తాజా కథలు @ CCK

మొదటికే మోసం !

2015-05-18 01:05:02 చిన్నారుల కథలు
శివపురం అనే ఊళ్ళో నిత్యానందం అనే విత్తనాల వ్యాపారి ఉండేవాడు. ఆయన దగ్గర రాము, సోము అనే ఇద్దరు పని వాళ్ళు ఉన్నారు. వీరిద్దరూ ఇంటి పనే కాకుండా, విత్తనాల కొట్టు దగ్గర కూడా పని చేసేవాళ్ళు. నిత్యానందం దగ్గర ఒక కోడిపుంజు కూడా ఉండేది. ఇది తెల్లవారుఝాము కాగానే తన కూతతో యజమానిని నిద్ర లేపేది. ఆయన లేచిన తరువాత రాము, సోములను లేపేవాడు.

నిత్యానందం వ్యాపారి అయినప్పటికీ పని వాళ్ళను మంచిగానే ఆదరించేవాడు. వాళ్లకు కావలసిన వస్తువులను ఇవ్వడమే కాకుండా, కడుపు నిండా భోజనం కూడా పెట్టేవాడు. అయినప్పటికీ రాము, సోములకు తెల్లవారుఝామునే నిద్ర లేవటం మాత్రం ఇష్టం ఉండేది కాదు. అయితే కోడిపుంజు కూతకు మేల్కొనే యజమాని వాళ్లిద్దరినీ కూడా నిద్ర లేపి పనులు పురమాయించేవాడు.

దీంతో ! రాము, సోములు ఒక రోజు కూర్చుని ఇలా మాట్లాడుకోసాగారు,"ఒరేయ్ ! మన యజమాని త్వరగా నిద్ర లేచి, మనల్ని కూడా నిద్ర లేపుతుండేది ఈ కోడిపుంజు వల్లనే. కాబట్టి, దీన్ని చంపేద్దాం. అప్పుడు మనల్ని నిద్ర లేపేవారు ఎవరూ ఉండరు. ఎంచక్కా, ఎంత సేపైనా పడుకోవచ్చు" అంటూ ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఆ అవకాశం కోసం వేచి చూడసాగారు.

ఇలా ఉండగా, ఒక రోజు యజమాని ఏదో పని నిమిత్తం పొరుగూరుకు వెళ్లి,  ఆ రోజు రాత్రికి కూడా రాలేడు. చీకటి పడిన తరువాత, అదే అదనుగా భావించిన రాము, సోములు గుట్టు చప్పుడు కాకుండా.... గంప కింద కప్పెట్టిన కోడిపుంజును తీసుకుని ఊరి బయటకు వెళ్లారు. అక్కడ కోడి పీక కోసి పడేసి, ఇంటికి తిరిగొచ్చి ఏమీ ఎరగనట్లుగా నిద్ర పోయారు.

ఆ మరుసటి రోజు ఇంటికి తిరిగొచ్చిన యజమాని కోడిపుంజు గురించి ఆరా తీశాడు. నాకు తెలీదంటే తెలీదని రాము, సోములిద్దరూ బొంకారు. లోలోపల నవ్వుకుంటూ, పైకి మాత్రం చాలా గంభీరంగా ముఖం పెట్టి నిత్యానందం చెప్పిన చోటల్లా వాళ్లు వెతికి వచ్చారు.

ఎక్కడా కనబడలేదని చెప్పిన రాము, సోమూలు కోడిపుంజు పీడ విరగడైనందుకు సంతోషిస్తూ, ఇంకెవ్వరూ తమను తొందరగా లేపరని అనుకుంటూ నిద్రపోయారు. అయితే వాళ్ళిద్దరి ఆలోచనలూ తారుమారైపోయాయి.

అర్థరాత్రి అయ్యేసరికే నిత్యానందానికి మెలకువ వచ్చేసింది. తెల్లారుతుందేమోననుకుని రాము, సోములిద్దరినీ నిద్రలేపేశాడు. కానీ ఎంతో సేపు గడిస్తేగానీ తెల్లారలేదు. దీంతో వాళ్లిద్దరూ చాలా నీరసపడిపోయి ఇవేం కష్టాలురా బాబూ అనుకున్నారు.

ఇంకేముంది ఆ రోజు నుంచీ రాము, సోములకు నిజమైన కష్టాలు ప్రారంభమయ్యాయి. యజమానికి ఎప్పుడు మెలకువ వస్తే, అప్పుడే పని వాళ్లను నిద్ర లేపేసేవాడు. తమను ఎక్కువ సేపు నిద్ర పోనీయలేదన్న కసితో, దానికి కారణమైన కోడిపుంజును చంపేసిన రాము, సోములు ప్రశ్చాత్తాపంతో కుంగిపోయారు.

ఎక్కువ సేపు నిద్ర పోవచ్చనుకుంటే అసలు నిద్రే లేకుండా పోయిందని, మొదటికే మోసం వచ్చిందని అనుకున్నారు. చేజేతులా కోడిపుంజును చంపేసి కష్టాలు కొనితెచ్చుకున్నామని రాము, సోములు భాదపడుతూ కూర్చున్నారు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం