తాజా కథలు @ CCK

చేసిన తప్పును తెలుసుకున్న హంస పిల్లలు

2015-06-10 09:05:02 చిన్నారుల కథలు
ఒక చిన్న నీటి సరస్సులో పక్షులన్ని కలసిమెలసి జీవనం సాగిస్తుండేవి. అందులో ఎక్కువగా హంసల సంఖ్య ఎక్కువగా ఉండేవి. ఓ ఎండా కాలంలో ఆ సరస్సులో నీరు తక్కువ అవడంతో బాతులన్నీ వలస వెళ్లిపోయాయి. అందులో ఒక్క నల్లని బాతు మాత్రం అక్కడే హంసలతో పాటు ఉండిపోయింది.

హంసల్లో పెద్ద వయసు కలిగినవి తమ పిల్లలతో పాటు, ఈ నల్ల బాతు పిల్లను కూడా చేరదీసి తమతోనే ఉంచుకోసాగాయి. ఇది నచ్చని చిన్న వయసు హంసలన్నీ బాతు పిల్లను ఏడిపించేవి. తమతో ఉండవద్దని, నువ్వు అందంగా ఉండవు, మేము చూడు ఎంత తెల్లగా ఉన్నామో అంటూ మాటలతో గాయపర్చేవి.

వీటన్నింటినీ మౌనంగా భరించిన నల్ల బాతు పిల్ల, ప్రతి రోజూ గట్టు పైన కూర్చుని బాగా ఏడ్చేది. ఎన్ని రోజులు గడుస్తున్నా చిన్న హంస పిల్లలు ఏవీ దాన్ని దగ్గరకు రానీయలేదు. దీంతో ఆ బాధ భరించలేని నల్ల బాతు అక్కడ్నించీ దూరంగా వెళ్ళిపోయి ఒక చిన్న చెరువులో ఉండిపోయింది. అక్కడ దాన్ని ఎవరూ ఏడిపించేవారు లేకపోవడంతో సంతోషంగా రోజులు వెళ్లదీయసాగింది.

అయితే ! చిన్న హంసలు తనను దగ్గరికి రానీయకపోయినా, బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్న తల్లి హంసలను ఒకసారైనా చూసి రావాలన్న కోరిక కలిగింది నల్ల బాతుకు. ఇంకేముందీ అనుకున్న వెంటనే సొంత గూటికి బయలుదేరింది. అక్కడికి వెళ్లిన నల్ల బాతు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది.

ఎందుకంటే, తన తోటి వయస్సున్న చిన్న హంసలన్నీ పెద్ద హంసలైపోయాయి. తననే ఆశ్చర్యంగా అవి చూస్తుండటంతో.... "మీరందరూ నన్ను దగ్గరికి రానీయని నల్ల బాతును నేను ! గుర్తు పట్టారా ?" అని వాటిని ప్రశ్నించింది. మీరు ఏడిపిస్తున్నారని వెళ్లిపోయాను. మిమ్మల్ని చూడాలన్న ఆశతో మళ్లీ తిరిగి వచ్చాను అని చెప్పింది. వెంటనే హంసలకు నల్ల బాతు గుర్తు వచ్చి నోరు మెదపకుండా ఉండిపోయాయి.

ఇంతలో తల్లి హంసలు దీన్నంతా చూసి, నల్ల బాతును అక్కున చేర్చుకుని, ఎందుకు వెళ్లిపోయావు ? ఎలా ఉన్నావంటూ కుశల ప్రశ్నలు వేసి నల్ల బాతును దగ్గరికి తీసుకున్నాయి. దీన్ని చూసి ఈర్ష్యతో వెళ్లిపోతున్న పెద్దవైన హంస పిల్లలను, తల్లి హంసలు పిల్చి చీవాట్లు పెట్టాయి.

మీరంతా బయటకు కనిపించే అందాన్నే చూస్తున్నారు. మనసును చూడటం లేదు. రంగు నల్లనైనప్పటికీ బాతుకు మనమందరం అంటే ఏంతో ప్రేమ. మనం మర్చిపోయినప్పటికీ మనల్ని గుర్తు పెట్టుకుని అంత దూరం నుంచి వెతుక్కుంటూ వచ్చింది. అలాంటి దాన్ని బాధ పెట్టడం మంచిది కాదు. ఇప్పుడు మీరు చిన్నపిల్లలు కాదు. పెద్ద వాళ్లు అయినారు. మంచి చెడ్డలు ఆలోచించాలంటూ బుద్ధి చెప్పాయి తల్లి హంసలు.

దీంతో, చేసిన తప్పును తెలుసుకున్న హంస పిల్లలు - తమను మన్నించమని నల్ల బాతును కోరాయి. నల్ల బాతు సంతోషంగా వాటిని స్వీకరించటంతో ఆనందంగా నీళ్లలోకి గంతులు వేసుకుంటూ చేపలు పట్టేందుకు వెళ్లిపోయాయి. ఇక అప్పటి నుంచి అవన్నీ కలసిమెలసి, ఐకమత్యంతో సంతోషంగా జీవనం గడపసాగాయి.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం