తాజా కథలు @ CCK

తపస్సు వల్ల సాధించరానిది ఏదీ లేదు

2015-06-04 01:05:02 చిన్నారుల కథలు
పాండవులు జూదంలో ఓడిపోయిన తరువాత ఇచ్చిన మాట ప్రకారం రాజ భోగాలన్నింటినీ విడిచి పెట్టి వనవాసం బయలుదేరారు. నారచీరలూ, కృష్ణజినమూ ధరించి, కందమూల ఫలాలు తింటూ పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసము, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేసేందుకు సన్నద్ధులై వెళ్తుంటారు.

అలా వెళ్తున్న వాళ్ళను చూసి, "ఏమున్నా ఏం లేకపోయినా ఈ పరమ దుష్టుడు దుర్యోధనుడి రాజ్యంలో మాత్రం మనం వుండలేం. అసలు వాడే ఒక దుర్మార్గుడు కాగా, కర్ణుడు, సైంధవుడు, శకుని లాంటి వారు తోడయ్యారు. ఇలాంటి దుర్మార్గుల రాజ్యంలో ధర్మం ఎక్కడ నిలుస్తుంది. పాండవులు ఎక్కడ ఉంటే అక్కడే మనం ఉందాం అనుకుంటూ ఆ దేశ పౌరులంతా పాండవుల వెంటబడ్డారు.

ఇది చూసిన పాండవులు, "నాయనలారా! మేము సర్వమూ పోగొట్టుకున్నాం. కందమూలాలు తింటూ అరణ్యవాసం చేయబోతున్నాం. మాతో పాటు మీరు కూడా కష్టపడటమెందుకు ? మా మీద అనుగ్రహముంచి వెనెక్కి వెళ్ళిపోండి" అని ప్రజల్ని వేడుకున్నారు.

"ధర్మరాజా ! నీవుండే అరణ్యమే మాకు శరణ్యం. ఆశ్రయించిన వాళ్ళు శత్రువులైనా విడిచిపెట్టకూడదంటారు. అలాంటప్పుడు మీ మీద భక్తి కలిగి మిమ్మల్ని ఆశ్రయించిన మమల్ని విడిచిపెట్టటం మీకు భావ్యమా ?" అని ఒక వృద్ధ బ్రాహ్మణుడు ప్రశ్నించాడు. ఏం చేయాలో పాలుపోక ధర్మరాజు బాధ పడుతుండగా, అప్పుడే అక్కడికి శౌనక మహాముని వచ్చాడు.

"మహాత్మా ! అతిథులను, అభ్యాగతులనూ అర్చించడం గృహస్థులకు ధర్మమని మీకు తెలుసు కదా ! అలాంటిది ఆశ్రయించి వచ్చిన వీరిని ఎలా ఉపేక్షించను ?" అని ధర్మరాజు సంశయం వెల్లడించాడు.

"నాయనా ! తపస్సు వల్ల సాధించరానిది ఏదీ లేదు. అందుచేత నువ్వు నియమవంతుడై తపస్సు చేసి నీ మనోరథం సఫలం చేసుకో" అని శౌనకుడు ధర్మరాజుకు తగిన సందేశమిచ్చి ప్రయాణమయ్యాడు.

'శౌనక మహాముని చెప్పినట్టు తపస్సు చేయాలి ! కాని ఎవరినుద్దేశించి తపస్సు చేయాలి?' ఇంకో ధర్మ సందేహం వచ్చింది ధర్మరాజుకు. వెంటనే ధౌమ్యుల వారికీ సంగతి చెప్పాడు.

ధౌమ్యుడు చాలా సేపు ఆలోచించి, "ధర్మరాజా ! పూర్వం ఈ భూప్రపంచం మీది జీవజాలం అంతా ఆహారం కోసం పరితపించింది. ఆ ఆర్తనాదాలు విని సూర్యభగవానుడు కరుణతో కరిగిపోయాడు. ఉత్తరాయణంలో ప్రవేశించి ఉర్వీరసాన్ని, దక్షిణాయనంలో ఓషదులు సంగ్రహించాడు. రాత్రి వేళల్లో చంద్ర కిరణాల్లో ఉన్న అమృతంతో ఆ ఓషధులను తడుపుతూ అభివృద్ధిపరిచాడు. వాటిల్లోంచి అన్నం పుట్టి ప్రజా జన, జీవజాలం రక్షించబడింది. అందుకే అన్నం ఆదిత్యమయం అని అంటారు.

పాండవాగ్రజా ! ఆదిత్యుడు లోకానికి ఆదారమైనవాడు. త్రిమూర్తుల స్వరూపాలు అతనిలో ఉన్నాయి. ముల్లోకాలూ అతని కనుసన్నల్లో సుఖంగా జీవిస్తున్నాయి. అతడు అంధకారాన్ని మింగి లోకానికి వెలుగును అందించే ప్రత్యక్ష దైవం కనుక నువ్వు కూడా ఆ కరుణామయుణ్ణి పూజించి అతని అనుగ్రహం సంపాదించు" అని ధౌమ్యుడు కర్తవ్యం బోధించాడు.

ధర్మరాజు ధౌమ్యుడు ఉపదేశించిన మంత్రాలను భక్తితో గ్రహించి తపస్సు చేశాడు. అతని జపానికి మెచ్చి సూర్య భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. "పాండునందనా ! ఇదిగో ఈ తామ్ర పాత్ర గ్రహించు. ఈ పన్నెండు సంవత్సరాలూ నీ వంటింట్లో ద్రుపద కుమారి వండిన కందమూలాలన్నీ అక్షయములైన నాలుగు రకాల ఆహార పదార్థాలవుతాయి" అని సూర్య భగవానుడు ధర్మరాజుకు అక్షయపాత్రను ప్రసాదించి అంతర్థానమయ్యాడు.

ధర్మరాజు అపరిమితానందంతో ఆ పాత్రను తీసుకుని పర్ణశాలకు తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి అక్షయపాత్ర వల్ల ద్రౌపతీదేవి అడిగిన వారికి లేదనకుండా భోజనాలతో సంతృప్తులను చేస్తూ వుండేది.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం