తాజా కథలు @ CCK

సింహం ఇచ్చిన బహుమతి

2015-06-17 09:05:01 చిన్నారుల కథలు
పూర్వం ఒక పండితుడు అడవిగుండా వెళుతుండగా ఒక పాడుబడ్డ బావి నుంచి ఏవో అరుపులు వినిపించాయి .అతను బావిలోకి తొంగి చూడగా అందులో ఒక సింహం ,ఒక కోతి , ఒక మనిషి , ఒక పాము కనిపించాయి.ఆ పండితుడు తన తలపాగా తీసి ఒక తాడులా చుట్టి దాన్ని బావిలోకి వేశాడు .సింహం దాన్ని తన పళ్ళతో కరచి పట్టుకుంటే ఎంతో కష్టపడి దాన్ని పైకి లాగాడు .
సింహం ఆ పండితుడికి కృతఙ్ఞతలు తెలియచేసి , "నువ్వు మళ్లీ ఈ అడవిగుండా వెళ్తున్నప్పుడు మా ఇంటికి రావాలి " అంటూ పండితుడిని ఆహ్వానించి ,అక్కడి నుంచి వెళ్ళిపోయింది . పండితుడు నూతిలోకి చూసి తాడును పడవేశాడు . ముందుగా కోతి ఆ తాడును పట్టుకుని పైకి వచ్చింది .

తరువాత ఆ తాడును పట్టుకొని పాము పైకి వచ్చింది . అది కృతఙ్ఞతలు తెలుపుతూ "పండితుడా !లోపలున్న మనిషిని మాత్రం కాపాడవద్దు . ఆ మనిషి చాలా భయంకరమైనవాడు "అంది .

అయితే  ! తోటి మానవుడిని కాపాడటం తన కర్తవ్యం అని తలచి పండితుడు ఆ మనిషిని బయటకు తీశాడు . ఆ మనిషి చేతులు జోడించి కృతఙ్ఞతలు తెలుపుతూ తాను ముత్యాలు , రత్నాల వ్యాపారం చేస్తున్నానని పరిచయం చేసుకుని , "మీరు గనుక మా ఊరికి ఏప్పుడైనా వస్తే ,మా ఇంటికి తప్పకుండా రావాలి "అన్నాడు .

కొన్ని మైళ్ల దూరం నడిచాక పండితుడికి ఆకలి వేసి ఒక చెట్టు కింద కూర్చున్నాడు . అలసట వల్ల అతనికి కునుకు పట్టింది . నిద్ర లేవగానే అతను తన ఎదురుగా అరిటాకులు పరిచి .......వాటిమీద రకరకాల పండ్లు ఉండడం గమనించాడు .ఆశ్చర్యంతో తల పైకెత్తి చూసేసరికి , చేట్టుపయన ఉన్న కోతులు కొన్ని వినయంగా నమస్కరించి ," మీరు మా బాబాయి ప్రాణాన్ని కాపాడారు . మీ ఆకలి తీర్చడం మా బాద్యత "అన్నాయి .

పండితుడు కోతులు ఇచ్చిన పండ్లను కడుపారా ఆరగించి , మరికాసేపు అక్కడ విశ్రాంతి తీసుకుని , తన ప్రయాణాన్ని కొనసాగించాడు . అలా అడవిగుండా వెళుతుండగా ఎవరో తనను పిలుస్తునట్లు అనిపించింది . అటూ ఇటు చూసేసరికి అక్కడ ఉన్న ఒక కొండ మీద సింహం నిలబడి ఉండడం గమనించాడు . అది అతడిని చూసి , నవ్వి , తన ఇంటికి ఆహ్వానించింది . పండితుడు సింహం ఇంట్లో రెండురోజులు గడిపి అక్కడి నుంచి బయలుదేరాడు . ఆ సింహం అతనికి వీడ్కోలు పలుకుతూ ఒక బహుమతి ఇచ్చింది .

సింహం ఇచ్చిన ఆ బహుమతిని చూసి పండితుడు ఆశ్చర్యపోయాడు . అది ఒక అరుదైన , ఖరీదైన ముత్యాలదండ . అయితే అది అక్కడక్కడా తెగిపోయి ఉండటంతో అక్కడినుంచి తను కాపాడిన వ్యాపారి ఉండే పట్టణానికి వెళ్ళాడు . ఆ గొలుసును ఆ వ్యాపారికి చూపించి దాన్ని బాగుచేయగలదేమో అడిగాడు . ఆ వ్యాపారి అతనిని విశ్రాంతి తీసుకొమ్మని చెప్పి సరాసరి రాజు దగ్గరకెళ్ళి , ఆయనకు ఆ దండను చూపించాడు .

అతడు రాజుగారితో "మహారాజా!మీకు గుర్తుందా ? అడవిలో సింహాన్ని చంపడానికి వెళ్ళినప్పుడు రాకుమారుడు ఈ హారాన్ని ధరించాడు . ఒక మనిషి ఈ హారాన్ని కాజేసేందుకు రాజకుమారున్ని సంహరించాడు "అని చెప్పగానే ......వెంటనే రాజు , సేనానిని పిలిచి ఆ మనిషిని తక్షణమే బంధించి కారాగారంలో పడవేయమని ఆజ్ఞాపించి , ఆ వ్యాపారికి విలువైన కానుకలిచ్చి సగౌరవంగ సాగనంపాడు .

దురదృష్టవంతుడైన ఆ పండితుడు మాత్రం కారాగారంలో కూర్చుని ఊచలు లెక్కపెడుతున్నాడు . వ్యాపారి ఇంటికి వెళ్ళినందుకు పండితుడు విచారించాడు . ఇంతలో ఆ పండితుడికి బుసకొట్టినట్లు శబ్దం వినిపించి , వెనక్కు తిరిగి చూస్తే అక్కడ పాము ఉంది . ఆ పాము ," నేను నీతో చెప్పానా! ఆ వ్యాపారిని నమ్మరాదని " అంది నిష్టూరంగా . పండితుడు "నీ మాటలను విననందుకు నన్ను క్షమించు . ఏదో ఒక ఉపాయం చెప్పి , నన్ను కాపాడు "అని ప్రాధేయపడ్డాడు .

ఆ పాము " నేనొక పధకం ఆలోచించాను . అయితే నువ్వు నేను చెప్పిన విధంగా చేయాలి . రాజు , రాణి తోటలో విహారానికి వచినప్పుడు నేను రాణిని కాటేస్తాను. అప్పుడు అక్కడ అలజడి చెలరేగి ఆమెను కాపాడే వారికోసం వెతుకుతూ ఉంటారు . నువ్వు వచ్చేదాకా , రాణి స్పృహలోకి రాదు . ఆ విషం పనిచేయడం ప్రారంభించదు "అంది ."బాగానే ఉంది కానీ నేను ఆమెకు ఎలా చికిత్స చేయాలి ?"అని అడిగాడు పండితుడు .పాము అతనితో "ఆ విషం రాణిగారి ఎడమపాదం వేళ్ళలో ఉంటుంది . నేవేప్పుడైతే ఆ వేళ్ళలోని విషాన్ని పీల్చేసి , తరువాత ఆ భాగాన్ని శుభ్రం చేస్తావో ,అప్పుడే ఆమె స్పృహలోకి వస్తుంది "అంది .
మరుసటిరోజు , తోటలో నుండి "ఒక విషసర్పం రాణిగారిని కాటు వేసింది .ఎవరో ఒకరు వచ్చి త్వరగా ఆమెను కాపాడండి "అని ఏడ్పులు , కేకలు వినబడ్డాయి .

ఆ రాజ్యంలో మంచి పేరు ప్రఖ్యాతలున్న వైద్యులు ఎందరో వచ్చారు . కానీ ,వారిలో ఒక్కరూ రాణిని స్పృహలోకి తీసుకురాలేకపోయారు .

అప్పుడు ,రాజు ,"ఎవరైనా రాణిని స్పృహలోకి తీసుకురాగలిగితే వారు ఏది కోరితే ,అది ఇస్తాను "అని ప్రకటించాడు .

ఇదే అదననుకుని పండితుడు కారాగారం కాపలాదారుతో "నాకు అవకాశం ఇస్తే రాణిగారిని నేను స్పృహలోకి తీసుకురాగలను "అన్నాడు .

ఆ విషయం రాజుగారికి తెలిసింది . ఆయన ఆ పండితుణ్ణి పిలిపించాడు . పండితుడు రాణిగారి సమీపానికి వచ్చి ఆమె ఎడమ పాదం వేళ్ళలో ఉన్న విషాన్ని పీల్చేశాడు . అప్పుడు రాణి నెమ్మదిగా స్పృహలోకి రాసాగింది .

రాజుగారు ఆనందంతో పండితుడిని కౌగలించుకుని , అతని పేరు , అతను ఎక్కడి నుండి వచ్చింది తదితర వివరాలు అడిగాడు . జరిగిందంతా పండితుడి ద్వారా విని చాలా బాధపడ్డాడు . మంత్రిని పిలిచి ,అమాయకుడైన పండితుడిని మోసం చేసిన వ్యాపారస్తుడిని కారాగారంలో బందించమని ఆజ్ఞాపించి , ఆ పండితుడిని ఘనంగా సన్మానించాడు .

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం