాన్నగారు మీరు ప్రేమగా చూసుకుంటున్న చెట్టును నరికిందెవరో నాకు తెలుసు" అన్నాడు జార్జ్. "మీరు అందరితో అన్నట్లుగా విషయం చెప్పినందుకు బహుమతిలేమీ నేను కోరుకోవడం లేదు " చెప్పడం ఆపాడు. అతనికి ముఖంలోకి తండ్రి ఉత్కంఠభరితంగా చూస్తున్నాడు. అతి కష్టం మీద ధైర్యం కూడగట్టుకున్నాడు జార్జ్. పెద్దగా ఏడుస్తూ తండ్రి పాదాల మీద వాలిపోయాడు జార్జ్. "నాన్నగారు ఒక్కనాటికీ మీ ఎదుట అసత్యమాడను .ఎట్టి పరిస్థితుల్లో మీకు అసత్యం చెప్పను . చెర్రి చెట్టును నరికింది నేనే నాన్నగారు ." అలా ఏడుస్తూనే సంగతంతా తండ్రికి వివరించాడు. తండ్రిలోని ఆగ్రహం మంచులా కరిగిపోయింది. జార్జిని తన ఒడిలో కూర్చోపెట్టుకున్నారు. "చూడు జార్జ్ నిజం చెప్పడానికి నువ్వు భయపడవలసిన పని లేదు, ఎందుకంటే నీ నిజాయితీ వెయ్యి చెట్ల కన్నా విలువైనది".

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం