తాజా కథలు @ CCK

ఉపకారికి అపకారం

2015-05-05 15:05:01 చిన్నారుల కథలు
మగధ దేశంలో మందారవతి అనే వనం ఉంటుంది. ఆ వనంలో ఎప్పటినుంచో ఒక లేడిపిల్ల, ఒక కాకి ఎంతో స్నేహంగా ఉంటూ కాలం గడుపుతుంటాయి. ఒకసారి ఆ వనంలోకి నక్క ఒకటి వస్తుంది. ఆ అందమైన వనంలో సంతోషంతో అటూ, ఇటూ... పరుగులు తీస్తున్న నక్కకు లేడిపిల్ల కనిపించింది.

బాగా కండపట్టి బలంగా ఉన్న ఆ లేడిపిల్లను చూడగానే దాని మాంసం ఎలాగైనా సరే తినాలని అనుకుంది నక్క. వెంటనే మెల్లగా లేడి దగ్గరకు వెళ్ళి తన మనస్సులోని కుళ్లును బయటకు పడనీయకుండా మాటలు కలిపింది. తనకు ఎవరూ తోడు లేరని, తాను ఒంటరినని విలపించింది నక్క.

అంతేగాకుండా నిన్ను చూడగానే తనకు తన వారంతా గుర్తుకు వచ్చారని, చాలా సంతోషంగా ఉందని లేడిపిల్లతో నమ్మబలికింది నక్క. నక్క మాటలను నమ్మిన లేడిపిల్ల, దానితో స్నేహం చేసేందుకు ఇష్టపడి, తన నివాస స్థలానికి తీసుకెళ్లింది.

వనంలోని మందారం చెట్టు పైన కూర్చున్న లేడిపిల్ల స్నేహితురాలైన కాకి నక్కను గమనించింది. అతడెవరు ? ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు ? అంటూ లేడిపిల్లను ప్రశ్నించింది కాకి. అప్పుడు లేడిపిల్ల ఈ నక్క దిక్కులేని వాడని, తనతో  స్నేహం కోరి వచ్చాడని చెబుతుంది.

అంతా విన్న కాకి, మంచీ చెడూ విచక్షణ లేకుండా, ఎవరుబడితే వారితో, కొత్త వారితో స్నేహం చేయకూడదని హెచ్చరిస్తూ.... తనకు తెలిసిన గద్ద, పిల్లి కథను చెబుతుంది. అయితే కాకి అలా చెబుతుండటంతో పక్కనే ఉన్న నక్కకు పట్టరాని కోపం వచ్చింది.

అంతే ! నువ్వు మాత్రం లేడిపిల్లను కలుసుకునేటప్పటికి కొత్త దానివే కదా, మరి ఆ తరువాత మంచి స్నేహితులు కాలేదా ? అంటూ కోపాన్ని నిగ్రహించుకుని నిష్ఠూరమాడింది నక్క. కాకి, నక్క అలా వాదులాడుకుంటుండగా.... లేడిపిల్ల కలుగజేసుకుని మనలో మనకు తగాదాలెందుకు, వ్యక్తిగత ప్రవర్తనను బట్టే, మిత్రుడైనా, శత్రువైనా ఏర్పడుతుంటారని సర్దిజెప్పింది.

ఇక అప్పటి నుండి లేడి, కాకి, నక్క ఎంతో స్నేహంగా కాలం గడుపసాగాయి. కానీ నక్కకు మాత్రం లేడిపిల్ల మాంసం తినాలన్న కోరిక మాత్రం చావలేదు. దీనికి తగిన సమయం కోసం వేచి చూడసాగింది. ఇలా కొంత కాలం గడిచాక నక్క ఒకసారి లేడి దగ్గరకు వచ్చి తాను ఒక చోట పైరు దట్టంగా పెరిగి ఉన్న పొలాన్ని చూసి వచ్చానని, తనతో వస్తే దాన్ని చూపిస్తానని చెప్పింది.

నక్క మాటలను నమ్మిన లేడిపిల్ల దానితో పాటు వెళ్లి బాగా ఏపుగా పెరిగిన పైరును చూసి ఎంతో సంతోషించింది. రోజూ ఆ ప్రాంతానికి వెళ్లి పైరును కడుపు నిండా మేసి వచ్చేది. అయితే ! అది ఎంతో కాలం సాగలేదు. ఆ పైరు యజమాని లేడిపిల్ల ఇలా రోజూ వచ్చి పైరును తినేసి వెళ్లటం గమనించాడు.

దాన్ని ఎలాగైనా సరే పట్టుకోవాలని పొలంలో వల వేశాడు యజమాని. విషయం తెలియని లేడిపిల్ల మామూలుగానే పొలం మేసేందుకు వచ్చి, వలలో చిక్కుకుపోయింది. ఎంత ప్రయత్నించినప్పటికీ అది వల నుంచి బయటపడలేక పోయింది. కాసేపటికి అక్కడికి వచ్చిన నక్క, మనసులో ఆనందిస్తూ.... పైకి మాత్రం బాధను నటిస్తూ ఉంటుంది.

పొలం యజమాని రాక ముందే, తనను ఎలాగైనా తప్పించమని నక్కను వేడుకుంటుంది లేడిపిల్ల. అయితే, ఆ వల మొత్తం నరాలతో అల్లి ఉందని, తాను నరాలను నోటితో కొరకలేనని చెప్పి, పక్కనే ఉన్న పొద చాటుకు వెళ్లి నక్కి కూర్చుంటుంది. నక్క ఇలా మోసం చేసినందుకు లేడిపిల్ల చాలా బాధ పడుతుంది.

మేతకు వెళ్లని తన మిత్రుడు ఎంత సేపైనా తిరిగిరాకపోవడంతో అనుమానం వచ్చిన కాకి వెతుక్కుంటూ రాగా, వలలో చిక్కుకుపోయిన లేడిపిల్ల కనిపిస్తుంది. ఇదంతా ఎలా జరిగిందని కాకి ప్రశ్నించగా, నక్క మాటలను నమ్మినందుకు తనకు ఈ రకంగా కీడు జరిగిందని కన్నీళ్ళు పెట్టుకుంటుంది లేడిపిల్ల.

ఇవి రెండూ ఇలా మాట్లాడుకుంటున్న సమయంలోనే పొలం యజమాని చేతిలో దుడ్డు కర్రతో అటుగా రావడం గమనించాయి. జరగబోయే అపాయాన్ని గ్రహించిన కాకి, లేడితో వలలో చచ్చిపోయినట్లు నటిస్తూ పడుకోమని, తాను చచ్చిన నీ కళ్లను పొడుస్తున్నట్లుగా నటిస్తానని చెప్పింది.

అంతేగాకుండా, తాను సమయం చూసి కూత పెట్టగానే లేచి పరుగు తీయమని, అప్పటికి అంతకు మించిన ఉపాయం మరోకటి లేదని లేడికి అభయం ఇచ్చింది కాకి. పొలం యజమాని లేడి చచ్చిపోయిందనుకొని మెల్లగా వలను విడదీశాడు. దీన్ని గమనించిన కాకి పెద్దగా కేక పెట్టడంతో, ఒక్క ఉదటున లేచి పరుగెత్తింది లేడిపిల్ల.

లేడి తనను మోసం చేసి పారిపోవడం భరించలేని పొలం యజమాని తన చేతిలోని బడితను లేడి మీదకు విసిరాడు. అయితే ! అది గురి తప్పి పక్కనే పొదలో దాగి వున్న నక్కకు తగిలి కుక్కచావు చచ్చింది. లేడిపిల్లను కాపాడుకుని దాన్నే అనుసరిస్తూ, వనంలోకి వెళ్లిపోయింది కాకి.

నీతి :

కొత్తగా వచ్చినవారిని త్వరపడి నమ్మితే  ప్రమాదం సంభవిస్తుంది. అంతేగాకుండా ఎవరికైనా అపకారం చేయాలనుకుంటే, అలా అనుకున్న వారికే అపకారం ఎదురౌతుంది .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం