తాజా కథలు @ CCK

ఐకమత్యమే బలం

2015-04-10 19:05:01 చిన్నారుల కథలు
పూర్వం శాతవాహన నగరంలో ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. అతడు చాలా మంచివాడు. తన తెలివితేటలతో వ్యాపారం చేస్తూ బాగా డబ్బు, మంచి పేరు ప్రతిష్టలను సంపాదించాడు. అన్నీ ఉన్నప్పటికీ అతడికి ఒకటే దిగులుగా ఉండేది.

నలుగురు పిల్లల తండ్రి అయిన ఆ వ్యాపారికి దిగులంతా తన పిల్లలపైనే ఉండేది. పుట్టడంతోటే ధనవంతులు కావడం వల్లా వారందరినీ అల్లారు ముద్దుగా, ఏదీ లేదనకుండా పెంచాడు. అయితే మితిమీరిన గారాభం చేయడం వల్ల వారిలో ఎవరికీ విద్యాభ్యాసం అబ్బలేదు.

అంతేగాకుండా నలుగురు అన్నదమ్ముల్లోనూ ఒకరంటే ఒకరికి పడదు. వయసు పెరుగుతున్నా వారి బుద్ధులు, వారి ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదు. అందుకనే పిల్లల పైన ఆ వ్యాపారి బాగా దిగులు పెట్టుకున్నాడు. ఆ దిగులుతోనే మంచ0పట్టాడు. చనిపోతానేమోనన్న బెంగపట్టుకుంది.

అయితే ! తాను చనిపోతే వారిలో వారే తగాదాలు పడుతున్న తన పిల్లలు ఎలా బ్రతుకుతారు అన్న దిగులుతో అతడికి వ్యాధి మరింత ముదిరింది. ఆ దిగులుతోనే ఆలోచించి వీరిని ఎలాగైనా సరే బాగు చేయాలని అనుకుంటుండగా మెరుపు లాంటి ఆలోచన ఒకటి తట్టింది.

అనుకున్నదే తడవుగా ఆ వ్యాపారి తన నలుగురు కొడుకులను పిలిచి వాళ్ళతో కొన్ని కట్టెలను తెప్పించాడు. ఒక్కొక్కడినీ ఒక్కొక్క కట్ట తీసుకుని విరవమని చెప్పాడు. నలుగురూ తలో కట్టెను తీసుకుని సునాయాసంగా మధ్యకు విరిచారు. తరువాత ఒకేసారి రెండేసి కట్టెలను విరమన్నాడు. అతి కష్టంమీద ఆ కట్టెలను కూడా విరిచారు.

తరువాత ఒక్కొక్కరినీ నాలుగేసి కట్టెలు తీసుకుని విరవమన్నాడు వ్యాపారి. నాలుగేసి కట్టెలు విరవడం వారిలో ఏ ఒక్కరి వల్లనా సాధ్యం కాలేదు. అవే నాలుగు కట్టెలను నలుగురిని పట్టుకుని విరవమన్నాడు. నలుగురూ కలిసి నాలుగు కట్టెలను నునాయాసంగా విరిచేశారు.

అప్పుడు వ్యాపారి తన కొడుకులను ఉద్దేశించి, "చూశారా.... నాయనలారా ! మీరు నలుగురూ కలిసి కట్టుగా ఒక పని చేయం వల్ల సులభంగా ఆ కట్టెలను విరిచేయగలిగారు. ఎవరికి వారు విడిగా ప్రయత్నించినప్పుడు చేయలేకపోయారు. ఇప్పటికైనా నలుగురూ కలసిమెలసి ఉండటంలో ఎంత లాభముందో, ఎంత మంచి జరుగుతుందో ఆలోచించండి" అని అన్నాడు.

అంతేగాకుండా ! "ఐకమత్యమే బలం" కాబట్టి నా తరువాత మీరందరూ ఐకమత్యంగా ఉంటామని నాకు ప్రమాణం చేయండి, అని కొడుకులను కోరాడు ఆ వ్యాపారి. తండ్రి మాటల్లోని జీవిత సత్యాన్ని గ్రహించిన నలుగురు కొడుకులూ ఇకపైన కలసిమెలసి ఉంటామని తండ్రికి ప్రమాణం చేశారు.

నీతి :

నలుగురూ కలసిమెలసి ఉండటం వల్ల ఎంత పెద్ద లక్ష్యాన్నయినా సునాయాసంగా ఛేదించవచ్చు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం