తాజా కథలు @ CCK

గురువు గారి మాట

2015-06-07 01:05:02 చిన్నారుల కథలు
శేషాచలం అడవిలో ఒక పెద్ద కోతుల మంద ఉండేది. దానికి రామన్న అనే కోతి ఒకటి నాయకుడిగా ఉండేది. రామన్నకు ఒక సోదరుడు, గుడ్డిదైన తల్లి ఉండేది. తల్లిని ఒక చోట సురక్షితంగా ఉంచిన వీరు అడవిలో వేట కోసం వెళ్ళేవారు.

రామన్న, అతడి తమ్ముడు కలసి రోజూ అడవిలో దొరికే మంచి మంచి పండ్లను సేకరించి, మందలోని తమ సేవకుల ద్వారా తల్లికి పంపించే వాళ్ళు. ఐతే మంచి వారు కాని సేవకులు వాటికి ఆమెకి ఇవ్వకుండా వాళ్ళే తినేసేవారు.

ఒక రోజున తల్లిని చూసేందుకు వచ్చిన రామన్న తల్లిని చూసి ఆశ్చర్యపోయి "ఏంటమ్మా ఇలా తయారయ్యావు" అని ప్రశ్నించాడు. రోజూ మేము పంపించే ఫలాలు తింటున్నావా ? లేదా ? అని అడిగాడు.

ఫలాలా ? నాకెవరూ ఏమీ ఇవ్వలేదు నాయనా ? అని చెప్పింది రామన్న తల్లి. అప్పుడు రామన్నకు విషయం అర్థమై వెంటనే తమ్ముడి వద్దకు వెళ్లి జరిగినదంతా చెప్పి, తమ్ముడూ ! ఇకపై నేను ఇంటి దగ్గరే ఉండి అమ్మ పోషణ చూసుకుంటాను. నువ్వు మంద బాధ్యతను తీసుకో , అని చెప్పాడు రామన్న.

అందుకు రామన్న తమ్ముడు ఒప్పుకోలేదు. పైగా, ‘‘అన్నయ్యా ! నేనూ నీతో పాటు ఇంటి దగ్గరనే ఉండి, అమ్మ పోషణ చూస్తాను'' అని అన్నాడు. దీంతో వారిద్దరూ ఒక అభిప్రాయానికి వచ్చి ఓ రావి చెట్టుపై బస ఏర్పాటు చేసుకుని, తల్లి ఆలనా పాలనా చూసుకోసాగారు.

కాలం అలా నడుస్తుండగా, మరో వైపు వేదముని అనే బ్రాహ్మణుడు గురువు వద్ద విలువిద్య నేర్చుకుంటుంటాడు. విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురువు దగ్గరకు వెళ్ళి, ఇక తనకు సెలవిప్పించండి గురువు గారూ అని అడుగుతాడు.

అప్పుడు గురువు వేదముని ఉద్దేశించి, "నాయనా ! నువ్వు విద్య పూర్తి చేసుకున్నావు. సంతోషం. అయితే నీది దుడుకు స్వభావం. తొందరపడి ఎప్పుడూ క్రూరమైన పనులు చేయవద్దు. ఆ తరువాత ప్రశ్చాత్తాపపడినా ప్రయోజనం ఉండదం. దీన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకో !" అని అన్నాడు.

అలాగేనంటూ ఊరికి బయలుదేరాడు వేదముని. కొన్ని రోజులకు పెళ్ళి చేసుకున్నాడు. ఒక పిల్లాడికి తండ్రి కూడా అయ్యాడు వేదముని. అయితే ! అతనికి ఏ పని దొరకక పోవడంతో జంతువులను, పక్షలను వేటాడి వాటి మాంసం అమ్మి జీవనం సాగించాడు.

ఒక రోజు ఎంత తిరిగినా ఏ ఒక్క జంతువును వేటాడలేకపోయాడు వేదముని. ఇక లాభం లేదు ఇంటికెళ్లిపోదాం అని అనుకుంటూ.... రామన్న సోదరులు, గుడ్డి తల్లి నివసిస్తోన్న రావి చెట్టు దగ్గరకు వచ్చాడు. అదే సమయంలో తల్లికి ఆహారం పెట్టి ఆమె పక్కనే కూర్చుని ఉన్నారు రామన్న సోదరులు.

ఉత్తి చేతులతో ఇంటికెళ్లడమేంటని ఆలోచించిన వేదముని తల్లి కోతికి బాణం గురి పెట్టాడు. దీన్ని గమనించిన రామన్న, అదిగో ఆ వేటగాడు అమ్మకు బాణం గురి పెట్టాడు. ఆమె ప్రాణాలకు నేను అడ్డుపడతాను. ఆ తరువాత అమ్మను నువ్వే రక్షించాలి అంటూ... తమ్ముడికి చెప్పి, చెట్టు దిగి కిందికి వచ్చాడు.

"ఓ వేటగాడా ! మా అమ్మ ముసలిది, గుడ్డిది. ఆమెను చంపవద్దు. కావాలంటే నా ప్రాణాలు తీసుకో !" అంటూ బ్రతిమలాడాడు రామన్న. ఓహో , అలాగా ! అంటూ వేదముని నిర్దాక్షిణ్యంగా బాణంతో ఒక్క దెబ్బకు నేలకూల్చాడు. ఐతే ! అతడు మాట మీద నిలబడక మళ్ళీ తల్లి కోతికి బాణం గురి పెట్టాడు. ఇది కనిపెట్టిన చిన్నవాడు బ్రతిమలాడినా కనికరం చూపలేదు వేటగాడు. అతడిని కూడా అన్నను చంపినట్లే చంపేశాడు.

ఈ రెండు కోతులతో ఈ రోజుకు పొట్టపోసుకోవచ్చులే అనుకున్న వేటగాడు, కాసేపట్లోనే మళ్ళీ మనసు మార్చుకుని తల్లి కోతిని కూడా ఏ మాత్రం కనికరం లేకుండా చంపేసి, మూడు కోతులను భుజాన వేసుకుని ఇంటి దారిపట్టాడు.

వేటగాడు ఊరి పొలిమేరకు చేరుకున్నాడో లేదో, పిడుగు లాంటి వార్త అతడి చెవినబడింది. అదేంటంటే ! ఇల్లు కాలిపోయి, అతడి భార్యాపిల్లలు సజీవదహనమైపోయారని. వార్త విన్న వేటగాడు పట్టరాని దుఃఖంతో గుండెలు బాదుకుంటూ ఏడ్చాడు.

గురువు గారి మాటలను పెడచెవిన పెట్టి, పాపం ! అణ్యం పుణ్యం తెలియని ఆ మూగ జీవాలను హతమార్చినందుకు నాకు తగిన శాస్తే జరిగింది. తనకు విముక్తి లేదు. చావు తప్ప మరో మార్గం లేదంటూ వేటగాడు కూడా, ఇంకా ఆరని మంటల్లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

గురువులు, తల్లిదండ్రులు చెప్పిన మాటలను ఆలకించడమేకాదు. తూ.చ. తప్పకుండా పాటిస్తే మంచిది. గురువులైనా, తల్లిదండ్రులైనా మనకు మంచి జరిగే విషయాలనే చెబుతారు కాబట్టి వాటిని ఎప్పుడూ పెడచెవిన పెట్టకూడదు. అలా చేసినట్లయితే వేదమునికి పట్టిన గతే పడుతుంది.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం