తాజా కథలు @ CCK

రామలింగా ! గోడల పైన ఏం చేశారు ? చిత్రాలెక్కడ ?

2015-05-21 21:05:01 చిన్నారుల కథలు
శ్రీ కృష్ణదేవరాయులు ఆస్థానంలో అష్ట దిగ్గజాలైన కవులు ఉండేవారు. వారిలో తెనాలి రామకృష్ణుడు అనే కవి సుప్రసిద్ధులు. ఈయనను తెనాలి రామలింగకవి అనికూడా పిలుస్తుంటారు. ఆయన మహా తెలివైనవారు, చక్కటి సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ, హాస్య కవిగా గుర్తింపు పొందిన ఈయనకు వికటకవి అనే బిరుదు కూడా కలదు.

ఒకసారి రాయల వారికి ఏమీ తోచకుండా ఉండటంతో, కోట గోడలకు వర్ణ చిత్రాలను తగిలిస్తే చాలా అందంగా ఉంటుంది కదా ! అని అనుకుంటారు. ఆ పని కోసం ఆయన ఓ చిత్రకారుడిని పిలిపించారు. ఆ చిత్రకారుడు తన సృజనతో చక్కటి చిత్రాలు గీసి తీసుకురాగా, అందరూ చాలా మెచ్చుకున్నారు. కానీ రామలింగకవికి మాత్రం చాలా ప్రశ్నలు తలెత్తాయి.

ఓ వ్యక్తి పక్కకు తిరిగి నిలబడిన చిత్రాన్ని చూసిన రామలింగ కవికి, "రెండో వైపు ఎక్కడున్నది, మిగిలిన శరీర భాగాలు ఏమైనాయి?" లాంటి సందేహాలు కలిగాయి. అదే విషయాన్ని రాయల వారి వద్ద ప్రస్తావించగా, "రామలింగా ! మీరు ఆ మాత్రం ఎరుగలేరా ? వాటిని మీరు ఊహించుకోవాలి కదా!" అన్నారు రాయలవారు.

"ఆహా ! అలాగా ప్రభూ ! బొమ్మలు ఇలాగేనన్నమాట వేసేది. నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమయ్యిందిలెండి" అన్నాడు రామలింగ కవి. అలా కొంత కాలం గడిచాక ఒక రోజు రాయల వారి వద్దకు వచ్చిన ఆయన, "మహారాజా ! కొన్ని నెలలుగా నేను రాత్రింబవళ్లూ కష్టపడి చిత్రకళను సాధన చేస్తున్నాను. మీ భవనం గోడల మీద కొన్ని చిత్రాలు గీస్తానని" అన్నాడు.

దీంతో సంతోషం పట్టలేని రాయల వారి ముఖం విప్పారింది. "అద్భుతం ! రామలింగకవి చిత్రాలు వేయటమా, వేయండి వేయండి. పాత మసిబారిన చిత్రాల్ని తీసివేసి, మీరు సరికొత్త చిత్రాలను గీసేయండి" అన్నాడు రాయల వారు ఉత్సాహంగా ! వెంటనే పాత చిత్రపటాల మీద సున్నం కొట్టించేసిన ఆయన తన సొంత చిత్రాలను గీయడం ప్రారంభించాడు.

ఆ చిత్రాలలో అక్కడొక కాలు, ఇక్కడొక కన్ను, ఇంకోచోట ఒక వేలు.... ఇలా గీశాడు రామలింగకవి. అలా గోడలన్నింటినీ శరీర భాగాలతో నింపిన ఆయన తన హస్తకళా నైపుణ్యాన్ని చూపించేందుకు రాయల వారిని తోడుకుని వచ్చారు. విడి విడి శరీర భాగాలను చూసిన రాజు గారు నివ్వెరపోయి, "ఏంటి రామలింగా ! గోడల పైన ఏం చేశారు ? చిత్రాలెక్కడ ?" అని ప్రశ్నించారు.

"ఈ చిత్రాలలో నేను వేయనిదాన్ని మీరు ఊహించుకోవాలి కదా, ప్రభూ!" అన్నాడు రామలింగకవి. రామలింగడి సమాధానంతో ఖంగుతిన్న రాయల వారు మౌనంగా ఉండిపోయారు. ఈ లోపు "తమరింకా నా చిత్రాల్లోని అత్యద్భుతమైన దాన్ని చూడనేలేదు   ప్రభూ !" అన్నాడు రామలింగడు.

రాయల వారికి తిరిగీ ఉత్సాహం పొడసూపగా పదండి చూద్దాం.... అంటూ తొందరపెట్టారు. రాయల వారిని ఓ గోడ వద్దకు తీసుకు వెళ్లి ఎలా ఉందో చూడమన్నాడు రామలింగకవి. చూస్తే ఆ గోడ ఖాళీగా ఉంది. ఆకుపచ్చని రంగు గల గీతలు మాత్రం గోడలో అక్కడక్కడా ఉన్నాయి.

"ఇదేంటి రామలింగా ?" అని అడిగాడు రాయల వారు ఉస్సూరుమంటూ.... "గడ్డి మేస్తున్న ఆవు ప్రభూ !" బదులిచ్చాడు రామలింగడు. మరి గడ్డెక్కడ ? అన్నాడు మహారాజు. ఆవు తినేసింది కదండీ అన్నాడు రామలింగడు. మరి ఆవెక్కడ ఉంది ? తిరిగీ ప్రశ్నించాడు రాయలవారు. గడ్డిని మేసేసిన తరువాత ఆవు ఇంటికి వెళ్లిపోయింది ప్రభూ ... అన్నాడు రామలింగడు. రామలింగ కవి తెలివితేటలను మనసులోనే అభినందించిన రాయలవారు మరేమీ అడగలేక నోరు వెళ్లబెట్టేశారు.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం