తాజా కథలు @ CCK

కాయలు ముంతడేసి, గింజలు చారడేసి

2015-02-21 06:05:43 చిన్నారుల కథలు
ఒకానొక రోజున కాకికి బాగా ఆకలిగా ఉండటంతో మర్రి పండునొక దానిని తీసుకొచ్చి, తాటి చెట్టుపై కూర్చుని తినసాగింది. కాకి మర్రి పండును తింటుండగా, పండులోని మర్రి గింజ రాలి తాటి మట్టల మధ్య పడిపోయింది. ఆ చిన్న మర్రి పండు విత్తనాన్ని చూసిన తాటి చెట్టు ఎగతాళిగా నవ్వింది.

"నా కాయలు ముంతడేసి, గింజలు చారడేసి ఉన్నాయి. ఇనుప గుండ్ల లాంటి నా కాయలను చూస్తే అందరికీ భయమే. అందుకే నా నీడలో నిలబడరు. మనుషుల పైన గానీ, జంతువుల మీద గానీ నా కాయలు రాలి పడితే, వారి నడ్డి విరిగి పోతుంది. ఇంత చిన్న గింజ నుండి ఎంత పెద్ద మొక్క వస్తుందని" గేలి చేసింది తాటి చెట్టు.

మర్రి గింజ పైన, తాటి చెట్టు రకరకాలుగా జాలి పడి నవ్వుకోసాగింది. అలా నవ్వి నవ్వి తాటి చెట్టు అలసిపోయింది. కాకి కూడా ఆ చెట్టు మీద నుంచి ఎగిరి వెళ్లిపోయింది. మర్రి విత్తనం మాటను కూడా మెల్లిగా మర్చిపోయింది తాటి చెట్టు. అలాగే కొంత కాలం గడిచింది. తాటి మట్టల మధ్యన మర్రి గింజ మొలకెత్తి, చిన్న చెట్టుగా అవతరించింది.

అప్పుడు కూడా చిన్నదిగా ఉన్న మర్రి చెట్టును చూసి గేలి చేసింది తాటి చెట్టు. నువ్వెంత, నువ్వు నన్నేమీ చేయలేవనీ ఎగతాళి చేస్తూ నవ్వింది. తాటి చెట్టు మాటలన్నింటినీ ఓపికగా విన్న మర్రి చెట్టు క్రమంగా పెరగసాగింది. రోజు రోజుకీ మరింత పెద్దదవసాగింది. కొంత కాలానికి మర్రి చెట్టు తాటి చెట్టును మించిపోయేలాగా పెరిగిపోయింది. తనకంటే బలవంతులెవరూ లేరని ఇంత కాలం విర్రవీగిన తాటి చెట్టు క్రమంగా మర్రి మాను కౌగిట్లో బందీయై ప్రాణాలు విడిచింది.

నీతి :

ధనముందని, బలముందని అహంకారంతో మంచి వారిని కించపరిచినా, వారికి చెడు చేయాలని ప్రయత్నించినా చివరకు తాటి చెట్టుకు పట్టిన గతే పడుతుందని అర్థం చేసుకోవాలి.

సంబధిత కథలు/వ్యాసాలు

మీ అభిప్రాయం